సమీక్ష : పాఠశాల – మీ కాలేజ్ డేస్ గుర్తు తెచ్చే రోడ్ జర్నీ.!

విడుదల తేదీ : 10 అక్టోబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం మహి వి రాఘవ్
నిర్మాత : రాకేష్ మహంకాళి, పవన్ కుమార్ రెడ్డ
సంగీతం : రాహుల్ రాజ్
నటీనటులు : నందు, శివ, శశాంక్, అనుప్రియ, శిరీష, సాయి కిరణ్ ..

‘వినాయకుడు’ సినిమా ద్వారా రైటర్ గా పరిచయమై ఆ తర్వాత ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాల ద్వారా నిర్మాతగా మారి ఇప్పుడు ‘పాఠశాల’ సినిమాతో దర్శకుడిగా మారిన డైరెక్టర్ మహి వి రాఘవ్. ఓ 5 మంది ఫ్రెండ్స్ కలిసి ప్లాన్ చేసిన ఓ రోడ్ ట్రిప్ వారి లైఫ్ లో తెచ్చిన మార్పులు ఏంటి అనే కథాంశంతో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి టాలీవుడ్ కి కొత్త అయిన ఈ జోనర్ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఎంతవరకూ ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

సూర్య(శివ), రాజు(నందు), ఆది(సాయి కిరణ్), సాల్మా(శిరీష), సంధ్య(అనుప్రియ) ఈ ఐదుగురు మంచి ఫ్రెండ్స్. వీరందరూ సక్సెస్ఫుల్ గా తమ బిటెక్ ని పూర్తి చేస్తారు. బిటెక్ గ్రాడ్యువేషన్ డే అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, విడిపోవడానికి ఇష్టం లేని సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ వారికి ఒక సలహా ఇస్తాడు. అదే అందరూ కలిసి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి విజిట్ చేసి అక్కడ కొద్ది రోజులు గడపండి, ఈ ట్రిప్ మీకు ఎన్నో అనుభవాలని ఇవ్వడమే కాకుండా మీ కెరీర్ ప్లానింగ్ కి చాలా హెల్ప్ అవుతుందని చెప్తాడు.

అది వారికి నచ్చడంతో ఈ ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి అందరి ఇళ్ళకీ వెళ్ళాలని ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. అలా ప్రారంభమైన వాళ్ళ రోడ్ ట్రిప్ లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.? ప్రతి ఒక్కరి ఇళ్ళకీ వెళ్ళినప్పుడు ఒక్కొక్కరి గురించి తమ ఫ్రెండ్స్ కి అంత వరకూ తెలియని విషయాలు ఏమేమి తెలిసాయి.? ఈ రోడ్ జర్నీ వల్ల వాళ్ళ కెరీర్ ఎలా మలుపు తిరిగింది.? అనే విషయాలను మీరు వెండితెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్ర డైరెక్టర్ మహి చెప్పినట్టు ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ కాన్సెప్ట్ మరియు జోనర్. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదు, అలాగే ఫుల్ లెంగ్త్ రోడ్ మూవీ జోనర్ అనేది కూడా మనకు కొత్తే అందుకే అవి సినిమాకి ప్లస్ అయ్యాయి.

ఈ సినిమాలో మెయిన్ రోల్ చేసింది 5 మంది, అందులో చూస్తున్న ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యే పాత్ర రాజుని నందు చేసాడు. నందు పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఈ పాత్ర సినిమా మొత్తం ఒకేలా బిహేవ్ చేస్తూ నవ్విస్తూ ఉంటుంది. సినిమా కథని మనకు చెప్పే సూర్య పాత్ర చేసిన శివ బాగా సెటిల్ గా పెర్ఫార్మన్స్ చేసాడు. ఈ పాత్ర ఇప్పటి యువతరంలోని చాలా మందికి సింక్ అవుతుంది కావున ఈ పాత్రకి బాగానే కనెక్ట్ అవుతారు. అలాగే సాల్మా పాత్ర చేసిన శిరీష్ కూడా లేడీ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. మనసులో ఏదో తెలియని బాధ ఉంచుకొని పైకి చాలా కూల్ గోయింగ్ పర్సన్ లా కనిపించే పాత్రలో సాయి కిరణ్ బాగా చేసాడు. ఇక మోడ్రన్ గర్ల్ గా అనుప్రియ ఓకే అనిపించింది.

ఇక సినిమాలో కనిపించే సీనియర్ నటులు ఎల్బీ శ్రీరాం, కృష్ణ భగవాన్, నరసింహరాజు తదితరులు వారి పాత్రలకి న్యాయం చేసారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది మరియు చాలా వేగంగా కూడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో చూపించే గోదావరి అందాలు, వైజాగ్ లోని లోకేషన్స్ చాలా బాగుంటాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న పిల్లాడి డాన్సింగ్ ఎపిసోడ్ సెంటిమెంటల్ గా బాగా వర్కౌట్ అయ్యింది. సెకండాఫ్ లో వచ్చే సూర్య పాత్రలో వచ్చే సెంటిమెంట్ ఎపిసోడ్స్ కోడా ఆడియన్స్ కి ముఖ్యంగా యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే సెకండాఫ్ లో వచ్చే శశాంక్ పాత్ర సినిమాకి చాలా కీలకం. తన పాత్రతోనే సినిమా టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది. క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇవన్నీ కాకుండా సూపర్బ్ విజువల్స్, మ్యూజిక్ మరియు డైలాగ్స్ ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్..

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి కాస్తో కూస్తో డ్రా బ్యాక్ అంటే సెకండాఫ్ అనే చెప్పాలి.. డైరెక్టర్ రాసుకున్న 5 పాత్రలకి ప్రతి ఒక్కరూ ఎక్కడో ఓ చోట కనెక్ట్ అవుతారు. కానీ అందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ పాత్రలన్నిటినీ ఫస్ట్ హాఫ్ లోనే చూపించేసి సెకండాఫ్ మొత్తం ఎక్కువగా సెంటిమెంట్, ఎమోషన్స్ మీదనే దృష్టి పెట్టడం వలన కాస్త స్లో గా అనిపిస్తే, కొన్ని చోట్ల ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. దీనికి కారణం ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా మరియు ఫాస్ట్ గా ఉండడమే. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కథా ప్రకారమే మొదలు పెట్టినా ఒక పది నిమిషాలు కూడా స్లోగానే ఉంటుంది.

సెకండాఫ్ కీలకం అయిన శశాంక్ పాత్రతో సినిమా టర్నింగ్ పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాత్రని డైరెక్టర్ సరిగా డిజైన్ చేసుకోలేదనిపిస్తుంది. ఇంకాస్త ఎనర్జిటిక్ గా శశాంక్ పాత్రని డిజైన్ చేసుకొని కథని ఇంకాస్త స్పీడప్ చేయడానికి ట్రై చేసి ఉంటే బాగుంటుంది. సెకండాఫ్ స్క్రీన్ ప్లే ఇంకాస్త బెటర్ గా ఉండాలి. ముందుగా అనుకున్న దానికంటే తక్కువ రన్ టైంకి రీ ఎడిట్ చేయడం వలన చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతాయి. రెగ్యులర్ సాంగ్స్, కామెడీ, ఫైట్స్ కోరుకునే ఆడియన్స్ కి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

పైన చెప్పినట్టు ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లో ది బెస్ట్ అని చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ – లోకేషన్స్, డైలాగ్స్ మరియు మ్యూజిక్. సినిమా మొత్తాన్ని మన రాష్ట్రాల్లోనే షూట్ చేసారు. ఇలాంటి బ్యూటిఫుల్ లోకేషన్స్ మన రాష్ట్రాల్లో ఉన్నాయా అనే ఫీలింగ్ వస్తుంది. ఆ లోకేషన్స్ ని సినిమాటోగ్రాఫర్ చాలా బాగా చూపించాడు. రాహుల్ రాజ్ దర్శకత్వం మ్యూజిక్ లో పాటలు ఓకే, కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. చాలా ఎమోషనల్ సీన్స్ కి పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా బాగుంది, సెకండాఫ్ పరంగా ఇంకాస్త బెటర్ గా ఉండాలి.

ఇక కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసింది మహి.. మహి రాసుకున్న స్టొరీ లైన్, అల్లుకున్న పాయింట్స్ కొత్తగా ఉన్నాయి. కానీ స్క్రీన్ ప్లే ని మాత్రం పర్ఫెక్ట్ గా రాసుకోలేదు. ఇంకాస్త వర్క్ చేసి ఉంటే సెకండాఫ్ లో ఉండే మైనస్ పాయింట్స్ మిస్ అయిపోయాయి. ఇక మొదటిసారి డైరెక్టర్ గా మంచి మార్కులే వేసుకున్నాడు. అనుకున్న పాయింట్ ని పర్ఫెక్ట్ గా రీచ్ చేయగలిగాడు. కానీ మధ్య మధ్యలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోని పాయింట్స్ కొన్ని టచ్ చెయ్యాలని ట్రై చేసాడు. అవి టచ్ చేయకుండా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

సినిమా పరంగా మనకు ఓ కొత్త పాయింట్ ని చూపిస్తూ, ఓ రోడ్ జర్నీ జోనర్ లో తీసిన ‘పాఠశాల’ మూవీ చూసిన వారందిరినీ ముందుగా మన కాలేజ్ డేస్ కి తీసుకెళ్ళి, మన ఫ్రెండ్స్ తో మనం గడిపిన రోజుల్ని, మన అల్లరి పనుల్ని మరియు కాలేజ్ లవ్ స్టోరీస్ ని గుర్తు చేస్తుంది. పాఠశాల యువతకి నచ్చే సినిమా అవుతుంది. అలా అని ఫ్యామిలీ చూడకూడని సినిమా అని కాదు. ఈ సినిమాని యువత చూస్తే వారి ఫ్యామిలీకి చూపించాలి అనుకుంటారు, అదే పేరెంట్స్ చూస్తే తమ పిల్లలకి చూపించాలి అనుకుంటారు. ఓవరాల్ గా ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్, నందు కామెడీ, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్, విజువల్స్ మరియు డైలాగ్స్ ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే ఎంటర్టైన్మెంట్ తగ్గి, ఎమోషనల్ డోస్ పెరిగిన సెకండాఫ్, సెకండాఫ్ స్క్రీన్ ప్లే, ఇంకాస్త బెటర్ గా ఉండాల్సిన శశాంక్ పాత్ర చెప్పదగిన మైనస్ పాయింట్స్. మీ కాలేజ్ మరియు మీ ఫ్రెండ్స్ తో గడిపిన రోజుల్నిగుర్తు చేసే ‘పాఠశాల’ సినిమాని మీరు హ్యాపీగా చూడొచ్చు..

123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :

X
More