సమీక్ష : బాద్ షా – వంద శాతం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ

Baadshah-Review3 విడుదల తేదీ : 05 ఏప్రిల్ 2013
దర్శకుడు : శ్రీను వైట్ల
నిర్మాత : బండ్ల గణేష్
సంగీతం : ఎస్.ఎస్ థమన్
నటీనటులు : ఎన్.టి.ఆర్, కాజల్, బ్రహ్మానందం…

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరికొత్త స్టైలిష్ లుక్ తో కనిపించనున్న ‘బాద్ షా’ సినిమా రేపు(ఏప్రిల్ 5న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని ఈ రోజు ముందే ప్రత్యేకంగా మేము తిలకించాము. మా 123తెలుగు.కామ్ పాఠకుల కోసం స్పెషల్ గా మొట్ట మొదట నెట్లో ‘బాద్ షా’ రివ్యూని అందిస్తున్నాము. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఈ సినిమాపై అంచనాలున్నాయి. అలాంటి భారీ అంచనాలను ఈ సినిమా అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ:

డాన్ సాధు భాయ్(కెల్లీ దోర్జీ) నేతృత్వంలో జరిగే ఇంటర్నేషనల్ క్రైమ్ ప్రపంచంలో బాద్ షా(ఎన్.టి.ఆర్) యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ గా ఎంతో దూకుడుగా దూసుకుపోతుంటాడు. బాద్ షా తండ్రైన రంజన్(ముఖేష్ రుషి) సాధు భాయ్ కి చాలా నమ్మకస్తుడు, అలాగే మాకాలో అతనికి బాగా లాభాలు తెచ్చి పెట్టే ఒక కాసినోని రంజన్ చూసుకుంటూ ఉంటాడు. ఇంటర్నేషనల్ క్రైమ్ లో బాద్ షా తన తెలివితేటలతో, ఎంతో డేరింగ్ గా తన లక్ష్యం వైపు దూసుకుపోతున్న టైంలో బాద్ షా కి సాధు భాయ్ కి మధ్య ఒక గొడవ జరుగుతుంది. దాంతో సాదు భాయ్ యంగ్ డాన్ బాద్ షా సామ్రాజ్యాన్ని కూల్చేయాలనుకుంటాడు. సాధు భాయ్ శత్రువులైన డాన్ క్రేజీ రాబర్ట్(ఆశిష్ విద్యార్ధి), వయోలెంట్ విక్టర్(ప్రదేప్ రావత్) తో కలిసి బాద్ షా ని, అతని ఫ్యామిలీని నాశనం చేయాలనుకుంటాడు.

సాధు భాయ్ ఇండియాలోని పలు మెట్రో సిటీలలో భారీ ఎత్తున టెర్రరిస్ట్ అటాక్స్ ప్లాన్ చేస్తాడు. సాధు ప్లాన్స్ ని ఎలాగైనా నాశనం చేయాలనే ఉద్దేశంతో బాద్ షా జానకి(కాజల్), ఆమె తండ్రి జై కృష్ణ సింహా(నాజర్) సహాయం తీసుకుంటాడు. జై కృష్ణ సింహా హైదరాబాద్ సిటీ కమీషనర్, అలాగే తన పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని సవ్యంగా చూసుకుంటూ, అందరినీ కంట్రోల్ చేసే స్ట్రిక్ట్ కుటుంబ పెద్ద కూడా, అదే ఫ్యామిలీలో ఒక మెంబర్ పద్మనాభ సింహా(బ్రహ్మానందం). అలా సినిమా జరుగుతున్న సమయంలో బాద్ షా కి తన గతం తెలియడంతో సాధు భాయ్ తో పోరాడి అతని సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి మరో బలమైన కారణం దొరుకుతుంది. ఆ కారణం ఏంటి? అసలు బాద్ షా ఎవరు? బాద్ షా వేసే ప్లాన్స్ కి పద్మనాభ సింహా ఎలా సరిపోయాడు? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

బాద్ షా గా ఎన్.టి.ఆర్ అద్భుతమైన నటనని కనబరిచాడు. అతని పాత్రలో దూకుడుగా వ్యవహరించే స్వభావం, స్టైల్, అలాగే కొంచెం క్రూరమైన మనస్తత్వం ఉండాలి. ఈ మూడు విభిన్నమైన కోణాలను ఎన్.టి.ఆర్ తెరపై సూపర్బ్ గా ఆవిష్కరించాడు. స్పాట్ లో అతని కామెడీ టైమింగ్ అదుర్స్, అలాగే ఇటలీలో కాజల్ తో జరిగే సీక్వెన్స్ లు చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. సెకండాఫ్ లో ఎన్.టి.ఆర్ లుక్, డైలాగ్ డెలివరీ పూర్తిగా మార్చేశాడు, అలాగే ఒకరి నుంచి మరో పాత్రలోకి మారడం(అవి ఏంటనేది నేను ఇప్పుడు చెప్పలేను) సూపర్బ్. ‘సైరో సైరో’, ‘రంగోలి రంగోలి’ పాటల్లో ఎన్.టి.ఆర్ స్టెప్పులు ఫెంటాస్టిక్ గా ఉన్నాయి.

ఫ్యాన్స్ కి ఈ సినిమా ఓ పండగా లాంటింది. ఈ సినిమాలో డిజైన్ చేసిన కొన్ని స్పెషల్ సీక్వెన్స్ లు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ జస్టిస్ చౌదరి గెటప్ లో వచ్చే సీక్వెన్స్ సింప్లీ సూపర్బ్. తన తాతగారైన లెజెండ్రీ సీనియర్ ఎన్.టి.ఆర్ లా చెయ్యడం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. సెకండాఫ్ లో వచ్చే సంగీత్ ఎపిసోడ్ లో సీనియర్ ఎన్.టి.ఆర్ పాపులర్ మెలోడీ పాటలపై చేసిన సీక్వెన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది

ఫస్ట్ హాఫ్ లో చాలా కీలకమైన సన్నివేశాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ వస్తుంది, అది చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఇన్స్ పెక్టర్ పద్మనాభ సింహా పాత్రలో బ్రహ్మానందం విపరీతంగా నవ్వించాడు, బ్రహ్మానందం పాత్ర సినిమాలో ఓ హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఎన్.టి.ఆర్ – నాజర్ – బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. హాలీవుడ్ సినిమా ‘ఇన్ సెప్చన్’ నుంచి తీసుకున్న ‘లివింగ్ అవుట్ ఎ డ్రీమ్’ అనే కాన్సెప్ట్ ని శ్రీను వైట్ల ఎంతో చాక చక్యంగా, సూపర్బ్ గా డీల్ చేసి బ్రహ్మానందం కామెడీ ట్రాక్ లో ఉపయోగించారు.

డైరెక్టర్ రివెంజ్ నాగేశ్వర రావు పాత్రలో ఎం.ఎస్ నారాయణ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు, అలాగే బాగా నవ్వించారు. ఇతని పాత్ర డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని పోలినట్టు ఉంటుంది కానీ అసభ్యకరంగా, ఎవరినీ ఇబ్బంది పెట్టేలా మాత్రం లేదు. ఎన్.టి.ఆర్, వెన్నెల కిషోర్, కాజల్ లతో కలిసి ఎం.ఎస్ నారాయణ ఫస్ట్ హాఫ్ లో బాగా నవ్వించారు. ‘బంతి’ ఫిలాసఫీతో, అలాగే వన్ లైన్ పంచ్ డైలాగ్స్ తో కాజల్ బాగా ఎంటర్టైన్ చేసింది మరియు సినిమాలో గ్లామరస్ గా ఉంది. సుహాసిని పాత్రకి తగ్గట్టు చేసారు, చెడ్డ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నవదీప్ నటన బాగుంది. హీరో సిద్దార్థ్ పాత్ర చాలా చిన్నది కానీ సినిమాకి చాలా కీలకమైన పాత్రని పోషించాడు. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాజర్ ఎఫెక్టివ్ గా చేసాడు. అలాగే సంగీత్ సెరెమనీ సీక్వెన్స్ లో అందరినీ ఆశ్చర్య పరిచేలా ప్రగతి డాన్సులతో ఆకట్టుకుంది.

సెకండాఫ్ లో పవర్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా చాలా వేగంగా ముందుకు వెళ్ళడం, అదిరిపోయే కామెడీ సీక్వెన్స్ లు, పెప్పీగా సాగే మూడు పాటలు (బంతిపూల జానకి, వెల్ కమ్ కనకం, రంగోలి రంగోలి) ప్రేక్షకుల్ని ఎక్కువ ఆనందానికి గురిచేస్తాయి. ప్రతి పాటని చాలా రిచ్ గా, కలర్ఫుల్ విజువల్స్ తో చిత్రీకరించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో శ్రీను వైట్ల పాత సినిమాలతో కొన్ని పోలికలు ఉండడం చెప్పదగిన మైనస్ పాయింట్. జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, మాస్టర్ భరత్, చంద్ర మోహన్, తాగుబోతు రమేష్ లాంటి టాలెంట్ నటుల పాత్రలను ఇంకా బాగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. ఇంటర్వల్ దగ్గర సినిమా కాస్త నిధానంగా సాగుతుంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమా కోసం నలుగురు సినిమాటోగ్రాఫర్స్ పనిచేసారు, ఎవరు ఏ షాట్ ని షూట్ చేసారు అని చెప్పడం కాస్త కష్టమైన పని కానీ విజువల్ మాత్రం చాలా రిచ్ గా, కలర్ ఫుల్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది, అది సినిమాకి చాలా సపోర్ట్ గా నిలిచింది. అన్ని పాటల్లో కొరియోగ్రఫీ చాలా బాగుంది ముఖ్యంగా ‘సైరో సైరో’, ‘రంగోలి రంగోలి’ సాంగ్స్ లో ఎన్.టి.ఆర్ బెస్ట్ స్టెప్స్ వేసాడు. డైలాగ్స్ చాలా కామెడీగా ఉన్నాయి, వన్ లైన్ పంచ్ డైలాగ్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ఆ క్రిడిట్ మొత్తం శ్రీను వైట్ల, గోపీ మోహన్, కోనా వెంకట్ లకే చెందుతుంది.

శ్రీను వైట్ల సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉన్నందువల్ల బాక్స్ ఆఫీసు వద్ద చాలా సూపర్ హిట్స్ అందుకున్నారు, ఆ సినిమాల్లానే ‘బాద్ షా’ విజయంలో కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ సినిమాలో కూడా కొన్ని సూపర్బ్ కామెడీ సీక్వెన్స్ లతో మన ముందుకి వచ్చారు. బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణలను ఈ సినిమాలో చాలా బాగా ఉపయోగించుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

సమ్మర్ హాలిడేస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయదగిన ఎఫెక్టివ్ ఎంటర్టైనర్ ‘బాద్ షా’. ఎన్.టి.ఆర్, కాజల్, బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణల బెస్ట్ పెర్ఫార్మన్స్, వారి కాంబినేషన్లో వచ్చే హై ఎంటర్టైనింగ్ సెకండాఫ్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్. శ్రీను వైట్ల పాత సినిమాలతో కొన్ని పోలికలు ఉండడం చెప్పదగిన మైనస్ పాయింట్. ఈ వారం బాగా ఎంజాయ్ చేయదగిన సినిమా. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ‘బాద్ షా’ – 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ..!

123తెలుగు.కామ్ రేటింగ్ : బాద్ షా చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. మా సమీక్ష చదవండి, మీరే స్వయంగా సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి..

రివ్యూ – మహేష్ ఎస్ కోనేరు
అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :