ఓటిటి సమీక్ష : దయా – హాట్‌స్టార్‌లో తెలుగు వెబ్ సిరీస్

Published on Aug 5, 2023 3:01 am IST
Dayaa Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 4, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: జెడి చక్రవర్తి, రమ్య నంబేసన్, ఈషా రెబ్బా, జోష్ రవి, విష్ణు ప్రియ, బబ్లూ పృథివీరాజ్, కమల్ కామరాజు, నంద గోపాల్, గాయత్రి గుప్తా తదితరులు

దర్శకుడు : పవన్ సాదినేని

నిర్మాతలు: శ్రీకాంత్ మోహతా, మహేంద్ర సోని

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: వివేక్ కాలెపు

ఎడిటర్: విప్లవ్ నిషాదం

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రముఖ నటుడు జేడి చక్రవర్తి ప్రధాన పాత్రలో, పవన్ సాదినేని దర్శకత్వం వహించిన తెలుగు సిరీస్ దయా. ఈ సిరీస్ తో OTT అరంగేట్రం చేశారు జేడి చక్రవర్తి. రమ్య నంబేసన్, ఈషా రెబ్బా, జోష్ రవి, విష్ణు ప్రియ, బబ్లూ పృధ్వీ రాజ్ ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోన్న ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

 

కథ:

దయా అలియాస్ దయాకర్ (JD చక్రవర్తి), తన అవసరాలు తీర్చుకోవడానికి ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. అతనికి గర్భవతి అయిన భార్య అలివేలు (ఈషా రెబ్బా) ఉంది. ఆమె కోసం అతను చాలా కష్టపడతాడు. ఒకరోజు దయా తన వ్యాన్‌లో మృతదేహాన్ని కనుగొంటాడు. దీనితో దయా షాక్ అయ్యి, పరిస్థితిని ఎదుర్కోవడానికి అతని అసిస్టెంట్ ప్రభ (జోష్ రవి) సహాయం తీసుకుంటాడు. అది ప్రఖ్యాత జర్నలిస్టు కవిత (రమ్య నంబేసన్) శవం అని వారిద్దరూ తెలుసుకుంటారు. ఆ సంఘటన దయా జీవితాన్ని ఎలా మార్చింది? తర్వాత ఏం చేశాడు? కవితను ఎవరు చంపారు? దయా నడుపుతున్న వ్యాన్‌లో ఆమె మృతదేహం ఎలా వచ్చింది? లాంటి ప్రశ్నలకు సిరీస్ లో సమాధానాలు ఉన్నాయి.

 

ప్లస్ పాయింట్లు:

దయా పాత్ర ఇందులో చాలా బాగుంది. రచన అద్భుతంగా ఉంది. ప్రతి పాత్రకు వారి స్వంత లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది. ఇది వారి యొక్క పర్ఫార్మెన్స్ ను, సిరీస్ ను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ క్యారెక్టర్స్ ను చూపించిన తీరు అద్భుతంగా ఉంది. రచయిత, దర్శకుడు పవన్ సాదినేని ప్రతి పాత్రను చాలా చక్కగా చెక్కారు, మంచి నాటకాన్ని సృష్టించారు.

సిరీస్ యొక్క చివరి భాగం అత్యంత ఆకర్షణీయంగా ఉంది. మంచి వేగంతో ముందుకు వెళ్తుంది. కీలక పాత్రల యొక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. చాలా సన్నివేశాలలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా ఉంటుంది.

ప్రతి ఆర్టిస్ట్ సిరీస్ లో చాలా బాగా నటించారు. నటనలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు, కానీ ప్రత్యేకంగా నిలిచేది మాత్రం జేడి చక్రవర్తి. తన అద్భుతమైన నటనతో సిరీస్ కి వాల్యూ తెచ్చారు. అతని పాత్రకు భిన్నమైన షేడ్స్ ఉన్నాయి. నటుడి బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ అద్బుతంగా ఉన్నాయి. అతని నటన సిరీస్ కి హైలైట్ అని చెప్పాలి.

రమ్య నంబేసన్ పాత్రను చక్కగా డిజైన్ చేసారు. తను అద్భుతంగా నటించింది. ఏది ఏమైనా నిజం కోసం పోరాడాలనే జర్నలిస్టుగా రమ్య బాగా నటించింది. విష్ణు ప్రియా మరియు జోష్ రవికి ముఖ్యమైన పాత్రలు లభించాయి. ఈషా రెబ్బా బాగా చేసింది, అయితే రెండవ సీజన్‌లో ఆమె గురించి మరిన్ని సన్నివేశాలు చూస్తాము.

రాజకీయ నాయకుడిగా బబ్లూ పృథివీరాజ్ బాగా నటించారు. రీసెంట్‌గా న్యూసెన్స్‌లో కనిపించిన నందగోపాల్ తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. షో గురించిన మరో గొప్ప విషయం ఏమిటంటే, క్లైమాక్స్. ఇది చాలా ఆసక్తికరంగా సాగింది. ఇది రెండవ సీజన్ కోసం వేచి ఉండేలా చేస్తుంది. మరొక సీజన్ కోసం సిరీస్ ను పొడిగించినట్లు కనిపించడం లేదు. కానీ కథ మాత్రం రెండో సీజన్ ను డిమాండ్ చేస్తుంది.

 

మైనస్ పాయింట్స్:

దయా వరల్డ్ ను ఫస్ట్ బాగా చూపించారు. కానీ, కొన్ని ఎపిసోడ్స్ చాలా స్లో గా సాగుతాయి. ఎడిటింగ్ టీమ్ సిరీస్ ను మరింత ఆసక్తికరంగా ఉంచేందుకు కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండాల్సింది.

ఐదవ ఎపిసోడ్ నుండి మాత్రమే సిరీస్ చాలా ఆసక్తికరం గా ఉంటుంది. కొన్ని ఎపిసోడ్‌లలో నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఈ అంశాన్ని మేకర్స్ మరింత మెరుగ్గా చూపించి ఉండవచ్చు. కథను ప్రదర్శించడానికి టీమ్ ఎంచుకున్న ఈ ప్రత్యేక శైలి ప్రారంభంలో సమస్యాత్మకంగా ఉంటుంది.

 

సాంకేతిక విభాగం:

శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సిరీస్‌ లో అతి పెద్ద హైలైట్ లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకటి. వివేక్ కాలెపు సినిమాటోగ్రఫీ షోకి సాలిడ్ వాల్యూని తీసుకొచ్చింది. గత కొన్ని ఎపిసోడ్స్‌ లో ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.

దర్శకుడు పవన్ సాదినేని విషయానికి వస్తే, అతను సిరీస్‌తో ఆకట్టుకున్నాడు. గ్రిప్పింగ్ డ్రామాని సృష్టించాడు. అన్ని పాత్రలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న విధానాన్ని చక్కగా చూపించారు. సిరీస్‌లో కొన్ని అద్భుతమైన డైలాగ్‌లు కూడా ఉన్నాయి. పవన్ సాదినేని తన ఆర్టిస్టుల నుండి బెస్ట్ యాక్టింగ్ రాబట్టుకున్నారు. మరియు సిరీస్ ముగింపు ఆకట్టుకుంది.

 

తీర్పు:

మొత్తం మీద, దయా సిరీస్ గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామా. ఇందులో నటీనటులు తమ అద్భుతమైన నటన తో విశేషం గా ఆకట్టుకున్నారు. దర్శకుడు పవన్ పాత్రల చుట్టూ మంచి డ్రామాని క్రియేట్ చేసారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిరీస్ లో కీలకం గా ఉంది. సన్నివేశాలను హైలైట్ చేస్తూ ఆకట్టుకుంది. అక్కడక్కడా వచ్చే ట్విస్ట్ లు బాగున్నాయి. కాకపోతే చాలా స్లో నేరేషన్ తో సన్నివేశాలు సాగాయి. ఏది ఏమైనప్పటికీ, దయా ఈ వీకెండ్ లో ఒకసారి చూడవచ్చు.

 

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :