సమీక్ష : రామ్ లీల – యువతని ఆకట్టుకునే లీలలు.!

Ram Leela Review

విడుదల తేదీ : 27 ఫిబ్రవరి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : శ్రీపురం కిరణ్

నిర్మాత : దాసరి కిరణ్ కుమార్

సంగీతం : చిన్నా

నటీనటులు : హవిష్, అభిజిత్, నందిత…

‘నువ్విలా’, ‘జీనియస్’ సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరో హవిష్ హీరోగా నటించిన సినిమా ‘రామ్ లీల’. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం అభిజిత్ మరో హీరోగా, ‘ప్రేమకథా చిత్రమ్’ ఫేం నందిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా శ్రీపురం కిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ‘రామ్ లీల’ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

అమెరికాలో ఓ మంచి కంపెనీలో పనిచేసే కృష్ణ అలియాస్ క్రిష్(అభిజిత్) ఓ రోజు మా టీవీలో సస్య(నందిత)ని చూసి ప్రేమలో పడతాడు. కట్ చేస్తే చాలా ఫాస్ట్ గా క్రిష్ ఇండియా రావడం, సస్యని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోతాయి. పెళ్లి తర్వాత క్రిష్ సస్యని తీసుకొని అమెరికా వెళ్ళకుండా, తన జాబుని మలేషియా షిఫ్ట్ చేయించుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన మొదటి రోజే సస్య తను ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్లిపోతున్నానని లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతుంది.

దాంతో బాగా డిప్రెస్ అయిన క్రిష్ సస్య జ్ఞాపకాలతో ఒంటరిగా హనీమూన్ కోసం అనుకున్న రోడ్ ట్రిప్ ప్లాన్ ని అమలు చేస్తాడు. ఈ రోడ్ ట్రిప్ లో క్రిష్ కి రామ్(హవిష్) పరిచయం అవుతాడు. మొదట్లో రామ్ అంటే అసహ్యించుకొనే క్రిష్ కి మెల్లగా రామ్ పై మంచి అభిప్రాయం కలుగుతుంది. అక్కడి నుంచి క్రిష్ లైఫ్ లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ఏమిటి.? అసలు రామ్ ఎవరు.? అకస్మాత్తుగా రామ్ ఎందుకు క్రిష్ లైఫ్ లోకి వచ్చాడు.? సస్య ప్రేమించిన వ్యక్తి ఎవరు.? రామ్ – సస్యల మధ్య ఏదైనా రిలేషన్ ఉందా.? అన్న ఆసక్తిర విషయాల్ని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

డైరెక్టర్ శ్రీ పురం కిరణ్ అనుకున్న కథకి నటీనటుల్ని బాగానే సెలక్ట్ చేసుకున్నాడు. ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే రామ్ పాత్రలో హవిష్ నటన బాగుంది. గత రెండ సినిమాలతో పోల్చుకుంటే ఇలాంటి పాత్ర చేయడం అతనికి కొత్త. అయినప్పటికీ బాగా చేసాడు. నటనలో ఎంతో మెచ్యూరిటీ కనపడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ బాగా చేసాడు. ఇక అభిజిత్ కూడా మంచి నటనని కనబరిచాడు. లవ్ ఫెయిల్యూర్ పెయిన్ ని చూపించే సీన్స్ లో అతని నటన బాగుంది. అలాగే హవిష్ – అభిజిత్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ కొన్ని బాగున్నాయి. ఇక నందిత ఈ సినిమాలో అటు ట్రెడిషనల్ గా, ఇటు గ్లామరస్ గా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. నందితకి స్క్రీన్ టైం కాస్త తక్కువైనప్పటికీ పెర్ఫార్మన్స్ పరంగా ఆకట్టుకుంది.

ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ పాత్రలో భాను చందర్ ఆకట్టుకోగా, నాగినీడు, కృష్ణుడు, అనిత తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఈ సినిమాలో సెకండాఫ్ ఆసక్తికరంగా ఉంటుంది. మొదటగా సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. ఈ లవ్ ట్రాక్ యువతకు నచ్చే అవకాశం ఉంది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. ఓవరాల్ గా సినిమాకి ఎస్. గోపాల్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. అలాగే మదాలస శర్మతో చేసిన ‘భజన భజన’ సాంగ్ మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. అక్ష స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి కాసేపు ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సింది ఫస్ట్ హాఫ్.. ఫస్ట్ హాఫ్ ని మొదలు పెట్టడం బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచి ఇంటర్వల్ బ్లాక్ వరకూ కథని అస్సలు ముందుకు కదలకుండా ఆపేశారు. ఈ టైంలో కామెడీతో ఆకట్టుకోవాలని ట్రై చేసాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా అలీ ట్రాక్ అట్టర్ ఫ్లాప్ అయితే, సప్తగిరి రంగోలి ట్రాక్ లో 5 సీన్స్ కి గాను ఒకటి అరా సీన్స్ పేలాయి. దాంతో ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ లో బోర్ ఫీలవుతారు. కథనం విషయంలో డైరెక్టర్ చాలా కేర్ తీసుకోవాల్సింది.

ఇంటర్వల్ ముందు వరకూ కథలోకి వెళ్ళరు, ఇంటర్వెల్ లో ట్విస్ట్ ని రివీల్ చెయ్యగానే కథ ఊహాజనితంగా ముందు వెళ్తుంది. ఈ రెండు గంటల సినిమాని ఎడిటర్ ఇంకాస్త తగ్గించి బెటర్ గా ఏది చేయాల్సింది. అలాగే ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ కూడా సందర్భం లేకుండా వచ్చి ఆడియన్స్ ని ఇబ్బంది పెడతాయి.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో ఈ సినిమాకి ప్రాణం పోసింది మాత్రం సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి అనే చెప్పాలి. ఆయన కథ ఎలా సాగుతున్నా మలేషియాని చూపించిన విధానం, ఆ గ్రాండ్ విజువల్స్ ఆడియన్స్ ని చూపుని ఆకర్షిస్తాయి. అలాగే నటీనటుల్ని బాగా ప్రెజెంట్ చేసారు. ఇక అందించిన పాటలు బాగానే ఉన్నాయి, అలాగే ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే.. అక్కడక్కడా కాస్త లౌడ్ గా అనిపించినా కొన్ని చోట్ల మాత్రం బాగుంది. ఇక ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ మెప్పించదగిన స్థాయిలో లేదు. ఫస్ట్ హాఫ్ లో అనవసరపు షాట్స్, సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది. అశోక్ ఆర్ట్ వర్క్ బాగుంది. విస్సు రాసిన డైలాగ్స్ బాగున్నాయి. కానీ ఆయన కొన్ని చోట్ల సందర్భం డిమాండ్ చేయకపోయినా పంచ్ కోసం కొన్ని అనవసరపు ప్రాస డైలాగ్స్ చెప్పించాడు.

ఇక ఈ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన శ్రీపురం కిరణ్ గురించి చెప్పుకుంటే.. ఈ సినిమా ద్వారా ప్రేమకి – పెళ్ళికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఆయన చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, కానీ దానిని ఇంకాస్త పగడ్బందీగా రాసుకోవాల్సింది. కథలో లోపాలు ఉడడం వలన కథనంలో కూడా ఫ్లో మిస్ అవుతుంది. దానివల్ల ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టేసింది. ఇక డైరెక్టర్ గా మంచి మార్కులే వెయ్యచ్చు. దాసరి కిరణ్ కుమార్ సినిమాని 36 రోజుల్లో ఫినిష్ చేసినా సినిమాలో రిచ్ నెస్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఓ భారీ బడ్జెట్ మూవీలానే తీసాడు.

తీర్పు :

‘జీనియస్’ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హవిష్ ‘రామ్ లీల’ సినిమాతో యువతని బాగానే ఆకట్టుకుంటాడు. కృష్ణ లీలలన్నిటినీ రామ్ పాత్ర చేసిన హవిష్ లో చూపిస్తూనే ఒక చిన్న మెసేజ్ ని కూడా ఇవ్వడం బాగుంది. శ్రీ పురం కిరణ్ అనుకున్న కాన్సెప్ట్ ని ఇంకాస్త బెటర్ గా రాసుకొని ఉంటే సినిమా ఇంకా బాగుండేది. ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, నటీనటుల పెర్ఫార్మన్స్, ఆకట్టుకునే సెకండాఫ్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే బోరింగ్ ఫస్ట్ హాఫ్, ఊహించదగిన కథనం చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా మీరు ఈ సినిమాని యువత ఎంజాయ్ చెయ్యగలరు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

 
Like us on Facebook