సమీక్ష : ఆమె.. అతడైతే.. – పాయింట్ బాగానే ఉన్నా.. ప్రయత్నం ఆకట్టుకోలేదు !

సమీక్ష : ఆమె.. అతడైతే.. – పాయింట్ బాగానే ఉన్నా.. ప్రయత్నం ఆకట్టుకోలేదు !

Published on Nov 12, 2016 1:05 PM IST
Aame Athadaithe review

విడుదల తేదీ : నవంబర్ 12, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : కె . సూర్య నారాయణ

నిర్మాత : మల్లినేని మారుతీ ప్రసాద్, నెట్టెం రాధాకృష్ణ

సంగీతం : యశోకృష్ణ

నటీనటులు : హనీష్, చిరా శ్రీ

క్లాసికల్ డాన్సర్ హనీష్ హీరోగా, కన్నడ నటి సిరా శ్రీ హీరోయిన్ గా కె. సూర్యనారాయణ దర్శకత్వంలో మల్లినేని మారుతీ ప్రసాద్, నెట్టెం రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘ఆమె.. అతడైతే’. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల కోసమే సరికొత్త కథాంశంతో రూపొందినదని దర్శకనిర్మాతలు చెబుతున్న ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఏ మేరకు కొత్తదనాన్ని పరిచయం చేసిందో ఇప్పుడు చూద్దాం….

కథ :

సుధాకర్ (హనీష్) అనే పల్లెటూరి కుర్రాడు తన తండ్రి కోరిక మేరకు కలెక్టరవుదామనుకుని హైదరాబాద్ సిటీకి వస్తాడు. కానీ సిటీలోని కల్చర్ తెలీక ఇబ్బందిపడుతుంటాడు. అలాంటి సమయంలో అనుకోకుండా అతని తండ్రి మరణిస్తాడు. దాంతో చదువుకోడానికి సహాయం చేయమని తెలిసిన వాళ్లందరినీ అడుగుతాడు. కానీ ఎవరూ సహాయం చేయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో భాధపడుతుంటాడు.

అలా కష్టాల్లో ఉన్న అతనికి ఒక ఆలోచన వచ్చి వెంటనే అమ్మాయిగా మారిపోతాడు. సుధాకర్ అలా అమ్మాయిగా ఎందుకు మారాడు ? మారి ఏం చేశాడు ? చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా.. లేదా ? అన్నదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ లోకి వెళితే ముందుగా ఫస్టాఫ్, సెకండాఫ్ లలో నడిచే కుటుంబపరమైన సెంటిమెంట్ సన్నివేశాల గురించి చెప్పుకోవాలి. తన కొడుకుని కలెక్టర్ని చేయాలన్న ఆశతో తపన పడే తండ్రి పాత్రలో తనికెళ్ళ భరణి బాగా నటించాడు. ఆయనపై నడిచే ఆ సెంటిమెంట్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే కష్టాల్లో ఉన్న హీరో తన లక్ష్యం కోసం అమ్మాయిగా మారడం అనే ఒక భిన్నమైన దారిని ఎంచుకోవడం బాగుంది. పెళ్లి కోసం తాపత్రయ పడే ఏజ్ బార్ వ్యక్తిగా అలీ కామెడీ అక్కడక్కాడా పర్వాలేదనిపంచింది.

మైనస్ పాయింట్స్ :

ఒక అబ్బాయి తన లక్ష్యం కోసం అమ్మాయిగా మారితే ఎలా ఉంటుంది అనే పాయింట్ బాగానే ఉన్నా దానికి సరైన కథ, కథనాలను రాసుకోవడంలో దర్శకుడు, రచయిత ఆయిన సూర్యనారాయణ పూర్తిగా విఫలమయ్యారు. పైగా హీరో లేడీ గెటప్ లోకి మారడం అనే సాహసోపేతమైన అంశాన్ని టచ్ చేసేటప్పుడు ప్రేక్షకుడికి ఎక్కడా విసుగు, నిరుత్సాహం కలగకుండా ఎంటర్టైన్మెంట్ తోనో లేకపోతే బలమైన కథనంతోనో సినిమాని నడపాలి. కానీ ఇందులో అలాంటి ఎంటర్టైన్మెంట్, బలమైన కథనం ఏమీ లేవు. పైగా హీరోని లేడీ గెటప్ లో చూస్తున్నంత సేపు విసుగుపుడుతుంది. అమ్మాయి వేషంలో హీరో తన ఫ్రెండ్స్ ని కవ్వించడం లాంటి సన్నివేశాలైతే మరీ చిరాకు తెప్పిస్తాయి.

ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో లేడీ గెటప్ లో ఉన్న హీరో పై నడిచే పాట మరీ బోర్ కొట్టించింది. ఫస్టాఫ్, సెకండాఫ్ ఎక్కడా సినిమా ఆకట్టుకునే విధంగా లేదు. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలు చికాకు పుట్టించాయి. హీరో పాత్రలో హనీష్ నటన ఆకట్టుకోకపోగా లేడీ గెటప్ వేసినప్పుడు అయితే ఇంకా విసుగు తెప్పించిందనే చెప్పాలి. ఇక అలీ పై నడిచే కామెడీని మినహాయిస్తే మిగతా ఎక్కడా ఎంటర్టైన్మెంట్ అనేదే కనిపించలేదు. క్లైమాక్స్ లో అయితే సినిమాని మరీ హడావుడిగా ముగించేశారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగానికొస్తే రచయిత, దర్శకుడు కె. సూర్యనారాయణ తయారు చేసిన కథ దాన్ని తెరపైకెక్కించిన తీరు ఎక్కడా ఆకట్టుకోలేదు. ఒక్క ఫాథర్ సెంటిమెంట్ సన్నివేశాలు తప్ప మిగిలిన ఏ సన్నివేశంలోనూ బలం లేదు. యశోకృష్ణ సంగీతం అస్సలు బాగాలేదు. హను కాక కెమెరా పనితనం, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ అంతగా ఆకట్టుకోలేదు. మల్లినేని మారుతీ ప్రసాద్, నెట్టెం రాధాకృష్ణ ల నిర్మాణ విలువలు పర్వాలేదనిపంచాయి.

తీర్పు :

కథకు ప్రధానమైన హీరో పాత్ర లక్ష్యం కోసం అమ్మాయిగా మారితే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కథ. ఇందులో ఫాదర్ సెంటిమెంట్, హీరో అమ్మాయి గా మారడం లాంటి అంశాలు ప్లస్ పాయింట్స్ కాగా ఏమాత్రం ప్రభావం చూపలేని బోరింగ్ కథా కథనాలు, అమ్మాయి వేషంలో ఆకట్టుకోలేకపోయిన హీరో నటన, విసుగు తెప్పించే పాటలు మైనస్ పాయింట్స్. మొత్తం మీద చెప్పాలంటే హీరో పాత్రని అమ్మాయిగా మార్చడం అనే సాహసోపేతమైన పాయింట్ బాగానే ఉన్నా కూడా ఆకట్టుకోలేని ప్రయత్నమే ఈ ‘ఆమె.. అతడైతే..’

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు