సమీక్ష : గజరాజు – ఏనుగు కథ

Gajaraju విడుదల తేదీ: 21 డిసెంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : ప్రభు సాల్మన్
నిర్మాత : బెల్లంకొండ సురేష్
సంగీతం : డి. ఇమ్మాన్
నటీనటులు : విక్రమ్ ప్రభు, లక్ష్మి మీనన్


శివాజీ గణేషన్ కుటుంబం నుండి మూడవ తరం ప్రారంభమైంది. ప్రభు తనయుడు విక్రమ్ ప్రభుని పరిచయం చేస్తూ ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన సినిమా గుమ్కి సినిమాని తెలుగులో గజరాజు పేరుతో డబ్ చేసారు. ప్రేమఖైదీ (మైనా) సినిమాతో తెలుగు వారికి సుపరిచుతుడు అయిన ప్రభు సాల్మన్ గజరాజుతో రెడీ అయ్యాడు. తమిళ్లో ప్రముఖ దర్శకుడు లింగుస్వామి నిర్మించిన ఈ సినిమాని తెలుగులో బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు. విక్రమ్ ప్రభు, లక్ష్మి మీనన్, తంబి రామయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళ్లో గత వారమే విడుదల కాగా తెలుగులో డిసెంబర్ 21న విడుదలవుతుంది.

కథ :

చిత్తూరు జిల్లాలోని తలకోన అడివి ప్రాంతంలో ఉండే దేవగిరి ఊరిపై కపాలి అనే ఏనుగు దాడి చేస్తూ ఆ ఊరి వారిని చంపుతూ ఉంటుంది. ఊరి పెద్ద అయిన వీరన్న (అనంత్ వైద్యనాథన్) తమ వారిని కాపాడుకోవడం కోసం గుమ్కి ఏనుగుని (అడివి ఏనుగులను తరిమికొట్టే ఏనుగులను గుమ్కి అంటారు) తమ ఊరికి తీసుకురావాలని నిర్ణయిస్తాడు. కొన్ని కారణాల వల్ల గుమ్కి ఏనుగు స్థానంలో బోపన్న (విక్రమ్ ప్రభు) తన ఏనుగు (మాణిక్యం)ని తీసుకుని దేవగిరికి వెళతాడు. ఊరి పెద్ద వీరన్న కూతురు సింగి (లక్ష్మి మీనన్)ని చూసిన బోపన్న మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. మొదట రెండు రోజులు కాపలా ఉండటానికి వెళ్ళిన బోపన్న సింగి మీద ప్రేమతో మరి కొద్ది రోజులు అక్కడే ఉంటాడు. ఆ ఊరి వారి ఆచారం ప్రకారం వీరి ప్రేమని ఒప్పుకోరని బోపన్నకి అర్ధమవుతుంది. మరోవైపు మాణిక్యంకి గుమ్కి ఏనుగు లాగా పోరాడే శక్తి కూడా లేదని బోపన్నకి అర్ధమవుతుంది. ఇలాంటి పరిస్తుతుల్లో బోపన్న ఏం చేసాడు. కపాలి బారి నుండి దేవగిరి ఊరుని ఎవరు కాపాడారు అన్నది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

విక్రమ్ మొదటి సినిమా కాబట్టి ఇప్పుడే కంప్లైంట్ చేయడం తగదు. నటన పరంగా పర్వాలేదు బాగానే చేసాడు. హావ భావాల విషయంలో కొంత మెరుగు పడాల్సిన అవసరం ఉంది. మలయాళ నటి లక్ష్మి మీనన్ కి తమిళ్లో ఇది రెండవ సినిమా అయినప్పటికీ చాలా చక్కగా నటించింది. మలయాళ హీరోయిన్స్ నటన విషయంలో బెస్ట్ అని చెప్పడానికి ఈ అమ్మాయి కూడా ఒక ఉదాహరణ. డీగ్లామర్ పాత్ర అయినప్పటికీ చాలా అందంగా ఉంది. హావభావాలు కూడా చాలా నాచురల్ గా ఉన్నాయి. తంబి రామయ్య కామెడీ సినిమాకి పెద్ద ఊరట. సినిమా ఫ్లో డౌన్ అవుతున్న ప్రతీసారి కామెడీతో నెట్టుకొచ్చాడు. ఊరి పెద్ద వీరన్న పాత్ర పోషించిన అనంత్ వైద్యనాథన్ కూడా బాగానే చేసాడు. హుండి పాత్ర చేసిన అశ్విన్ రాజా కూడా పర్వాలేదు. మొదటి భాగంలో అడివి అందాలను చాలా అందంగా చూపించాడు. రెండవ భాగంలో క్లైమాక్స్ ముందు వరకు బాగానే మేనేజ్ చేయగలిగాడు దర్శకుడు. తలకోన ప్రాంతంలోని జలపాతం చాలా బాగా చూపించారు. అయ్యయ్యో ఆనందమే, కన్నె సొగసులు పాట చిత్రీకరణ బావుంది.

