సమీక్ష : పిల్లా నువ్వులేని జీవితం – యూత్ ఫుల్ ఎంటర్టైనర్

PNJ-review విడుదల తేదీ : 14 నవంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : కెఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత : బన్ని వాస్ – శ్రీ హర్షిత్
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రెజీన, జగపతి బాబు…

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’. ఇది సాయి నటించిన సెకండ్ సినిమా అయినప్పటికీ తన తొలి పరిచయం సినిమాగా ఇదే రిలీజ్ అయ్యింది. ‘యజ్ఞం’ ఫేం ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని అల్లు అరవింద్ – దిల్ రాజు సమర్పణలో బన్నీ వాస్ – శ్రీ హర్షిత్ కలిసి నిర్మించారు. రెజీన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మరి తన మొదటి సినిమాతో సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకున్నాడు.? సినిమా ఎలా ఉంది.? అనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

తన బ్యాచిలర్ లైఫ్ ని చాలా హ్యాపీగా, జాయ్ ఫుల్ గా ఎంజాయ్ చేసే కుర్రాడు శీను (సాయి ధరమ్ తేజ్). అలాంటి సాయి ఒకరోజు శైలు(రెజీన కసాండ్ర) ని చూసి ప్రమలో పడతాడు. అప్పటి నుంచి ప్రతి రోజూ తన వెంట పడుతూ తనకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. కానీ తన చేష్టలతో విసుగెత్తిన శైలు శీను ప్రేమని రిజెక్ట్ చేస్తుంది. ఆ టైంలోనే కథలో అసలైన ట్విస్ట్.. పవర్ఫుల్ రౌడీ అయిన మైసమ్మ(జగపతి బాబు) మరియు కొంతమంది ఇతరులు శైలుని చంపాలని ట్రై చేస్తూ ఉంటారు.

ఆ విషయం తెలుసుకున్న శీను ఏమి చేసాడు.? అంత పవర్ఫుల్ అయిన మైసమ్మతోఎలా పోరాడాడు.? చివరికి మైన్సమ్మ నుంచి శైలుని కాపాడాడా.? లేదా.? అసలు మైసమ్మ శైలుని ఎందుకు చంపాలనుకున్నారు.? అనే విషయాలను మీరు వెండితెరపైనే చూసి తెలుసుకోవాలి..

ప్లస్ పాయింట్స్ :

చాలా రోజుల నుంచి సాయి ధరమ్ తేజ్ తో పాటు మెగా అభిమానులు కూడా సాయి మొదటి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ ఈ రోజుతో బ్రేక్ అయిపొయింది. సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమాతోనే తన పెర్ఫార్మన్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసాడు. కేవలం పెర్ఫార్మన్స్ తోనే ఆకట్టుకోవడమే కాకుండా మెగా హీరోలలో స్పెషల్ గా చెప్పుకునే డాన్సులతో కూడా ఆడియన్స్ ని మెప్పించాడు. తనకు ఇచ్చిన పాత్రలో ఎంతో మెచ్యూరిటీని చూపించడమే కాకుండా, సెకండ్ సినిమాలోనే ఇలాంటి ఓ మాస్ రోల్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఫ్యూచర్ లో తన లుక్ మరియు ఎక్స్ ప్రెషన్స్ పైన ఇంకాస్త కేర్ తీసుకుంటే ఫ్యూచర్ లో మంచి స్టార్ అవుతాడు.

రెజీన కసాండ్ర ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సినిమా మొత్తం చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ అందరినీ తనవైపు తిప్పుకోవడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్ లో సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఈ సినిమాతో రెజీనకి మరింత పేరొస్తుంది. ఇకపోతే ఈ మధ్య వరుసగా ప్రధాన పాత్రలు చేస్తున్న జగపతి బాబు మరోసారి సూపర్బ్ సపోర్టింగ్ రోల్ చేసాడు. దర్శకుడు రాసుకున్న పాత్రకి జగపతి బాబు పెర్ఫార్మన్స్ తోడవడంతో ఆ పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. మైసమ్మగా జగపతి బాబు పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో జగ్గు భాయ్ బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా చివరి 10 నిమిషాలు చాలా కామెడీ గా ఉంటుంది. అలాగే డైరెక్టర్ ఆ కామెడీ ఎపిసోడ్ ని చాలా బాగా డీల్ చేసారు.

ఇక సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఎక్కడా బ్రేక్స్ లేకుండా స్పీడ్ గా సాగిపోయే కథనం. ఈ విషయంలో క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కి వెళ్తుంది. ఎందుకంటే ఎక్కడా కథనంలో స్పీడ్ తగ్గకుండా, అంతే ఆసక్తికరంగా చెప్పడం కష్టం, కానీ రవికుమార్ పర్ఫెక్ట్ గా డీల్ చేసాడు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది . ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ బాగా నవ్వుకుంటారు. రఘుబాబు, జయప్రకాశ్ రెడ్డితో కలిసి ఆడియన్స్ ని తెగ నవ్వించారు. వీరి కాంబినేషన్ సీన్స్ సినిమాలో హైలైట్ అవుతాయి.

మైనస్ పాయింట్స్ :

పైన చెప్పినట్టు క్లైమాక్స్ బాగా ఎంటర్టైనింగ్ గా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అవుట్ అఫ్ ది బోర్డర్ వెళ్ళినట్లు అనిపిస్తుంది. అక్కడ ఓవర్ డోస్ ని కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ఇకపోతే సినిమాకి చాలా కీలకం అయిన తేజు – రెజీన లవ్ ట్రాక్ ని అందరూ కన్విన్స్ అయ్యేలా చెప్పలేదు. ఆ లవ్ ట్రాక్ పై ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. అలాగే రెజీన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా కాస్త సాగదీసినట్టుగా ఉండడం వలన బోర్ కొడుతుంది. రెజీన పాత్ర రాసుకోవడంలో డైరెక్టర్ ఇంకాస్త క్లారిటీగా రాసుకొని ఉంటే బాగుండేది.

సెకండాఫ్ చివరికి చేరుకునే టైంలో ట్విస్ట్ రివీల్ చేస్తారు, అక్కడి నుంచి సినిమా మనం ఊహించినట్టుగానే వెళ్ళి శుభం కార్డు పడుతుంది. అలాగే సినిమాకి కీలకం అయిన ప్రకాష్ రాజ్ పాత్రని, తన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ని ఫస్ట్ హాఫ్ లో ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

సాయి ధరమ్ తేజ్ కి ఒక మంచి సినిమా అందించాలి అనే ఉద్దేశంతో నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అందుకే నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సూపర్బ్ అని చెప్పాలి. పాటలన్నిటిని సినిమాలో ఒదిగిపోయే విధంగా అద్బుతంగా చిత్రీకరించారు. తేజ్ కు కంపోజ్ చేసిన డాన్సు మూమెంట్స్ మరియు ఫైట్స్ బాగున్నాయి. జగపతి బాబు, సాయి ధరమ్ తేజ్ ల మధ్య జరిగిన ప్రీ క్లైమాక్స్ ఫైట్ ను బాగా డిజైన్ చేశారు.

దర్శకుడిగా రవి కుమార్ చౌదరి చక్కని ప్రతిభను కనబరిచాడు. తన భాద్యతను సక్రమంగా నిర్వర్తించాడు. రెండు సార్లు ఫ్లాష్ బ్యాక్ లో దర్శకుడు కథను చెప్పిన విధానం ఆకట్టుకుంది. జగపతి బాబు క్యారెక్టర్ కు రాసిన డైలాగులు బాగున్నాయి. జగపతి బాబు, సాయి ధరమ్ తేజ్ ల మధ్య సన్నివేశాలు కూడా అంతే బాగున్నాయి. స్క్రీన్ ప్లే సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. కథలో ట్విస్ట్ లను తెలివిగా రివీల్ చేశారు.

తీర్పు :

‘పిల్లా నువ్వులేని జీవితం’తో టాలీవుడ్ కి టాలెంట్ ఉన్న మరో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ పరిచయం అయ్యాడు. సాయికి మెగా బ్రాండ్ అనే ట్యాగ్ కూడా ఉండడం వలన ఫ్యూచర్ లో స్టార్ హీరోగా ఎదిగే క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాలో సాయి చూడటానికి బాగా మాస్ అండ్ రఫ్ లుక్ లో కనిపించాడు, అది ఈ సినిమాకి అది సరిపోయింది. ముందుముందు తనని చాలా లుక్ అండ్ స్టైల్స్ పై కేర్ తీసుకోవాలి. రెజీన పాత్రలో కాస్త క్లారిటీ మిస్ అవ్వడం మరియు సాయి – రెజీన ల లవ్ ట్రాక్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. ఇవి రెండు నెగటివ్ పాయింట్స్ అయినప్పటికీ స్పీడ్ స్క్రీన్ ప్లే, పొట్ట చెక్కలయ్యేలా ఉండే కాండీ మరియు సూపర్ గా పిక్చరైజ్ చేసిన సాంగ్స్ ఆ నెగటివ్స్ ని మరచిపోయేలా చేస్తాయి. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటి యువతని బాగా ఆకట్టుకుంటుంది. ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉన్న ఈ ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా ఈ సీజన్ లో వచ్చిన పర్ఫెక్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.

 

123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

 
Like us on Facebook