సమీక్ష : కేరింత – ప్రేమకథల చిన్ని కేరింత!

kerintha-review

విడుదల తేదీ : 12 జూన్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : సాయికిరణ్ అడవి

నిర్మాత : దిల్‌రాజు

సంగీతం : మిక్కీ జే మేయర్

నటీనటులు : సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్విని..

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సినిమా అంటేనే సున్నితమైన భావోద్వేగాలకు పెట్టిన పేరు. ఎప్పటికప్పుడు సెన్సిబుల్ సినిమాలను నిర్మిస్తూ తన సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు దిల్‌రాజు. తాజాగా ఆయన ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్ అడవితో రూపొందించిన సినిమాయే కేరింత. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలోనూ దర్శక నిర్మాతలు తమ మార్క్ చూపెట్టారా? కేరింత ప్రేక్షకుడికి మంచి అనుభూతినిచ్చిందా? చూద్దాం..

కథ :

రెండేళ్ళ కాలంలో ఆరుగురి జీవితాల్లో వచ్చిన మార్పు, వాటి చుట్టూ తిరిగే పరిస్థితుల కథే కేరింత. జై (సుమంత్ అశ్విన్) తాను సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉంచాలనుకునే వ్యక్తిత్వం ఉన్న యువకుడు. సిద్ధు (విశ్వనాథ్), నూకరాజు (పార్వతీశం), ప్రియ (తేజస్విని), భావన (సుకృతి) అతడి బెస్ట్ ఫ్రెండ్స్. సాధారణంగా సాగిపోయే వారి జీవితాల్లో ప్రేమ అనే ఫీలింగ్ ఓ అందమైన కేరింతకు జీవం పోస్తుంది.

జై, తొలిచూపులోనే మనస్విని (శ్రీ దివ్య)ని ప్రేమిస్తాడు. ప్రతీ పనినీ భయపడుతూ చేసే పరిస్థితుల్లో బతికే సిద్ధూ ప్రియను కూడా అలాంటి పరిస్థితుల మధ్యే ప్రేమిస్తాడు. తన గమ్యమేంటో తెలియని నూకరాజు, భావన ద్వారా తన గమ్యాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత భావనపై తనకున్న భావనను ప్రేమ అని తెలుసుకుంటాడు. ఈ కథలన్నీ ఎక్కడికి చేరాయి? వారి ప్రేమ నిజంగానే కేరింతలు కొట్టిందా? అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ప్రేమకథల్లోని ఎమోషన్‌ను సినిమాటిగ్గా కాకుండా చాలా సహజంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం గురించి చెప్పుకోవాలి. ఒకరితో ఒకరికి సంబంధమున్న ఆరుగురి జీవితాల్లో వచ్చే మార్పే ఓ సినిమా కథగా చెప్పడమంటే సులువుగా కనిపించే కష్టమైన పని. ఆ విషయంలో ఈ సినిమాను ప్రేక్షకుడి కనెక్ట్ చేయడంలో స్క్రీన్‌ప్లేలోని కొన్ని అంశాలు ప్లస్‌పాయింట్స్‌గా నిలుస్తాయి. అన్ని ప్రేమకథలూ విఫలమవుతున్నట్టు కనిపించే పరిస్థితుల్లో అన్నింటిలో ‘నువ్వెవరో తెలియదే?’ అనే కామన్ పాయింట్‌ను, అన్ని ప్రేమకథలూ కలిసిపోతాయనకునే పరిస్థితుల్లో ‘నువ్వెవరూ?’ అనే కామన్ పాయింట్‌ను సినిమాకు సరిగ్గా కనెక్ట్ చేయడం ప్లస్ పాయింట్.

సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య, తేజస్విని, సుకృతి, విశ్వనాథ్, పార్వతీశం ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారనే చెప్పాలి. ఒక్కో పాత్రకూ ఒక్కో మూడ్ ఉండడం, ఆ మూడ్‌ను ఎవ్వరికి వారుగా సరిగ్గా పట్టుకోవడంతో సినిమా చూస్తున్నంతసేపు పాత్రలే కనిపిస్తాయి తప్ప నటీనటులు కనిపించరు. సుమంత్, శ్రీదివ్య, తేజస్విని మినహా మిగతా ముగ్గురూ కొత్తవారైన చాలా బాగా చేశారు.

సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, వారి జీవితాల్లో ప్రేమ అనే ఫీలింగ్ కలగడం, ప్రేమను వ్యక్తపరిచే లోపు విడిపోవడం ఇలా రకరకాల ఎమోషన్స్‌తో హాయిగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో కొంత బరువైన సన్నివేశాలతో సినిమా ఎమోషనల్‌గా సాగిపోతుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ మేజర్ ప్లస్‌పాయింట్ అని చెప్పవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ఫన్ చాలా తక్కువగా ఉండటమనే చెప్పాలి. ప్రతి విషయాన్నీ ప్రాక్టికల్‌గా చెప్పాలనే ప్రయత్నంలో ఫన్‌ను వదిలేసినట్టు కనిపిస్తుంది. బలవంతంగా ఇరికించాల్సిన అవసరం లేకున్నా ఈ కథలో, సన్నివేశాల్లో ఫన్‌కి చాలా స్కోప్ ఉంది. ఎమోషనల్‌గా సాగే ఇలాంటి సినిమాను బలమైన సన్నివేశాలతో పాటు కొంత ఫన్‌ను జతకలిపి చెబితే ప్రేక్షకుడు ఎంత బాగా కనెక్ట్ కాగలడనే విషయాన్ని ఇదివరకు చాలా సినిమాలే ఋజువు చేశాయి. ఆ విషయంలో కొంత ఆలోచించి ఉంటే మరింత బాగుండేది.

ఇక ఈ కథలో చెప్పుకోడానికి చాలా అంశాలే ఉన్నా, స్క్రీన్‌ప్లేలో వాటన్నింటినీ ఆసక్తికరంగా కాకుండా సాదాసీదాగా నడిపించడం మైనస్ పాయింట్. పైన చెప్పుకున్నట్టు స్క్రీన్‌ప్లేలో కామన్ పాయింట్‌ను సరిగ్గా పట్టుకున్నా, విడిపోవడం, కలిసే ప్రయత్నం చేయడం, మళ్ళీ విడిపోయినట్టు కనిపించడం, కలవడం ఇలా ఒక్కో సంఘటనను ఆసక్తికరంగా కాకుండా అతి సాధారణంగా నడిపించారు. సెకండాఫ్‌ మొదలైన తర్వాత ఇరవై నిమిషాల పాటు సినిమా వేగం మందగిస్తుంది ఇది మరో మైనస్ పాయింట్.

సెకండాఫ్‌లో వచ్చే బరువైన ఎమోషనల్ సన్నివేశాలను మరీ ప్రాక్టికల్‌గా చెప్పడం ఫార్ములా సినిమాలను ఇష్టపడే వారికి పెద్దగా రుచించదు. పూర్తిగా కామెడీపైనే ఆధారపడి తెరకెక్కే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ సినిమా ఉంటుందనుకుంటే వారికి నిరుత్సాహం తప్పదు.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు సాయికిరణ్ అడవి గురించి చెప్పుకుంటే.. కథ, కథనాల విషయంలో ఈ సినిమాకు చాలా మంది కలిసి పనిచేసినా ఈ విషయంలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. సాధారణ కథను, అంతే సాధారణమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. దర్శకుడిగా మాత్రం సాయికిరణ్ అడవి సినిమాలోని ఎమోషన్‌ను మిస్ చేయకుండా చూశారు. ముందే తెలిసిన కథను, ముందే అర్థం చేసుకోగల సన్నివేశాలను తాను చెప్పాలనుకున్న కోణంలో చెప్పడంలో దర్శకుడిగా ఆయన నూటికి నూరు శాతం విజయం సాధించారు. పాటలను సినిమా గమనానికి ఉపయోగించుకోవడం కూడా దర్శకుడి ప్రతిభగా చెప్పుకోవచ్చు.

మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం సినిమాకు మంచి మూడ్‌ను తెచ్చిపెట్టింది. పాటలన్నీ సందర్భానుసారంగా వచ్చేవే కాక చూసేప్పుడు మంచి అనుభూతిని కలిగిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మిక్కీ స్టైల్లో సాగిపోతుంది. విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలోని బేసిక్ ఎమోషన్‌ను సినిమాటోగ్రాఫర్ సరిగ్గా క్యాప్చర్ చేయగలిగారు. అలాగే పాత్రల జీవితాల్లో వస్తూపోయే క్లారిటీ, కన్ఫూజన్‌లను సరిగ్గా పట్టుకున్నారు. ఎడిటింగ్ ఫర్వాలేదనిపించేలా ఉంది. రెండు వేర్వేరు ఎమోషన్‌లు ఉండే సన్నివేశాల మధ్యన ఎడిటర్ చూపాల్సిన పనితనం ఈ సినిమాలో కనిపించలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

అందమైన భావోద్వేగాలను అంతే అందమైన సినిమాలుగా మలిచే దర్శకుడు సాయికిరణ్ అడవి, సెన్సిబుల్ సినిమాల నిర్మాత దిల్‌రాజు కలిస్తే ప్రేక్షకుడు ఎలాంటి సినిమాను కోరుకుంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇంతకుముందు చూసినదే అయినా, ఎమోషన్ మారినప్పుడల్లా కొత్తదిగా కనిపించే కథ, అందమైన భావోద్వేగాలు, ఆరు జీవితాలను ఒక కామన్ పాయింట్‌తో చెప్పిన విధానం ఇవన్నీ కేరింతకు కలిసివచ్చే అంశాలు. ఇక సాదాసీదాగా సాగిపోయే స్క్రీన్‌ప్లే, సినిమాను మరో ఎత్తులో నిలబెట్టగలిగే ఫన్ లేకపోవడం ఈ సినిమాకు ప్రతికూల అంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒకే దారిపై ఆరు జీవితాలు చేసే మలుపుల ప్రయాణం, ఆ ప్రయాణంలో ఎదురయ్యే అనుభూతులను ఓ చిన్ని ’కేరింత’లో చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. సినిమాలో ఫన్ లేకున్నా ఈ ప్రయాణాన్ని అనుభవించగలిగే వారికి తప్పకుండా నచ్చే సినిమా.. కేరింత.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :