సమీక్ష : కవచం – ఈ కవచం మాస్ ప్రేక్షకులకు మాత్రమే

సమీక్ష : కవచం – ఈ కవచం మాస్ ప్రేక్షకులకు మాత్రమే

Published on Dec 8, 2018 3:01 AM IST
Kavacham movie review

విడుదల తేదీ : డిసెంబర్ 07, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్,కాజల్ అగర్వాల్,మెహ్రిన్

దర్శకత్వం : శ్రీనివాస్ మామిళ్ళ

నిర్మాత : నవీన్ చౌదరి శొంఠినేని

సంగీతం : ఎస్ ఎస్ థమన్

సినిమాటోగ్రఫర్ : చోటా కె నాయుడు

ఎడిటింగ్ : చోటా కె ప్రసాద్

స్క్రీన్ ప్లే : శ్రీనివాస్ మామిళ్ల

 

నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, కాజల్ మరియు మెహ్రీన్ హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘కవచం’. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 కథ : 

విజయ్ (బెల్లం కొండ శ్రీనివాస్) నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. కాగా, విజయ్ సంయుక్త(కాజల్)ని సిన్సియర్ ప్రేమిస్తాడు. ఇక ఆమెను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలనుకుంటున్న సమయంలో ఆమె అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల తరువాత మరో హీరోయిన్ మెహ్రీన్ ను కూడా కిడ్నాప్ అవుతున్న సమయంలో విజయ్ వచ్చి ఆమెను కాపాడుతాడు.

కానీ కొన్ని ఊహించిన సంఘటనల కారణంగా విజయ్ నీతి,నిజాయితీలు అన్ని తప్పులు కనిపిస్తాయి. అసలు విజయ్ చేసిన తప్పులు ఏమిటి ? వాటి వెనుక ఉండి నడిపిస్తుంది ఎవరు ? సంయుక్త అంత సడన్ గా మాయమవ్వటానికి గల కారకులు ఎవరు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 ప్లస్ పాయింట్స్ : 

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. ముఖ్యంగా ఇన్వెస్టిగేట్ సన్నివేశాల్లో గతంలో కంటే పరిణతి చెందిన తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా నటించిన కాజల్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది. అలాగే మరో కీలక పాత్రలో కనిపించిన హీరోయిన్ మెహ్రీన్ కూడా ఉన్నంతలో చాలా చక్కగా నటించింది. ఆమెకు పెద్దగా స్క్రీన్ టైం లేకపోయిన తన నటనతో ఆకట్టుకుంటుంది.

ఇక విలన్ గా నటించిన నిల్ నితిన్ ముఖేష్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మెరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తీసుకున్న థీమ్ తో పాటు ఆయన ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచటానికి చేసిన ప్రయత్నం కూడా బాగుంది.

 మైనస్ పాయింట్స్ : 

దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు. కానీ, ఆ ఐడియాకి సరైన ట్రీట్మెంట్ ను రాసుకోవడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారనిపిస్తోంది. సినిమా మొదలయిన ఒక గంట వరకు ప్రేక్షకులకు ఒక క్లారిటీ అంటూ రాదు. కాజల్ కు మరియు బెల్లంకొండ శ్రీనివాస్ కు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు అయితే అసలు అనవసరం అనిపిస్తాయి.

అయితే శ్రీనివాస్ మామిళ్ల మిగిలిన సన్నివేశాలను బాగానే చిత్రీకరించినప్పటికి, వాటిల్లో కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగకపోవడం, చాలా చోట్ల స్క్రీన్ ప్లే నమ్మశక్యంగా లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

పైగా కథానుసారం అవసరం లేకపోయినా సరే కొన్ని పాత్రలని కల్పించి పెట్టినట్టు కూడా ప్రేక్షకులు ఫీల్ అవుతారు. దాని వల్ల సెకండాఫ్ కూడా కాస్త సాగదీతగా ఉన్నట్టుంటుంది. హీరో విలన్ల మధ్య వచ్చే మైండ్ గేమ్ సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే కథనాన్ని నడిపారు.

 సాంకేతిక విభాగం : 

దర్శకుడు మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు గాని, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ మాత్రం రాసుకోలేదు. మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్ అందించిన రీరికార్డింగ్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది, పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

ఇక సినిమాటోగ్రఫర్ చోటా కె. నాయుడు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. అలాగే చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సాగతీత సీన్లను కొంత ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని నవీన్ సొంటినేని పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

 తీర్పు : 

నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, కాజల్ మరియు మెహ్రీన్ హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం అక్కడక్కడా మెప్పించినా.. పూర్తిగా ఆసక్తికరంగా సాగలేదు. కాగా సినిమాలోని యాక్షన్ అండ్ ఇన్వెస్టిగేట్ సన్నివేశాలు మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నప్పటికీ, కథనం నెమ్మదించడం, అనవసరమైన సీన్లు మరియు ట్విస్టులు ఉన్న ఫీలింగ్ కలగడం వంటి అంశాలు సినిమా స్థాయిని తగ్గిస్తాయి. కానీ ఓవరాల్ గా ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. ఏ సెంటర్ ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు