రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాజా సాబ్’ (The Raja Saab)హారర్–కామెడీ జానర్‌లో ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందడిని రెట్టింపు చేస్తూ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రిద్ధి కుమార్ మాట్లాడుతూ, ‘రాజా సాబ్’ ఈవెంట్‌కు ప్రభాస్ గారు లేకపోవడం మిస్ అవుతున్నామని అన్నారు. సెకండ్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందని, రొమాన్స్, యాక్షన్, హారర్ ఎలిమెంట్స్‌తో సినిమా మొత్తం ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. సినిమా చూస్తూ ప్రేక్షకులు ఓ ఫాంటసీ వరల్డ్‌లోకి వెళ్లిన అనుభూతి పొందుతారని చెప్పారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మారుతి గారికి, విశ్వప్రసాద్ గారికి, అలాగే తన కో-స్టార్స్ మాళవిక, నిధి అగర్వాల్‌తో పాటు ‘రాజా సాబ్’ టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ, ‘రాజా సాబ్’ షూటింగ్ సెట్ తమకు మరో ఇంటిలా మారిపోయిందని, తన కెరీర్‌లో ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పారు. ఇంత సరదాగా మరే సెట్‌లోనూ గడపలేదని, ఈ సినిమా తర్వాత తాను కూడా ప్రభాస్ ఫ్యాన్ అయ్యానని తెలిపారు. ఈ రోజు ఈవెంట్‌లో ఆయన లేకపోవడం మిస్ అవుతున్నామని, సినిమా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చిందని, ప్రేక్షకులు ‘రాజా సాబ్’తో సంక్రాంతిని సెలబ్రేట్ చేస్తారని అన్నారు.
ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ మాట్లాడుతూ, ‘రాజా సాబ్’ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 9న థియేటర్లలో సినిమా చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, వారి రెస్పాన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు.
క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాట్లాడుతూ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎన్నో సూపర్ హిట్స్‌తో దాదాపు 50 చిత్రాలకు చేరుకుందని తెలిపారు. ‘రాజా సాబ్’ విశ్వప్రసాద్ గారికి, తన సోదరి కృతికి పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, ప్రభాస్‌ను మారుతి ప్రెజెంట్ చేసిన విధానం ప్రత్యేకమని అన్నారు. బుక్‌మైషో బుకింగ్స్ చూస్తే గూస్‌బంప్స్ వస్తున్నాయని, థమన్ మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పారు. ప్రీమియర్స్ తర్వాత ప్రభాస్ నటన, మారుతి టేకింగ్ గురించే మాట్లాడతారని ధీమా వ్యక్తం చేస్తూ, “ఈసారి కోళ్ల కాదు… డైనోసార్ మీద పందెం వేయండి” అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ, ‘రాజా సాబ్’ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా అని అన్నారు. ఈ సినిమా కోసం మారుతి ఎంతో కష్టపడ్డారని, ఇంత భారీ చిత్రాన్ని నిర్మించడం సాధారణ విషయం కాదని చెప్పారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉండటంతోనే ప్రత్యేకమైన బీజీఎం ఇవ్వగలిగానని, ఇది రెగ్యులర్ సినిమాల మాదిరి కాదని తెలిపారు. ‘రెబల్ సాబ్’, ‘సహన సహస’ ట్రెండ్ అయ్యాయని, ఇప్పుడు ‘నాచె నాచె’ మరింత పెద్ద హిట్ అయిందని చెబుతూ, ఆ పాటలో ప్రభాస్ డ్యాన్సులు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. డ్యాన్సులతో పాటు ప్రభాస్ ఓవరాల్ పర్‌ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, సంక్రాంతికి మారుతి ఒక బ్యాంగర్ మూవీ ఇస్తున్నారని చెప్పారు.
ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, ‘రాజా సాబ్’ ఈవెంట్‌కు అన్ని భాషల నుంచి వచ్చిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. మూడేళ్ల క్రితం మొదలైన ఈ ప్రయాణం హారర్ కామెడీగా ప్రారంభమై, తర్వాత భారీ స్కేల్‌తో హారర్ ఫాంటసీగా మారిందని చెప్పారు. ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో ఇలాంటి భారీ హారర్ ఫాంటసీ రాలేదని, హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ బ్యాలెన్స్‌గా కుదిరాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన బజ్ ఉందని, నార్త్ ఇండియాలో 4500 స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతోందని చెప్పారు. ప్రభాస్‌ను బాహుబలి ముందు ఎలా చూశారో అలా ‘రాజా సాబ్’లో చూడబోతారని, చివరి 40 నిమిషాలు గ్లోబల్ ఇంపాక్ట్ ఇస్తాయని, ఫస్ట్ డే 100 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ, ‘రాజా సాబ్’ భవంతి సెట్ దాదాపు ఏడాదిన్నర తమకు మరో ఇంటిలా మారిందని అన్నారు. హారర్ ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ సినిమాను తమన్ మ్యూజిక్ మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని, ప్రభాస్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకున్నారో అలా ఈ చిత్రంలో కనిపిస్తారని చెప్పారు. రేపు ప్రీమియర్స్ తర్వాత ప్రేక్షకులు థియేటర్‌లోకి వెళ్లినదానికంటే రెట్టింపు ఆనందంతో బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేస్తూ, ప్రభాస్ తనపై పెట్టిన నమ్మకానికి తాను పూర్తి న్యాయం చేయాలని ప్రయత్నించానన్నారు. ‘రాజా సాబ్’ ఒక డిస్నీ మూవీలా ఉంటుందని, ‘నాచె నాచె’ పాట తనకు, ప్రభాస్‌కు ఫేవరేట్ అని చెప్పి, మూడేళ్లుగా తమ దగ్గరున్న సినిమా ఇప్పుడు ప్రేక్షకుల చేతుల్లోకి వచ్చిందని, ఇక వారి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.


