లోక్‌సభ స్థానాల అభ్యర్థుల కోసం బాబు అన్వేషణ

లోక్‌సభ స్థానాల అభ్యర్థుల కోసం బాబు అన్వేషణ

Published on Jan 7, 2024 10:42 AM IST

ఇప్పటికే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప స్థాయి సీట్లు సంపాదించిన టీడీపీ, రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించేందుకు పలు విధాలుగా ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారబోతోంది. పైకి పార్టీలో దూకుడు కనిపిస్తున్నా క్షేత్రస్తాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలూ తలోదారిలో ఉన్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి, పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక గుంటూరు ఎంపీగా ఉన్న జయదేవ్ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈసారి పోటీ చేయలేనని తేల్చి చెప్పారు. 

అటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలే ఇలా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో మిగతావాళ్లు కూడా పోటీకి ఆసక్తి చూపడం లేదు. ఇక మిగిలిన ఎంపీ నియోజకవర్గాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక రాయలసీమలో తిరుపతి స్థానం నుంచి పోటీలో ఉండే సినీనటుడు శివప్రసాద్ ఇటీవల మరణంతో అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి ఇంకా దొరకడం లేదు. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి ఉంది. అలానే నరసరావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి ఏకంగా పార్టీకే దూరంగా ఉంటున్నారు. బాపట్లలో పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే. ఇలా 25 నియోజకవర్గాల్లో సగానికిపైగా స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు. దీంతో పక్క పార్టీల్లో ఉన్న నాయకులు ఎవరైనా  తమ పార్టీలోకి వస్తారేమోనన్న ఆశతో అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు