సమీక్ష : హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య – సోషల్ మెసేజ్ ను సగమే చెప్పాడు !

Head Constable Venkatramaiah review

విడుదల తేదీ : జ‌న‌వ‌రి 14, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు

నిర్మాతలు : చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి

సంగీతం : వందేమాతరం శ్రీనివాస్

నటీనటులు : ఆర్.నారాయణ్ మూర్తి, జయసుధ

పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి నటించిన సినిమా ఈ ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ విడుదల సమయంలో సరిపడినన్ని థియేటర్లు దొరక్క అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని ఎట్టకేలకు అనుకున్నట్టుగానే ఈరోజు జనవరి 14న సంక్రాంతి సందర్బంగా విడుదలైంది. చిత్ర యూనిట్ మంచి ప్రచారం చేపట్టడం, ట్రైలర్స్ కూడా బాగుండటంతో ఈ చిత్రంపై అందరి దృష్టీ పడింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య (నారాయణమూర్తి) జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ, ఎవరి దగ్గరా రాజీ పడకుండా, లంచాలు తీసుకొకుండా నమ్మిన నీతిగా బ్రతకాలనే సిద్ధాంతం ప్రకారం నిజాయితీగా డ్యూటీ చేస్తుంటాడు. కానీ అతని సహచర పోలీసులు మాత్రం ఆయన్ను ఎప్పుడెప్పుడు అణగదొక్కుదామా అని చూస్తుంటారు. దానికి తోడు ఆయన భార్య పద్మ (జయసుధ) కూడా అతన్ని లంచాలు తీసుకుని డబ్బు సంపాదించామని గోల పెడుతూ ఉంటుంది.

అయినా కూడా వెంకట్రామయ్య దేనికీ లొంగడు. అలా ఒక హోమ్ మంత్రి దగ్గర డ్యూటీ చేస్తున్న అతన్ని ఆ హోమ్ మంత్రి వ్యక్తిగత కక్షతో అవినీతి కేసులో ఇరికించి అవమానిస్తాడు. అదే టైమ్ లో అతని భార్య కూడా అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. అలా జీవితంలో దెబ్బతిన్న వెంకట్రామయ్య నల్లధనమే సమాజానికి చేటని, ఎలాగైనా దాన్ని అంతం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంటాడు. అసలు హోమ్ మంత్రి వెంకట్రామయ్యను ఎందుకు టార్గెట్ చేస్తాడు ? నల్లధన నిర్మూలనకు వెంకట్రామయ్య ఏం చేశాడు ? వెంకట్రామయ్య భార్య అతన్ని అపార్థం చేసుకుని ఎలా బాధపెట్టింది ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ అంటే అది ఆర్. నారాయణమూర్తి నటననే చెప్పాలి. అగ్రెసివ్ నటుడన్న పేరుకు తగ్గట్టే నారాయణమూర్తి సినిమా మొత్తాన్ని తన నటనతోనే లాక్కొచ్చే ప్రయత్నం చేసి మెప్పించాడు. పోలీస్ పాత్రలో నిజాయితీని, ధైర్యాన్ని, మంచితనాన్ని, బాధని, బాధ్యతని ప్రదర్శించే సన్నివేశాల్లో ఆయన నటన టాప్ రేంజులో ఉంది. అలాగే తనను అపార్థం చేసుకున్న భార్యకు తానేమిటో చెప్పాలని, ఆమెను మార్చాలని చేసే ప్రయత్నాల్లో ఆయన నటన చూస్తే జీవించారనే చెప్పాలి.

ఆయనకు, జయసుధకు మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. వారి జంట చూడటానికి బాగానే ఉంది. వారిద్దరి మధ్య నడిచే సరదా, ఘర్షణ సన్నివేశాలు కొన్ని బాగున్నాయి. అలాగే ఈ సినిమా కథ కూడా కొంచెం కొత్తగానే ఉంది. ఫస్టాఫ్ అంతా వెంకట్రామయ్య పాత్రను ఎలివేట్ చేస్తూ కొంచెం ఆకట్టుకుంది. సుధాకర్ రెడ్డి ఫోటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను అందంగా తయారు చేసింది.

మైనస్ పాయింట్స్ :

మైన్స్ పాయింట్స్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సెకండాఫ్ గురించి. సినిమాకు కీలకమైన ఆ పార్ట్ మొత్తాన్ని చెడగొట్టి వదిలారు. అందులోని ప్రతి అంశం చాలా సిల్లీగా ఉంది. వెంకట్రామయ్య, అతని భార్య ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారడం, అవినీతి హోమ్ మంత్రి ఎలాంటి ఇమేజ్ లేని వెంకట్రామయ్య భార్యను అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించి తన పార్టీని గెలిపించుకోవాలనుకోవడం, ఆమెనే ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం వంటివి మరీ ఓవర్ గా అనిపిస్తాయి.

ఇక మధ్యలో వచ్చే పాటలు, వెంకట్రామయ్య కూతురి లవ్ ట్రాక్, అతని అత్తమామల కుటుంబ సన్నివేశాలు చాలా బోర్ కొట్టించాయి. ఇక కథలో మనిషి జీవితం నుండి డబ్బును దూరం చేస్తే అవినీతి తగ్గుతుందని చెప్తారు కానీ దాన్ని చూపించకుండానే సినిమాను ముగించడం తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. అలాగే మొదటి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న ఒక సాధారణ కానిస్టేబుల్ గ్రౌండ్ వర్క్ చెయ్యకుండా, జనాల్లోకి సరిగా వెళ్లకుండా సింపుల్ గా పార్టీ పెట్టేసి సీఎం అభ్యర్థిగా పోటీ చేసేయడం కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉంది. ఈ పొరపాట్లన్నీ కలిసి సెకండాఫ్ లో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు నారాయణ మూర్తి వంటి నటుడితో ప్రస్తుత ఆర్ధిక, సామాజిక పరిస్థితులకు తగ్గట్టు మెసేజ్ ఉన్న కథ చెప్పాలనుకోవడం బాగానే ఉన్నా దానికి తగిన బలమైన, ఆకట్టుకునే కథనాన్ని రాసుకోవడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా సినిమా సెకండాఫ్ ను సిల్లీ సిల్లీగా తీశారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం పెద్డగా ఆకట్టుకోలేదు. మోహన్ రామారావు ఎడిటింగ్ పర్వాలేదు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. చదలవాడ పద్మావతి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

మొదటి నుండి ప్రజా సమస్యలపై సినిమాలు చేస్తూ పీపుల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆర్.నారాయణ మూర్తి అదే బాటలో కాస్త కొత్తగా, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా చేసిన మరో ప్రయత్నమే ఈ ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. నారాయణ మూర్తి, జయసుధల నటన, కాస్త కొత్తగా ఉండే కథ, పర్వాలేదనిపించే ఫస్టాఫ్ ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా వాస్తవానికి దూరంగా సిల్లీగా ఉండి పూర్తిగా బోర్ కొట్టించిన లాజిక్ లేని సెకండాఫ్ కథనం, అసంతృప్తిగా వదిలేసిన అసలైన కథా లక్ష్యం ఇందులో మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే సోషల్ మెసేజ్ ను సగం వరకే చెప్పిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అంతగా మెప్పించదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :