ఇంటర్వ్యూ : విజయ్ దేవరకొండ – పోర్న్ సైట్స్ లానే.. ఫైరసీ సైట్స్ ను కూడా బ్యాన్ చెయ్యాలి.

Published on Nov 15, 2018 3:36 pm IST

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘టాక్సీవాలా’. ఈ సినిమా నవంబర్‌ 17న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం..

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో టెక్నీషయన్స్ గురించి చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు మిమ్మల్ని అంతగా ప్రభావితం చేశారా ?

వాళ్ళు నన్ను ప్రభావితం చేసారు అనేదాని కంటే.. సినిమా కోసం వాళ్ళు ప్రాణం పెట్టారు అనడం కరెక్ట్. అయినా నేను మా టెక్నీషయన్స్ గురించి అలా చెప్పడానికి ప్రధాన కారణం సినిమా కోసం వాళ్ళు ఎంత కష్ట పడ్డారో, సినిమా ఫైరసీ అయినప్పుడు వాళ్ళు ఎంత పెయిన్ అనుభవించారో అందరికీ తెలియాలి. అప్పుడే మా పెయిన్ ఆడియన్స్ కి అర్ధమవుతుంది. అందుకే ఆడియో ఫంక్షన్ లో అలా మాట్లాడాను.

‘గీత గోవిందం’ కూడా ఫైరసీ అయింది. కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్. సినిమా బాగున్నప్పుడు ఫైరసీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందిగా ?

నిజమే. కానీ అన్ని సినిమాలకి అలాగే జరగాలని లేదుగా. ఫైరసీ వల్ల మా సినిమాకి ఏమైన ఎఫెక్ట్ అవుతుందా ? ఆడియన్స్ సినిమా చూడటానికి థియేటర్స్ కి వస్తారా లేదా అన్న టెన్సన్స్ అయితే ఉంటాయిగా. పెళ్లి చూపులు సినిమా ఫైరసీ జరిగి ఉండి ఉంటే.. నాకు ఆ తరువాత సినిమాలు వచ్చి ఉండేవి కావు. నేను ఇంతదూరం వచ్చి ఉండేవాడ్ని. ఏమైనా ఫైరసీని బ్యాన్ చెయ్యాలి. పోర్న్ సైట్స్ ను బ్యాన్ చేసినట్లుగానే ఫైరసీ సైట్స్ ను కూడా బ్యాన్ చెయ్యాలి.

అయినా మీ సినిమాలు మాత్రమే ఎందుకు ఫైరసీ అవుతున్నాయి. కామన్ ఆడియన్ కి కూడా ఇదే డౌట్ ఉంది. ఎవరన్నా కావాలని చేస్తున్నారా ?

మీకు లాగే ఆ విషయం గురించి నాక్కూడా తెలియదు. అయితే ఎవరో కావాలని నా సినిమాల్ని ఫైరసీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. ఫైరసీ అనేది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో టీమ్ లో ఉన్న వ్యక్తినే చెయ్యడానికి అవకాశం ఉంది. ‘గీత గోవిందం’ కూడా అలాగే ఫైరసీ అయింది. ఏమైనా ఒక సినిమాని ఫైరసీ చేస్తే.. ఆ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరి లైఫ్ తో ఆడుకున్నట్లే. దీని వల్ల చాలా టెన్షన్ కి ప్రెజర్ కి గురి అవ్వాల్సి వస్తోంది.

మరి ఫైరసీని కంట్రోల్ చెయ్యటానికి ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ?

అసలు ఎవరు ఫైరసీ చేస్తున్నారో తెలిస్తే కదా.. వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవటానికి. చాలా ఫైరసీ సైట్స్ ఉన్నాయి. ఫస్ట్ వాట్ని బ్యాన్ చేసేయాలి. అప్పుడే ఫైరసీ పోతుంది.

‘టాక్సీవాలా’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మీరు వాట్ని అందుకోగలరా ?

