ఇంటర్వ్యూ: సుకుమార్ – సినిమా హిట్టవడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ !

నిన్న విడుదలైన రామ్ చరణ్, సమంతల చిత్రం ‘రంగస్థలం’ బ్రహ్మాండమైన టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సక్సెస్ సందర్బంగా సుకుమార్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
జ) చాలా హ్యాపీగా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు.

ప్ర) సంవత్సరంపాటు కష్టపడ్డారు..ఇక రిలాక్స్ అవుతారా ?
జ) రిలాక్స్ అంటే నా కుటుంబంతో కొంత సమయం గడపాలని ఉంది. ముఖ్యంగా నా పిల్లలతో.

ప్ర) సినిమా ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం ఏమిటనుకుంటున్నారు ?
జ) రామ్ చరణ్. ఆయన నటన వలనే సినిమా ఈ స్థాయిలో విజయాన్ని అందుకుంది. చాలా బాగా నటించారు.

ప్ర) ఈ సక్సెస్ పట్ల చిరంజీవి ఎలా స్పందించారు ?
జ) చాలా సంతోషంగా ఉన్నారు. విడుదల తర్వాత నేను వెళ్లి కలవగానే గట్టిగా కౌగిలించుకుని అభినందించారు.

ప్ర) చిట్టబాబు పాత్రను మలచడానికి ఎలాంటి హోమ్ వర్క్ చేశారు ?
జ) హోమ్ వర్క్ అంటే వినికిడి లోపం ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారు, పల్లెటూరులోని మనుషులు ఎలా ఉంటారు అనే విషయాలపై ఎక్కువగా స్టడీ చేశాను.

ప్ర) కథ రాయడానికి ఎక్కువ సమయం తీసుకునే మీరు ఈ కథకు ఎంత టైమ్ తీసుకున్నారు ?
జ) నేను కథలు రాయాలంటే కొన్ని నెలలు తీసుకుంటాను. కానీ ఈ కథను మాత్రం కేవలం 20 నిముషాల్లో పూర్తిచేసేశాను. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేయడానికి కొంత టైమ్ తీసుకున్నాను.

ప్ర) ఈ కథ రాయడానికి ప్రధాన స్ఫూర్తి ?
జ) ముందుగా ఈ సినిమాలోని క్లైమాక్స్ నాకు తట్టింది. దాని ఆధారంగానే మిగతా కథ మొత్తం అల్లుకున్నాను. సినిమా మొదలుపెట్టకముందే ఒక విలేజ్ డ్రామా చేయాలని నిర్ణయించుకున్నాను.

ప్ర) మీ నిర్మాతలు, ఇతర టీమ్ ఎలాంటి సహకారం అందించారు ?
జ) మా నిర్మాతలు నిజంగా చాలా సహకరించారు. నన్ను నమ్మి ఎక్కడా తగ్గకుండా ఖర్చు పెట్టారు. మొదట్లో చరణ్ మినహా మిగిలిన పాత్రల్లో చిన్న నటుల్ని తీసుకోవాలని అనుకున్నాను. కానీ నిర్మాతలు మంచి కథలో మంచి నటులుంటే బాగుంటుదన్నారు. ఇక మిగత ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, రత్నవేలు, డైరెక్షన్ టీమ్ అందరూ కష్టపడ్డారు. ఇది మా అందరి విజయం.

ప్ర) బన్నీతో సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి ?
జ) అలాంటిదేం లేదు. ఇంకా ఏ హీరోతో చేయాలనేది నిర్ణయించుకోలేదు.

ప్ర) మరి కథలు సిద్ధంగా ఉన్నాయా ?
జ) 2, 3 కథలున్నాయి. వాటికి ఏ హీరో సరిపోతాడు అనేది త్వరలో నిర్ణయించుకుని చెప్తాను.

ప్ర) ఇకపై కూడ మీ నుండి ఇలాంటి విలేజ్ డ్రామాల్ని ఆశించవచ్చా ?
జ) తప్పకుండా. ఇకపైన కూడ గ్రామీణ నైపథ్యంలో సినిమాలు చేస్తాను.