సమీక్ష : మజ్ను – మెప్పించే ప్రేమ కథ !

సమీక్ష : మజ్ను – మెప్పించే ప్రేమ కథ !

Published on Sep 24, 2016 4:20 PM IST
Majnu review

విడుదల తేదీ : సెప్టెంబర్ 23, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : విరించి వర్మ

నిర్మాత : గీత గొల్ల, పి. కిరణ్

సంగీతం : గోపి సుందర్

నటీనటులు : నాని, అను ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ

ఈ సంవత్సరం వరుసగా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ, జెంటిల్‌మ‌న్’ వంటి చిత్రాలతో మంచి విజయాలందుకున్న హీరో నాని హ్యాట్రిక్ సాధించాలన్న ప్రయత్నంలో చేసిన చిత్రమే ఈ ‘మజ్ను’. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన అను ఇమ్మాన్యుయల్, ప్రియా శ్రీ లు హీరోయిన్లుగా నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఈరోజే విడుదలైన ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఇంజనీరింగ్ చదివి, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వద్ద బాహుబలి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే కుర్రాడు ఆదిత్య(నాని), సుమ(ప్రియా శ్రీ) అనే అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఇక ఆ అమ్మాయి మెప్పు పొందడానికి నిజాయితీగా ఉంటూ తన అందమైన, పాత ప్రేమ కథని ఆమెతో చెప్తాడు. అతని నిజాయితీని చూసి సుమ కూడా అతన్ని ప్రేమిస్తుంది.

కానీ ఆదిత్య మాత్రం ఇంకా తను తన పాత ప్రేయసినే ప్రేమిస్తున్నాని రియలైజయి సందిగ్ధంలో ఉంటాడు. ఇంతలో వీరిద్దరి ప్రేమ కథలోకి అనుకోకుండా ఆదిత్య పాత ప్రేయసి కిరణ్ (అను ఇమ్మానుయేల్) ప్రవేశిస్తుంది. దీంతో వీరి ప్రేమ కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఇక ఆదిత్య తన పాత, కొత్త ప్రేయసిలను ఒకేసారి ఎలా ఫేస్ చేశాడు? చివరికి ఎవరి ప్రేమను దక్కించుకున్నాడు ? అన్నది తెరపై చూడవలసిన సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పవలసింది దర్శకుడు విరించి వర్మ కథను హ్యాడిల్ చేసిన విధానం గురించి. కథ పాతదే అయినప్పటికీ దాన్ని చాలా అందంగా, సహజంగా చెప్పాడు విరించి వర్మ. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో భీమవరంలో సాగే హీరో ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ అయితే చాలా రియలిస్టిక్ గా, రొమాంటిక్ సాగుతూ బాగుంది. ఈ లవ్ స్టోరీకి సహజత్వం తీసుకురావడంలో దర్శకుడు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. అలాగే ఈ లవ్ స్టోరీ మధ్యలో, సెకండ్ హాఫ్ లో నడిచే కామెడీ మంచి టైమింగ్ తో నడుస్తూ ఎంటర్టైనింగ్ గా ఉంది.

ఇక హీరో నాని అయితే ఎప్పటిలాగే సినిమాని తన సహజ నటనతో ఇంకాస్త పై స్థాయికి తీసుకెళ్లాడు. మరీ ముఖ్యంగా తన మొదటి ప్రేమ కథలో అయితే అతడు జీవించాడనే చెప్పాలి. జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ అయితే ప్రతి ఫ్రేమ్ చాలా క్లీన్ గా, అందంగా ఉంటూ ఎంజాయ్ చేసే విధంగా ఉంది. సెకండ్ హాఫ్ లో వచ్చే వెన్నెల కిశోర్ కామెడీ, స్వతహాగా నాని పండించిన హాస్యం బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా కాస్త ఉత్కంఠను కలిగిస్తూనే ఎంటర్టైనింగ్ గా సాగి మంచి ముగింపులా అనిపించింది.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయానికొస్తే చెప్పుకోవలసింది కథను గురించి. అన్ని ప్రేమ కథల్లాగే ఇది కూడా మామూలు కథే, ఇందులో పెద్దగా కొత్తదనమేమీ లేదు. మొదటి భాగం మొత్తం అందంగా నడిచి సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ గా సాగుతూ కాస్త బోర్ కొట్టించింది. ఇక ప్రీ క్లైమాక్స్ అయితే పూర్తిగా ఊహాజనితంగా ఉండటంతో పెద్దగా ఆసక్తికరంగా అనిపించలేదు.

అలాగే అక్కడక్కడా కొన్ని లాజిక్ లు కూడా మిస్సయ్యాయి. ఒక అమ్మాయిని ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తున్న హీరో సడన్ గా తాను ఇంకా తన పాత ప్రేయసినే ప్రేమిస్తున్నానని రియలైజవడం, క్లైమాక్స్ లో హీరోయిన్ మారడం వంటివి అసహజంగా ఉన్నాయి. ఈ సంఘటనల కోసం దర్శకుడు ప్రేక్షుడిని ముందుగా ప్రిపేర్ చేయడంలో విఫలమయ్యాడు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో పెద్ద క్రెడిట్ సినిమాటోగ్రఫర్ జ్ఞాన శంకర్ కు వెళుతుంది. ముఖ్యంగా భీమవరం బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీని ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా, మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేలా తెరపై చూపించాడు. అలాగే గోపి సుందర్ అందించిన పాటల సంగీతం బాగుంది. పాత్రల మధ్య నడిచే మాటల సంభాషణ ఆహ్లాదకరంగా ఉంది. ఎడిటింగ్ కూడా బాగుంది.

ఇక కథ పాతదే అయినా కథానాన్ని కొత్తగా రాసుకుని దాన్ని తెరపై అందంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విరించి వర్మ సక్సెస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా మొదటి భాగాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.

తీర్పు :

మంచి కథనం, హాస్యంతో సరదగా సాగిపోయే ప్రేమ కథా చిత్రమే ఈ ‘మజ్ను’. అందమైన ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ, మంచి టైమింగ్ తో సాగే కామెడీ, అద్బుతమనిపించే హీరో నాని నటన, అందమైన సినిమాటోగ్రఫీ, సంతృప్తినిచ్చే క్లైమాక్స్ ఈ చిత్రంలోని ప్లస్ పాయింట్స్ కాగా కాస్త బోర్ కొట్టించే సెకండ్ హాఫ్ రొటీన్ కథనం, ఊహాజనియమైన ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, రెండు కీలక సన్నివేశాల్లో మిస్సైన లాజిక్ ఇందులోని మైనస్ పాయింట్స్. మొత్తానికి ఆహ్లాదంగా సాగే ప్రేమ కథా చిత్రాలను కోరుకుంటూ, నాని నటనను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి వినోదాన్ని, సంతృప్తిని ఇస్తుంది.

123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు