సమీక్ష : మెహబూబా – మెప్పించలేకపోయింది

Mehbooba movie review

విడుదల తేదీ : మే 11, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : ఆకాష్ పూరి, నేహా శెట్టి

దర్శకత్వం : పూరి జగన్నాథ్

నిర్మాత : పూరి జగన్నాథ్

సంగీతం : సందీప్ చౌత

సినిమాటోగ్రఫర్ : విష్ణు శర్మ

ఎడిటర్ : జునైద్‌ సిద్ధిఖీ

స్క్రీన్ ప్లే : పూరి జగన్నాథ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘మెహబూబా’. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:
దేశం మీద ప్రేమతో ఆర్మీలో చేరాలనే ప్రయత్నాల్లో ఉంటాడు రోషన్ (ఆకాష్ పూరి). కానీ అతన్ని గత జన్మ తాలూకు ప్రేమ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. అలాంటి సమయంలోనే అతను హిమాలయాలకు ట్రెక్కింగ్ కు వెళ్లగా తన గత జన్మ ప్రేమ గురించి తెలుస్తుంది.

తన గత జన్మలోని ప్రేయసి ఈ జన్మలో అఫ్రిన్ (నేహా శెట్టి)గా పుట్టిందని, ఆమె పాకిస్థాన్ లో ఉందని
గ్రహించి ఆమె కోసం పాకిస్థాన్ వెళతాడు. అలా పాకిస్థాన్ వెళ్లిన రోషన్ గత జన్మలో కోల్పోయిన ప్రేమను ఈ జన్మలో పొందదానికి ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :
సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ స్టోరీ లైన్. ఒక యువకుడు తన గత జన్మ ప్రేమను ఈ జన్మలో దక్కించుకోవడానికి పోరాడటం అనే పాయింట్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. అలాగే హీరో ఇంటర్వెల్ సమయానికి తన పూర్వ జన్మ ప్రేమ గురించి తెలుసుకునే సన్నివేశం బాగా ఆకట్టుకుంది. ఆ సన్నివేశంతో ద్వితియార్థం ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలం కలిగింది.

అలాగే ఆకాష్ పూరి పూర్తి స్థాయి హీరోగా నిలబడటానికి చేసిన ప్రయత్నం చాలా వరకు సఫలమైంది. అతని నటన సహజత్వాన్ని కలిగి ఉండటంతో ప్రేక్షకులకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. క్లైమాక్స్ లోని ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్ తో మెప్పించాడు. ఇక సినిమా ప్రథమార్థంలో అతనిలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి పూరి తన ట్రేడ్ మార్కుతో రాసిన కొన్ని డైలాగులు, సన్నివేశాలు బాగున్నాయి. హీరోయిన్ నేహా శెట్టి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకోగా హీరో తండ్రిగా షియాజీ షిండే పెర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల నవ్వించింది.

మైనస్ పాయింట్స్ :

పూరిగారు రాసుకున్న స్టోరీ లైన్ బాగానే ఉన్నా దాన్ని పూర్తిస్థాయి సినిమాగా డెవెలప్ చేసేందుకు అయన రాసుకున్న కథనం ఆకట్టుకోలేకపోయింది. ప్రథమార్థంలో వచ్చే హీరో ఎలివేషన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ మినహా మిగతా ఏవీ కూడ ఎంటర్టైన్ చేయలేకపోయాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల గత జన్మ తాలూకు సన్నివేశాలైతే మరీ బోర్ కొట్టించాయి. ద్వితీయార్థంలో ఎక్కువ రన్ టైమ్ ను ఆక్రమించిన ఈ పూర్వ జన్మ ట్రాక్ యుద్ధ నేపథ్యంలో నడుస్తూ ఏ కోశానా ఆకట్టుకోలేకపోయింది.

కొన్ని సన్నివేశాలైతే మరీ సాగదీసినట్టు ఉండటంతో సినిమా వాస్తవంలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అనిపించింది. జన్మ జన్మల ప్రేమ అన్నప్పుడు హీరో హీరోయిన్ల నడుమ ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా కదిలించే బాండింగ్ ఉండాలి. సినిమా ముందుకెళుతున్న కొద్ది ప్రేమికులిద్దరూ కలిసి తీరాల్సిందే అనే భావన చూసే వాళ్లలో కలగాలి. కానీ సినిమాలో మాత్రం అలాంటి ఎమోషన్స్ ఏవీ మచ్చుకు కూడ కనబడవు.

పూరి ట్రై చేసిన ఈ కొత్త స్టైల్ కంటే ప్రేమ కథలకు ఆయనిచ్చే పాత ట్రీట్మెంటే నయం. కనీసం ఎంటర్టైన్మెంట్ అయినా దొరికుండేది. ఇక ప్రీ క్లైమాక్స్ లో పాకిస్థాన్ వెళ్లిన హీరో తన ప్రేమ కోసం చేసే ప్రయత్నాలు చాలా బలహీనంగా ఉండటంతో వీక్షించే వారిలో నిరుత్సాహం ఆవరించింది. ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులో జరిగే క్లైమాక్స్ సన్నివేశం అయితే ఇది పూరి టేకింగేనా అనే అనుమానం కలిగించింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు పూరిగారు సినిమా కోసం ఎంచుకున్న గత జన్మ ప్రేమ కోసం ఈ జన్మలో పోరాడటం అనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఈసారి ఆయనిచ్చిన కొత్త ట్రీట్మెంట్ 50 శాతం కూడా వర్కవుట్ కాలేదు. ఆయన పాత స్టైల్లోనే సినిమా చేసుంటే బాగుండేది. ఆకట్టుకోలేని కథనం, ద్వితీయార్థంలో బలహీనమైన సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సినిమా రిజల్ట్ తారుమారైంది. కానీ తన కుమారుడు ఆకాష్ పూరిని మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేసి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకునే పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారాయన.

సందీప్ చౌత అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా బాగానే ఉన్నా పాటల సంగీతం మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. జునైద్‌ సిద్ధిఖీ తన ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్లోని కొని కీలక సన్నివేశాలని తొలగించాల్సింది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. పూరి జగన్నాథ్ పాటించిన నిర్మాణ విలువలు మంచి స్థాయిలో ఉన్నాయి.

తీర్పు :

మొత్తం మీద పూరి తన పాత స్టైల్ ను వదిలి కొత్త స్టైల్లో తీసిన ఈ ‘మెహబూబా’ పెద్దగా మెప్పించలేకపోయింది. గత జన్మ తాలూకు ప్రేమ ప్రేమికుడి కోసం పోరాటం అనే స్టోరీ లైన్ బాగానే ఉన్నా దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ చేసే ఆసక్తికరమైన కథనం, బలమైన సన్నివేశాలు సినిమాలో లేవు. దీంతో చిత్రం ఆసాంతం బోర్ కొట్టింది. కొంత పర్వాలేదనిపించిన ప్రథమార్థం, ఇంప్రెస్ చేసే విధంగా ఉన్న ఆకాష్ పూరి నటన మినహా ఈ సినిమాలో వేరే ఆకట్టుకునే అంశాలేవీ దొరకవు. పూరి సినిమాకు తన పాత ట్రేడ్ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే కనీసం అక్కడక్కడా కొంత ఎంటర్టైన్మెంట్ అయినా దొరికుండేది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :