సమీక్ష : సుబ్రమణ్యం ఫర్ సేల్ – పర్ఫెక్ట్ బాక్స్ ఆఫీసు సేల్.!

విడుదల తేదీ : 24 సెప్టెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

దర్శకత్వం : హరీష్ శంకర్

నిర్మాత : ‘దిల్’ రాజు

సంగీతం : మిక్కీ జే మేయర్

నటీనటులు : సాయిధరమ్ తేజ్, రెజీన, బ్రహ్మానందం..


‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో సూపర్ హిట్ పెయిర్ అనిపించుకున్న యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ – రెజీన కసాండ్ర మరోసారి జంటగా నటించిన సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. కుటుంబ విలువలతో పాటు, కమర్షియల్ అంశాలను పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ బాక్స్ ఆఫీసు వద్ద ఏ రేంజ్ లో సేల్ అవుతాడు అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

వాడి వేడి ఉన్న అచ్చమైన తెలుగు కుర్రాడు మన సుబ్రమణ్యం(సాయిధరమ్ తేజ్). డాలర్ వేటలో మన సుబ్రమణ్యం అమెరికాలో జీవనం సాగిస్తుంటాడు. డాలర్ కోసం ఏం చెయ్యడానికైనా సిద్దపడే వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ వారందరికీ భిన్నంగా డాలర్ కోసం సుబ్రమణ్యం తనని తానే అమ్ముకోవడం మొదలు పెడతాడు.. డాలర్ కోసం నవ్వడం – నవ్వించడం, ఏడవడం – ఎడ్పించడం, కొట్టడం – కొట్టించుకోవడం, ఆట – పాట… ఇలా ఏ పని చేయడానికైనా సిద్దమే.. ఆ బిజినెస్ కి కూడా మంచి గిట్టుబాటే రావడంతో డాలర్స్ తో జేబు నింపుకుంటాడు సుబ్రమణ్యం. అలాంటి సమయంలోనే మన సుబ్రమణ్యం లైఫ్ లోకి సీత(రెజీన కసాండ్ర) ఎంటర్ అవుతుంది. తన కుటుంబాన్ని వదులుకొని వచ్చి ప్రేమించిన అబ్బాయి చేతిలో మోసపోయిన సీతకి మన సుబ్రమణ్యం సెల్టర్ తో పాటు తను పనిచేసే రెస్టారెంట్ లో జాబ్ ఇప్పిస్తాడు.

అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో సీత తన చెల్లెలు గీత(తేజస్వి) పెళ్లి కోసం తన సొంత ఊరు కర్నూల్ వెళ్ళాల్సి వస్తుంది. తనకి ధైర్యం కోసం సుబ్రమణ్యంని తీసుకెళుతుంది. అక్కడ సినిమాకి మెయిన్ విలన్స్ అయిన బియ్యం బుజ్జి(రావు రమేష్) మరియు గోవింద్ గౌడ్(అజయ్)ఎంటర్ అవుతారు. వీరిద్దరికీ సంబంధం లేకపోయినా వీరిద్దరి టార్గెట్ మాత్రం సుబ్రమణ్యం. బియ్యం బుజ్జి సుబ్రమణ్యంని వేసేయ్యాలి అనుకుంటే, గోవింద్ గౌడ్ మాత్రం తన చెల్లెలు దుర్గ(ఆద శర్మ)ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటూ చేజ్ చేస్తుంటాడు. ఇక అక్కడి నుంచి ఏం జరిగింది.? సీతకి ఉన్న సమస్య ఏమిటి.? అసలెందుకు సుబ్రమణ్యంని బియ్యం బుజ్జి చంపాలనుకున్నాడు.? మరోవైపు గోవింద్ గౌడ్ ఎందుకు తన చెల్లిని సుబ్రమణ్యంకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు..

ప్లస్ పాయింట్స్ :

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే టైటిల్ వినడానికి ఎంత డిఫరెంట్ గా ఉందో అంతే డిఫరెంట్ గా హీరో పాత్రని డిజైన్ చెయ్యడం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. తనని తానూ అమ్ముకోవాలి అనే కాన్సెప్ట్ చూసే ఆడియన్స్ కి కొత్త ఫీల్ ని ఇవ్వడమే కాకుండా దాని చుట్టూ రాసుకున్న అమెరికా బ్యాక్ డ్రాప్ సీన్స్ చాలా ఎంటర్టైన్ చేస్తాయి. కమెడియన్స్ తో ఎక్కువ పని లేకుండా హీరో పాత్రతోనే ఎక్కువ భాగం కామెడీని పండిస్తూ రావడం కూడా సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. అంతే కాకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆద్యంతం మిమ్మల్ని నవ్విస్తూ, శరవేగంగా సాగిపోతుంది.