నేను ఈ ఎక్స్ పేటెక్షన్స్, అంచనాలు అనేవి అస్సలు నమ్మను. ఎవరైనా సినిమా బాగుంది అంటేనే చూస్తారు. లేదంటే ఎవ్వరు చూడరు. నేను అదే నమ్ముతాను. కానీ చాలామంది నాతో కూడా అంటుంటారు నీ సినిమా పై భారీ ఎక్స్ పేటెక్షన్స్ ఉన్నాయని. నేను వాట్ని సీరియస్ గా తీసుకోను.

నోటా మూవీ రిజల్ట్స్ ని మీరు ముందే ఊహించారా ?

నోటా మూవీ రిలీజ్ కి ముందురోజే నేను ఆ సినిమాని చూసాను. నాకు అప్పుడే సినిమాలో కొన్ని ప్రోబ్లెమ్స్ ఉన్నాయని అర్ధం అయింది. కానీ రేపు రిలీజ్ పెట్టుకొని, ఈ రోజు ఏమి చెయ్యలేం కదా. నాక్కూడా ఏదో చేయ్యాలని ఉంటుంది ఒక్కోసారి అది వర్కౌట్ అవుతుంది, ఇంకోసారి కాదు.

‘టాక్సీవాలా’ ని చాలా కాలం షూట్ చేసినట్లు ఉన్నారు. మళ్లీ రీ షూట్ ఏమైనా చేశారా ?

పెళ్లి చూపులు తరువాత ఒప్పుకున్న సినిమా ‘టాక్సీవాలా’. నేను ఈ కథ విన్నప్పుడే చాలా బాగా ఎంజాయ్ చేశాను. కథ చెప్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చక్కగా వచ్చి సినిమా చూసే విధంగా ఉంటుంది.

ట్రైలర్ లో హర్రర్ ఎలిమెంట్స్ కూడా బాగా హైలెట్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రధానంగా మేం ఏం ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు ?

ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సినిమలో క్యారెక్టర్స్ పడే ఇబ్బందులకు, చేసే పనులకు మనకు ఆటోమేటిక్ గా నవ్వు వస్తోంది.

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో బన్నీ మిమ్మల్ని చాలా బాగా పొగిడారు. అవి తల్చుకున్నపుడు మీకు ఎలా అనిపిస్తోంది ?

నిజంగా నేను వాట్ని వీలైనంత త్వరగా మర్చిపోవటానికి ట్రై చేస్తున్నాను. బన్నీ ఆన్న, చిరంజీవి సర్ నా గురించి మాట్లాడటం అది వాళ్ళ గొప్పతనం. అంతటి స్టార్స్ నా గురించి అలా మాట్లాడటం నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను.నాకు ఏభై సంవత్సరాలు వచ్చాక నా గురించి వాళ్ళు మాట్లాడినవి పెట్టుకొని గ్లాస్ లో మందు పోసుకొని తాగుతూ.. ఎంజాయ్ చెయ్యాలని ఉంది.

మీరు ఎక్కువుగా కొత్త డైరెక్టర్స్ తోనే చేస్తున్నారు. పెద్ద డైరెక్టర్స్ తో చేస్తే మీ మార్కెట్ ఇంకా పెరుగుతుంది కదా ?

అలా నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. నాకు కథ నచ్చితే.. ఆ సినిమానే చేస్తూ వచ్చాను. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఓ పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాను. ఆయన ఎవరో ఇప్పుడు చెప్పలేను గాని, ఆయన సినిమాలకి మాత్రం నేను పెద్ద అభిమానిని. అలాంటిది ఆయనే నాతో ఓ సినిమా చేస్తావా అని నన్ను అడగటం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నెక్స్ట్ ఇయర్ మాత్రం హండ్రెడ్ పర్సంట్ ఆ పెద్ద డైరెక్టర్ తో సినిమా ఉంటుంది.

మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి ?

ప్రస్తుతం డియర్ కామ్రేడ్ జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ మళ్లీ షూట్ కి వెళ్లనున్నాము. ఆల్ మోస్ట్ థర్టీ పర్సెంట్ సినిమా అయిపోయింది. అది నెక్స్ట్ ఇయర్ మిడిల్ లో రిలీజ్ అవుతుంది.

సంబంధిత సమాచారం :

X
More