మైనస్ పాయింట్స్ :

స్టొరీ లైన్ చాలా చిన్నది కావడం, ఆ స్టొరీ కూడా మొదటి 45 నిమిషాల్లో చెప్పేయడం వల్ల సినిమా చూస్తున్నంతసేపు ముందు సన్నివేశంలో ఏం జరగబోతుందా అన్న ఆసక్తి కలగదు. హీరో, హీరొయిన్ మధ్య లవ్ ట్రాక్ పండించడంలో కూడా దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. మొదటి నుండి హీరో మీద ప్రేమ లేని హీరొయిన్ ఒక్క సన్నివేశంతో ప్రేమించడం మొదలుపెడుతుంది. దర్శకుడు ఆ సన్నివేశం కూడా బలంగా తీయలేకపోయాడు. వీరి ప్రేమను మొదటినుండి వ్యతిరేకించే హీరో మామ కోనంగి (తంబి రామయ్య) ఒక్కసారిగా వారి ప్రేమకు సపోర్ట్ ఇస్తాడు. కోనంగి వీరి ప్రేమని సపోర్ట్ చేయడానికి సరైన కారణమే ఉండదు. జంతు పరిరక్షణ శాఖ ఆంక్షల వల్ల ఏనుగు మీద తీయలేని చాలా సన్నివేశాలు గ్రాఫిక్స్ చేసి మేనేజ్ చేయాలని చూసారు కానీ గ్రాఫిక్స్ పనితనం అస్సలు బాగాలేకపోవడం వల్ల తేలిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో రెండు ఏనుగుల మధ్య చూపించిన సీన్స్ నాసిరకమైన గ్రాఫిక్స్ వల్ల పూర్తిగా తేలిపోయాయి. వీటికి తోడు తెలుగు వారికి అస్సలు సరిపడని విషాదంతో ముగింపునిచ్చాడు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పాత్రని మొదటి నుండి కీలకం అన్నట్లు చూపిస్తూ చివరికి ఏమీ లేకుండానే ముగించారు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ. ప్రేమఖైదీ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సుకుమార్ ఈ సినిమాకి కూడా ఆయనే సినిమాటోగ్రఫీ అందించాడు. అడివి అందాలను అధ్బుతంగా చూపించాడు. ఇమ్మాన్ సంగీతంలో అయ్యయ్యో ఆనందమే, కన్నె సొగసులు, చెప్పినాదే తన ప్రేమని పాటలు బావున్నాయి. ఎడిటింగ్, నేపధ్య సంగీతంరెండూ సోసో.

తీర్పు :

తమిళ్ నేటివిటీకి బాగా దగ్గరగా ఉండే ఈ సినిమా తెలుగులో అతి కొద్ది మందికి మాత్రమే నచ్చుతుంది. వీటికి తోడు సినిమా చాలా వరకు ఏనుగు మీద నడవడం, క్లైమాక్స్ సరిగా తీయలేకపోవడం, విషాదాంతంగా ముగింపునివ్వడం తెలుగు వారికి రుచించని విషయాలు. రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టి కొత్తదనం కోరుకునే వారు సినిమాటోగ్రఫీ కోసం చూడొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

అశోక్ రెడ్డి .ఎమ్

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :