Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : గాయకుడు – పాట ఒకే, ప్రేమకథ ఆకట్టుకోలేదు.

Gayakudu

విడుదల తేదీ : 20 ఫిబ్రవరి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : జి.కమల్‌

నిర్మాత : జమ్మలమడుగు రవీంద్రనాథ్‌

సంగీతం : రోషన్‌ సాలూరి

నటీనటులు : సిద్ధాన్శ్, అక్షర, సప్తగిరి..

సిద్ధాన్స్, అక్షర జంటగా జి.కమల్‌ దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్‌ మ్యూజికల్ ఎంటర్టైనర్ ‘గాయకుడు’. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్‌ సాలూరి ఈ సినిమాకు సంగీతం అందించారు. సప్తగిరి కీలక పాత్రలో నటించాడు. శ్రీమతి లక్ష్మీ సమర్పణలో ధీరు ఫిలింస్‌ పతాకంపై జమ్మలమడుగు రవీంద్రనాథ్‌ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చదివి తెలుసుకోండి…

కథ :

భారతంలో కర్ణుడు ఒకడే, మన భారతదేశంలో కర్ణులు ఎందరో.. అందులో ఒకడు సిద్ధాన్స్ (సిద్ధాన్స్). పుట్టగానే చెత్తబుట్ట దగ్గర పడేసి అతని తల్లి వెళ్ళిపోతుంది. పాటలు పాడుతూ అడుక్కుని జీవించే బాబా ఈ అనాధ కుర్రాడిని చేరదీసి పెంచుతాడు. బాబా చనిపోయే ముందు పాటను అమ్మతో సమానంగా ప్రాణంగా ప్రేమించమని సిద్ధాన్స్ కు చెప్తాడు. ఆ పాటే సిద్ధాన్స్ ను సెలబ్రిటీని చేస్తుంది. న్యూ ఇండియన్ ఐడల్ కాంపిటీషన్లో సిద్ధాన్స్ విన్నర్ గా నిలుస్తాడు. డబ్బు, హోదా అన్ని ఉన్నా చిన్నతనం నుండి తన జీవితంలో ప్రేమ లేదనే బాధ సిద్ధాన్స్ ను వెంటాడుతూ ఉంటుంది. అనుకోకుండా ఫోనులో పరిచయమైన అక్షర(అక్షర).. ఆ ప్రేమను హీరోకి అందిస్తుంది. మంచి స్నేహితురాలిగా నిలుస్తుంది. అయితే, ఫోనులో తనను అక్షరకు సిద్దుగా పరిచయం చేసుకుంటాడు.

నిజానికి సిద్ధాన్స్ పాటకు, అతనికి అక్షర పెద్ద అభిమాని. ఇది తెలుసుకున్న సిద్ధాన్స్.. తనను తానుగా పరిచయం చేసుకుని అక్షరతో ‘ఐ లవ్ యు’ చెప్తాడు. తనే ఫోన్ ఫ్రెండ్ సిద్దు అనే విషయం చెప్పకుండా ప్రేయసితో దోబూచులాడతాడు. అక్షరకు కూడా సిద్ధాన్స్ అంటే ఇష్టమే. ఎంతగానో ప్రేమిస్తుంది. మరి అంతలా ప్రేమించిన సిద్ధాన్స్ కు అక్షర ఎందుకు ‘ఐ హేట్ యు’ చెప్పింది..? ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్ళికి అక్షర ఎలా ఒప్పుకుంది..? ప్రాణంగా ప్రేమించే పాట కోసం.. తన ప్రేమను సిద్ధాన్స్ త్యాగం చేశాడా..? వీరి ప్రేమకథ ఏ తీరానికి చేరింది..? సిద్ధాన్స్, సిద్దు ఒక్కరే అనే విషయం అక్షర తెలుసుకుందా..? లేదా..? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

హీరో హీరోయిన్లు ఇద్దరికీ ఇదే తొలి సినిమా అయినా బాగా నటించారు. సింగర్ పాత్రలో సిద్ధాన్స్ చక్కని నటన కనబరిచాడు. సెంటిమెంట్ సన్నివేశాలలో అతని నటన ఇంకాస్త మెరుగవ్వాలసి ఉంది. ప్రతి సన్నివేశంలో అద్బుతమైన హావభావాలతో హీరోయిన్ అక్షర ఆకట్టుకుంది. సీన్స్ లో నటనతో ఆకట్టుకున్న అక్షర పాటల్లో గ్లామరస్ గా కనిపించి బి, సిసెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించిన అనుభవం ఆమెకు ఉపయోగపడింది. అయితే, ఇంకా ఆమె ముఖంలో పసితనం పోలేదని అక్కడక్కడా ప్రేక్షకులకు అనిపిస్తుంది.

