మేదరమెట్ల సిద్ధం సభలో వెల్లువలా జన ప్రభంజనం

మేదరమెట్ల సిద్ధం సభలో వెల్లువలా జన ప్రభంజనం

Published on Mar 10, 2024 9:55 AM IST

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో పలు పార్టీలు అప్పుడే ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు సభలు, సమావేశాలతో వారికి చేరువ అవుతున్నాయి. తాజాగా అధికార వైసిపి పార్టీ మేదరమెట్లలో సిద్ధం సభ ఏర్పాటు చేసారు. దీనికి దాదాపుగా 15 లక్షల మంది వరకు ప్రజలు తరలిరావడం, అక్కడి ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా జనసందోహంతో నిండిపోవడం జరిగింది. ఈ నాలుగవ సిద్ధం సభలో ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. బిందువు బిందువు కలిసి సింధువైనట్లుగా నా మీద, నా పార్టీ మీద నమ్మకంతో ప్రభంజనంలా సిద్ధమంటూ ఉప్పెనలా తరలి వచ్చిన జన సమూహం ఓ మహా సముద్రంలా కనిపిస్తోందన్నారు జగన్‌. 

బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలో మేదరమెట్ల సిద్ధం సభలో ప్రతిపక్షాలపై ఆయన విమర్శలు గుప్పించారు. దత్తపుత్రుడు, ఎల్లో మీడియా, ఢిల్లీ బీజేపీ పెద్దలు కలిసి వైయస్సార్ కాంగ్రెస్ ను ఎదుర్కోవాల్సిన అవసరం ఏముందని చంద్రబాబును ప్రశ్నించారు. ఏపీలో నోటా కంటే బీజేపీకి తక్కువ ఓట్లు ఉన్నాయని సీఎం ఎద్దేవా చేశారు. తుప్పు పట్టిన సైకిల్ అంటూ టీడీపీ గుర్తు చేస్తూ చంద్రబాబును, టీడీపీని ట్రోల్ చేశారు. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు నాపై నమ్మకంతో వచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు. మరో ఐదేళ్లు ఈ ప్రయాణం కొనసాగిద్దాం. పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్ధమా అని సీఎం జగన్‌ అనగానే లక్షల మంది సిద్ధం అంటూ బదులిచ్చారు. సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధమని ఓ ప్రజా సముద్రమని సీఎం జగన్‌ తెలిపారు. 

తనకు ఓడించాలని ప్రతిపక్షాలు అన్ని కలిసికట్టుగా వస్తుంటే పేదలను గెలిపించాలని తాను చూస్తున్నానన్నారు జగన్‌. మరో చారిత్రక యుద్ధానికి సిద్ధమా అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబులా తనకు పొత్తులు లేవన్నారు. ప్రజలే తనకు స్టార్‌ క్యాంపెనర్లని జగన్ స్పష్టం చేశారు. ఇది ధర్మ, అధర్మాల మధ్య జరిగే యుద్ధమన్నారు జగన్‌. మొత్తంగా ఎంతో కోలాహలంగా లక్షలాది జనసమూహం మధ్య ప్రస్తుతం సిద్ధం సభ జరుగుతోంది. కాగా ప్రస్తుతం ఈ సభ తాలూకు వీడియో లకు యూట్యూబ్ లో కూడా విపరీతంగా వ్యూస్ రావడంతో పిక్స్ కూడా పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు