రాజమౌళి కాంపౌండ్లో మంచు విష్ణు కథ !

‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకురాబోతున్న మంచు విష్ణు త్వరలో దర్శకుడిగా మారబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండటం విశేషం. ‘బాహుబలి’తో సహా పలు సూపర్ హిట్ సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథలను అందించిన సంగతి విధితమే.

హీరోగా కొనసాగుతున్న విష్ణు దర్శకత్వం వహించాలని ఎప్పటి నుండో అనుకుంటున్న తరుణంలో విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో ఆ కథతోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట విష్ణు. ఈ సినిమాతో పాటు ‘భక్త కన్నప్ప’ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించాలన్న ఆలోచనలో విష్ణు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ ను తనికెళ్ళ భరణి పూర్తి చేసినట్లు సమాచారం.