కోటి తనయుడు రోషన్ సాలూరి స్వరపరిచిన ఆడియో సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. పాటలన్నీ ట్రెండీగా ఉన్నాయి. వాటిని తెరపై అందంగా విజువలైజ్ చేశారు. సందర్భానుసారం వాటిని దర్శకుడు ఉపయోగించుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

లీడ్ పెయిర్, ఇతర ఆర్టిస్టులు బాగానే నటించారు, పాటలు బాగున్నాయి. కథలో విషయం ఉంది. కానీ, థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకుడి మదిలో ఎక్కడో అసంతృప్తి. ఆ అసంతృప్తికి కారణం తెరపై సన్నివేశాలు ఒకదాని తర్వాత మరొకటి వచ్చి వెళ్తున్నా అవేవీ ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వెయ్యలేకపోవడమే. ప్రారంభం నుండి చివరి వరకు సినిమాతో ప్రేక్షకుడు ప్రయాణించేలా దర్శకుడు ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించలేకపోయాడు.

సప్తగిరి కామెడీ ట్రాక్ బలవంతంగా ఇరికించినట్టు అర్ధమవుతుంది. రొటీన్ సప్తగిరి నటన & కామెడీ ట్రాక్ అస్సలు నవ్వించలేదు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ లో అయినా కాస్త వినోదాన్ని జోడించి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ‘ఐ హేట్ యు’ చెప్పిన తర్వాత సన్నివేశాలు రిపీట్ చేసినట్టు అనిపిస్తాయి. అక్కడ ఓ 15 నిముషాలు నిడివి తగ్గించి సినిమాను త్వరగా ముగించాల్సింది. ప్రీ – క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలలో ఫీల్ ఎలివేట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

పైన చెప్పినట్టు రోషన్ సాలూరి అందించిన సాంగ్స్ ఈ సినిమాకి అసెట్, అలాగే అతని నేపధ్య సంగీతం పర్వాలేదు. చంద్రబోస్‌, అనంత శ్రీరామ్‌ ల సాహిత్య విలువలు, శ్రోతలను ఆకట్టుకుంటాయి. విశాఖ బీచ్ అందాలను తన కెమెరాలో అంతే అందంగా బంధించాడు సినిమాటోగ్రాఫర్ కొల్లి దుర్గాప్రసాద్‌. పాటల్లో కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

‘గాయకుడు’ కథకు న్యాయం చేయడంలో దర్శకుడు జి.కమల్ సక్సెస్ కాలేకపోయాడు. ఇలాంటి సినిమాల్లో (ప్రేమకథలలో) ప్రేమను అందమైన దృశ్య కావ్యంలా హృదయాన్ని హత్తుకునేలా వ్యక్తపరిస్తేనే, ప్రేక్షకులకు సినిమా మరింత చేరువవుతుంది. దర్శకుడు కమల్ రాసిన మాటల్లో కూడా ఆ లవ్ ఫీలింగ్ మిస్ అయ్యింది.

తీర్పు :

కొత్త హీరో హీరోయిన్లు నటించిన ‘గాయకుడు’ సినిమాలో లీడ్ పెయిర్ బాగానే నటించారు. రోషన్ సాలూరి ఆడియో ట్రెండీగా ఉండడంతో పాటు కథను ముందుకు తీసుకువెళ్ళడంలో ఉపయోగపడింది. తెరపై పాటలను అందంగా చిత్రీకరించారు. అన్ని బాగున్నా.. ‘గాయకుడి’ ప్రేమకథను, భావాలను ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఓవరాల్ గా గాయకుడు సినిమా పార్ట్స్ పార్ట్స్ గా బాగానే అనిపించినా ఓవరాల్ గా మాత్రం మంచి ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ అనే ఫీలింగ్ ని కలిగించలేకపోయింది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :