అభిమానుల ఆ ఒక్క కోరికనైనా పవన్ నెరవేరుస్తాడా?

pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. సినిమాలు, రాజకీయ కార్యక్రమాలు, వ్యవసాయం.. ఇలా ఎప్పుడు ఏ పనిలో పడిపోతారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక కొద్దికాలం క్రితం సినిమాలు మానేస్తానని ప్రకటించి, అభిమానులను తీవ్రంగా నిరుత్సాహపరిచిన ఆయన తాజాగా ఆ ఆలోచనను వెనక్కి తీసుకొని వరుసగా సినిమాలు చేసేందుకే ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘కాటమరాయుడు’ అనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళగా, తాజాగా ఈ ఉదయమే నేసన్ దర్శకత్వంలో మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా, పవన్ కళ్యాణ్ తెలుగు స్టార్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేయకపోవడం మాత్రం ఆయన అభిమానులను నిరుత్సాహపరుస్తోంది. బాబీ, డాలీ, నేసన్.. ఇలా దర్శకులుగా స్టార్ స్టేటస్ లేని వాళ్ళతోనే పవన్ సినిమాలు చేస్తూ ఉండడంతో, ఒక స్టార్ డైరెక్టర్‌తో ఆయన మంచి కమర్షియల్ సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎంతగానో తపిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ 25వ సినిమా అయినా స్టార్ డైరెక్టర్ చేయాలని అభిమానులంతా కోరుకుంటున్నారు.

పవన్ కెరీర్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం కానున్న 25వ సినిమాకు ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకుడవ్వాలన్నది అభిమానుల బలమైన కోరిక. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేదీ’ లాంటి అదిరిపోయే హిట్స్ వచ్చాయి. దీంతో ఇప్పుడు వీరిద్దరూ కొట్టే హ్యాట్రిక్ పవన్ 25వ సినిమాయే అవ్వాలని కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ కూడా పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేసేందుకు సిద్ధం కావడంతో అభిమానుల ఈ కోరిక నెరవేరుతుందనే అనుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఆలోచన ఎలా ఉందో అన్నది కూడా గమనించాల్సిన విషయం.