సమీక్ష : హ్యాపీ వెడ్డింగ్ – కన్ ఫ్యూజన్ వర్సెస్ ఎమోషన్

Happy Wedding movie review

విడుదల తేదీ : జులై 28, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : సుమంత్ అశ్విన్, నిహారిక

దర్శకత్వం : లక్ష్మణ్ కార్య

నిర్మాతలు : ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి

సంగీతం : శక్తికాంత్ కార్తీక్

సినిమాటోగ్రఫర్ : బాల‌రెడ్డి

సుమంత్ అశ్విన్ హీరోగా మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డినిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :
అక్షర (నిహారిక) ఆనంద్‌ (సుమంత్ అశ్విన్‌) ప్రేమించుకుంటారు. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు కూడా సంతోషంగా అంగీకరిస్తారు. దాంతో ఇదరికీ ఘనంగా ఎంగేజ్ మెంట్ కూడా జరుగుతుంది.అంతా హ్యాపిగా ఉంది అనుకున్న టైంలో అక్షర ‘ఎక్స్ బాయ్ ఫ్రెండ్’ వరుణ్ (రాజా) ఎంటర్ అవుతాడు.

అంతలో కొన్ని సంఘటనల కారణంగా అక్షర, ఆనంద్ విషయంలో డిజ్పాయింట్ అవుతుంది. ఆనంద్‌ను పెళ్లి చేసుకునే విషయంలో పూర్తిగా కన్ ఫ్యూజన్ కు గురవుతుంది. ఈ క్రమంలో పెళ్లి దగ్గర పడుతుందనగా.. ఇరు కుంటుంబాల మధ్య బంధం గట్టి పడుతుంది. దాంతో అక్షర కన్ ఫ్యూజన్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఓ దశలో వరుణ్ కి దగ్గరవుతుందేమోనని భావన కూడా కలుగుతుంది. మరి అక్షర, వరుణ్ ను దూరం పెడుతుందా ? లేదా ? చివరకి అక్షర ఆనంద్ ను అర్థం చేసుకుంటుందా ? వారి పెళ్లి అనుకున్న ప్రకారంగానే సజావుగా జరుగుతుందా ? లాంటి విషయాలు తెలియాలంటే హ్యాపీ వెడ్డింగ్ చిత్రం చూడాలసిందే.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు లక్ష్మణ్ కార్య రాసుకున్న సున్నితమైన కథే ఈ సినిమాకు ప్రధాన బలం. బలమైన పాత్రలతో, సన్నివేశాలతో, భావోద్వేగాలతో నిండిన ఈ కథ అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక హీరో సుమంత్ అశ్విన్ తన పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ కనబర్చి ఆకట్టుకున్నాడు, లుక్స్ పరంగా కూడా చాలా బాగున్నాడు.

కథలో మలుపులకు కారణమై కథను ముందుకు నడిపే హీరోయిన్ పాత్రలో నటించిన మెగా డాటర్ నిహారిక అందంగా కనిపిస్తూ, తన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసింది. ముఖ్యంగా కన్ ఫ్యూజన్ క్యారెక్టర్ లో తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన మురళి శర్మ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. కొన్ని ఏమోషనల్ సీన్స్ లో అయన నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది.

అలాగే హీరోకి తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నటుడు నరేష్ తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వులు పూయించారు. బామ్మ పాత్రలో కనిపించిన అన్నపూర్ణమ్మ కూడా కొన్ని చోట్ల ధ్వందర్ధాలతో శృతిమించినప్పటికీ తన మాటవిరుపుతో వెటకారంతో బాగానే నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. ముఖ్యంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గా కనిపించిన రాజా కూడా విఫలమైన ప్రేమికుడిగా, వీలైతే ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ దక్కించుకోవాలనుకున్నే ఓ సాధారణ ప్రేమికుడిగా బాగా నటించాడు.

దర్శకుడు లక్ష్మణ్ కార్య మొదటి అర్ధభాగాన్ని సరదాగా, కొంచెం ఎమోషనల్ గా నడిపిన ఆయన, సెకండాఫ్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో పాటు కుటుంబ బంధాలను, పెళ్లి పట్ల ఓ సగటు అమ్మాయికు ఉండే అనుమానాలను, భయాలను చక్కగా చూపించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉంది కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మాత్రం కథనం లేదు. ఫస్టాఫ్ ను బాగానే నడిపిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను సాగదీశారు. కొన్ని చోట్ల కుటుంబ బంధాలను బాగానే ఎలివేట్ చేసినప్పటికీ, లవ్ ట్రాక్ ను కూడా అంత కన్నా బాగా ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా, దర్శకుడు మాత్రం ఎందుకో లవ్ ట్రాక్ ను పూర్తిగా వాడుకోలేదు.

హీరో హీరోయిన్ల మధ్యన ప్రేమ ఉంది, అది కొన్ని అపార్ధాలు తెలియతనం కారణంగా ఘర్షణలో నలిగిపోతోంది అని తెలుస్తుంటుంది కానీ, ప్రేక్షకుడి మనసుకు మాత్రం అంత బలంగా తాకలేకపోయింది. కథను నడిపే ప్రధాన పాత్ర అక్షర సినిమా చివరి వరకు కన్ ఫ్యూజన్ తోనే ఉండటం, ఆమెకున్న ఆ ఒక్క బలహీనతతోనే రెండు గంటల సినిమాను నడపటంతో సినిమా ఫలితం దెబ్బతింది.

సినిమాలో బరువైన భావోద్వేగాల్ని పలికించే సందర్భాల్ని ఏర్పాటు చేయగల స్కోప్ ఉన్నా దర్శకుడు మాత్రం హీరోయిన్ కన్ ఫ్యూజన్ క్యారెక్టర్ చుట్టూనే సన్నివేశాలు నడిపి సినిమా పై ఆసక్తి నీరుగార్చారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు లక్ష్మణ్ కార్య మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా ఎలివేట్ చేస్తూ కథనం రాసుకోలేకపోయారు. తమన్ యస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.శక్తికాంత్ కార్తీక్ సమకూర్చున పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నేలా ఉన్నాయి.

సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా పెళ్లి తాలూకు సందడికి సంబంధించిన విజువల్స్ ను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు.

ఇక ఎడిటింగ్ బాగుంది. కానీ అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళు పాటించిన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

సినిమాలో మెయిన్ థీమ్ గా చెప్పాలనుకున్న ఓ సగటు అమ్మాయికి పెళ్లి పట్ల ఉండే కన్ ఫ్యూజన్స్ ను అనుమానాలను భయాలు గురించి చూపించడం బాగుంది. ఈ చిత్రం కూడా ఎక్కువుగా అమ్మాయిలకే కనెక్ట్ అవుతుంది తప్ప అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోదు. కన్ ఫ్యూజన్ పాత్రలో నిహారిక తన నటనతో, సుమంత్ అశ్విన్ తన లుక్స్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ, సినిమాలో ఎక్కువు భాగం ఒకే క్యారెక్టరైజేషన్ మీద సాగడం, సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల ఆసక్తికరంగా సన్నివేశాలు లేకపోవడంతో సినిమా స్థాయి కొంత తగ్గింది. ప్రేమ కథలో ఇంకాస్త డెప్త్ పెంచి ఉంటే బాగుండేది. మొత్తం మీద ఈ చిత్రం అమ్మాయిలను, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :