సమీక్ష : అకీరా – అక్కడక్కడా నవ్వించే కామెడీ..!

Akira review

విడుదల తేదీ : నవంబర్ 4, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : ప్రదీప్ మమ్ముట్టి

నిర్మాత : దీప వర్ధన్

సంగీతం : జయంత్

నటీనటులు : విరాట్, అనూష, రాకేష్, ఆర్పీ..

హర్రర్ కామెడీ అన్నది ఇప్పుడు తెలుగులో హాట్ ఫేవరైట్ జానర్స్‌లో ఒకటి. ఈ నేపథ్యంలోనే ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వచ్చిన హర్రర్ కామెడీయే ‘అకీరా’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా నేడు పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ అకీరా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

సంజయ్(విరాట్), అక్ష (అనూష), రాకేష్, ఆర్పీ తదితరులు ఇంటీరియర్ డిజైన్ పనిమీద ఒక బంగ్లాకు వస్తారు. పాడు పడ్డ బంగ్లాను బాగు చేయాలన్న వీరి ప్రయత్నాలు జరుగుతుండగానే ఆ బంగ్లాలో వీరికి వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ అనుభవాలేంటీ? వారిని భయపెట్టేది ఎవరు? ఆ ఇంట్లో దయ్యం ఉందా? ఉంటే ఆ దయ్యం బారినుంచి వీరంతా ఎలా బయటపడ్డారన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ‘జబర్ధస్త్’ కమెడియన్స్ ఆర్పీ, రాకేష్‌ల కామెడీ అని చెప్పుకోవాలి. ఏ శక్తులూ లేని దయ్యం భయపెడుతూ ఉంటే వీరు చేసే కామెడీ బాగుంది. ముఖ్యంగా దయ్యంతోనే గొడవపడే ఆర్పీ కామెడీ బాగా నవ్వించింది. సెకండాఫ్‌లో ఉండే రెండు ట్విస్ట్‌లు బాగున్నాయి. ఒకే కథను రెండు కోణాల్లో వేర్వేరుగా చెప్పడం సెకండాఫ్‌లో మెప్పించే అంశం.

మైనస్ పాయింట్స్ :

ఇదే కథను కొన్ని వందల సినిమాల్లో చూసి ఉండడమే అతిపెద్ద మైనస్‌గా చెప్పుకోవాలి. హర్రర్‌లో వేరొక కథ లేనట్టు ఇదే కథతో, భయపెట్టే సన్నివేశం ఒక్కటీ లేకుండా సినిమా చేయడం అంతకుమించి నిరుత్సాహపరిచే అంశం. కొన్ని కామెడీ సన్నివేశాలు మినహాయిస్తే సినిమా అంతా బోరింగ్‌గా ఏ సన్నివేశం ఎందుకొస్తుందో తెలియకుండా సాగింది. దయ్యం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు.

దయ్యంకి శక్తులు లేకపోవడం, దానికి ఒకర్ని చంపాలన్న పగ ఉండడం అన్నది ఆకట్టుకునే అంశంలానే కనిపించినా, దాన్ని పూర్తిగా వృథా చేశారు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా సాగదీసి బోర్ కొట్టించారు. ఫస్టాఫ్ అనవసరమైన సన్నివేశాలతో ఢీలాగా నడుస్తూ ఉండడం విసుగు పుట్టించింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు ప్రదీప్ మమ్ముట్టి ఒక పరమ రొటీన్ కథను తీసుకొని, దానికి మెప్పించే సన్నివేశాలే లేని స్క్రీన్‌ప్లే రాసుకొని ఒక హర్రర్ సినిమాను అందించే ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్క ఆర్పీ పాత్ర చుట్టూ వచ్చే కామెడీ సన్నివేశాలు రాయడం మినహాయిస్తే ప్రదీప్ ఎక్కడా మెప్పించలేదు.

సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఒకే ఇంట్లో జరిగే సినిమా కావడం, ఆ ఇంటిని సరిగ్గా క్యాప్చర్ చేయడంలో సినిమాటోగ్రఫీ పనితనం బాగానే అనిపించింది. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. బ్యాంక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతంతమాత్రమే. సినిమా రేంజ్ దృష్ట్యా చూస్తే ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

హర్రర్ కామెడీ జానర్ ప్రధాన లక్ష్యమే నవ్విస్తూ భయపెట్టడం. ఇదే జానర్‌లో వచ్చిన ఈ ‘అకీరా’ ఎక్కడా భయపెట్టలేకపోగా, నవ్వించడంలోనూ అంతంతమాత్రమే విజయం సాధించింది. అక్కడక్కడా నవ్వించే కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ఈ సినిమాలో చెప్పుకోడానికి ఏమీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘అకీరా’, మరో బోరింగ్ హర్రర్ కామెడీ!

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

 
Like us on Facebook