ఇక సినిమాకి హీరో అయిన సాయిధరమ్ తేజ్ కి ఇది మూడవ సినిమా.. గత రెండ సినిమాలతో పోల్చుకుంటే.. తన స్క్రీన్ ప్రెజెంటేషన్(లుక్ అండ్ స్టైలింగ్)కి చాలా మార్క్స్ పడ్డాయి, తను కూడా చూడటానికి చాలా బాగున్నాడు. ఇక ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. తను వేసే కామెడీ పంచ్ లు బాగా పేలాయి. అలాగే హరీష్ శంకర్ లాంటి మాస్ డైరెక్టర్ చేతిలో పడటం వలన డైలాగ్ డెలివరీ, మాస్ సీన్స్ చేయడంలో మరింత ప్రతిభని చూపాడు. కొన్ని రొమాంటిక్ సీన్స్ వలన సాయిధరమ్ తేజ్ కి మాంచి రొమాంటిక్ హీరో అని కూడా అనిపించుకుంటాడు. అలాగే డాన్సులు ఇరగదీసాడు. హీరోయిన్ గా చేసిన రెజీనకి సూపర్బ్ క్రేజ్ తెచ్చి పెట్టే సినిమా ఇదవుతుంది. సీత పాత్రలో తన అమాయకత్వంతో నవ్విస్తూనే, అక్కడక్కడా ఎమోషనల్ గా కూడా టచ్ చేస్తుంది. వీటితో పాటు పాత్రలో భాగంగానే మునుపెన్నడూ కనిపించనంత గ్లామరస్ గా కూడా కనిపిస్తుంది. ఇక సినిమాకి హైలైట్ గా నిలిచింది అంటే సాయిధరమ్ తేజ్ – రెజీనల రొమాంటిక్ ట్రాక్. సెకండాఫ్ లో వీరి కాంబినేషన్ లో వచ్చే మూడు రొమాన్స్ ఎపిసోడ్స్ చూసే ఆడియన్స్ ని వారి ప్రేమలో పడేయడమే కాకుండా పలువురికి వారి ప్రేమలోని మాధుర్యాన్ని గుర్తుచేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే లవ్ ట్రాక్ లో సాయిధరమ్ తేజ్ – రెజీనల కెమిస్ట్రీ, పెర్ఫార్మన్స్, ఎనర్జీ లెవల్స్ సింప్లీ సూపర్బ్. బ్రహ్మానందం ఫస్ట్ హాఫ్ లో కాసేపు సెకండాఫ్ లో కాసేపు బాగా నవ్వించాడు. ఇక రావు రమేష్, సుమన్, అజయ్, ఫిష్ వెంకట్, నరేష్, ఝాన్సీ, రణధీర్, తేజస్వి తదితరులు తమ చిన్న చిన్న పాత్రలలో ఓకే అనిపించుకున్నారు. అతిధి పాత్రలో కనిపించిన ఆద శర్మ కనిపించేది మూడు సీన్స్ లో క్యూట్ గా ఉన్నా, తనకి చెప్పుకోదగిన పాత్ర లేకపోవడం తనకి పెద్దగా గుర్తింపు రాదు.

ఇక సినిమా పరంగా చెప్పాలి అనుకుంటే సినిమాలో సుబ్రమణ్యంని పరిచయం చేసిన దగ్గరి నుంచి, అతని పాత్రని ఎస్టాబ్లిష్ చేయడం, అతనికి జోడీ అయిన సీతని కలపడం లాంటి విషయాలు చాలా చాలా ఆసక్తికరంగా ఉంటూనే మీ పెదవులపై నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఉంటాయి. మధ్య మధ్యలో మాస్ ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ అంతా ఆడియన్స్ ని రంజింపజేశాడు. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగుంది. ఇక సెకండాఫ్ లో ఓ అందమైన ఉమ్మడి కుటుంబంలో ఉండే విలువలని, అందులో ఉండే సరదాలను చూపిన విధానం మనసుకు హత్తుకుంటుంది. ముఖ్యంగా లీడ్ పెయిర్ రొమాటిక్ ట్రాక్ హైలైట్ అయితే ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్ లో ఆడియన్స్ కి ఓ మంచి ఫీల్ ని ఇచ్చి బయటకి పంపిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ సినిమాకి నెగటివ్ పాయింట్స్ అనే విషయానికి వస్తే హరీష్ శంకర్ తన ప్రతి సినిమాలోనూ ఎక్కువ భాగం చేసిన తప్పు కథా పరంగా సూపర్బ్ స్టార్ట్ ఇస్తాడు, కానీ సూపర్బ్ అనేలా ఎండ్ చెయ్యడం చాలా చాలా తక్కువ. కథా పరంగా ఇందులోనూ ఆలాంటిదే జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పటికే చూసేసిన పాత కథ. దానిని బాగానే ప్రెజంట్ చేస్తూ వచ్చి క్లైమాక్స్ ని మరీ ఊహాజనితంగా మార్చేశాడు. ఎలా అంటే సెకండాఫ్ మొదలైన 10 నిమిషాలకే కథకి ముగింపు ఏంటనేది అర్థమైపోతుంది. కొన్ని సీన్స్ బాగున్నా, కొన్ని కొన్ని బోర్ కొట్టడం, సాగ దీస్తున్నారు అనే ఫీలింగ్ వలన ఆడియన్స్ మదిలోకి ఊహించదగిన రెగ్యులర్ ముగింపే కదా అనే భావన కలుగుతూ ఉంటుంది. కావున కథ – కథనం విషయంలో సెకండాఫ్ ని ఇంకాస్త క్రేజీగా రాసుకొని ఉండాల్సింది.

ఇకపోతే సినిమాలో హీరోయిజం మరియు విలనిజం యాంగిల్ ని ఫస్ట్ హాఫ్ లో చాలా స్ట్రాంగ్ గా చూపించాడు, కానే సెకండాఫ్ లో రెండింటిని కామెడీ వైపు తీసుకొచ్చేయడం వలన విలనిజం అనేది పెద్దగా పండలేదు. ముఖ్యంగా విలనిజంని పూర్తి కామెడీగా మార్చేయడం పెద్దగా నచ్చకపోవచ్చు. సుమన్, రావు రమేష్, నాగబాబు లాంటి స్టార్ నటులను సరిగా వినియోగించుకోలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో దాదాపు అందరూ డైరెక్టర్ రాసుకున్న సీన్స్ కి పూర్తి న్యాయం చేసారు. ముందుగా సి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అదుర్స్ అని చెప్పాలి. యుఎస్ లోని లొకేషన్స్ ని చూపిన విధానం అదిరిపోయింది, లొకేషన్స్ అండ్ విజువల్స్ ఆడియన్స్ కి హీరో పాత్రలానే ఆడియన్స్ కి ఓ సూపర్బ్ ఫీల్ ని ఇస్తాయి. ముఖ్యంగా అమెరికాలో పాటల కోసం ఎంచుకున్న లొకేషన్స్ సూపర్బ్. ఇకపోతే ఆ విజువల్స్ కి మిక్కీ జే మేయర్ అందించిన నేపధ్య సంగీతం సూపర్బ్.. మిక్కీ ఇలాంటి మాస్ మ్యూజిక్ కూడా ఇవ్వగలడా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే, తన మార్క్ మ్యూజిక్ ని కూడా ఎమోషనల్ సీన్స్ కి ఇచ్చి నేపధ్య సంగీతానికి పూర్తి న్యాయం చేసాడు. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్ లో రీ రికార్డింగ్ అదరగొట్టాడు. ఇకపోతే ఆయన పాటలు ఇప్పటికే పెద్ద హిట్, ఆన్ స్క్రీన్ కూడా విజివల్స్ పరంగా కూడా బాగా ఆకట్టుకున్నాయి. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ బాగానే అని కాకుండా చాలా బాగుంది అనుకునే రేంజ్ లో ఉండి ఉంటే సినిమాకి ఇంకా పెద్ద హెల్ప్ అయ్యేది. అక్కడక్కడా లాగ్స్ ఉన్నాయి వాటిని కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. రామకృష్ణ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఇంటి సెట్ సూపర్ గా ఉంది. సినిమాకి చాలా మంచి ఫీల్ ని తీసుకొచ్చాయి అతని సెట్టింగ్స్. వెంకట్, రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయేలా బాగా కంపోజ్ చేసారు.

ఇక సినిమాకి కెప్టెన్ అయిన హరీష శంకర్ విషయానికి వస్తే.. కథ, మాటలు, దర్శకత్వం ఇలా నాలుగు మేజర్ డిపార్ట్ మెంట్స్ ని డీల్ చేసాడు. కథ – కథలో పాత్రలు కొత్తవి, కానీ ఇన్నర్ గా నడిచే కథ పాతదే, ఇంచు మించు మనం ఇంతకముందు చూసిందే.. కథనం – ముగ్గురు కలిసి రాసిన ఈ కథనం ఫస్ట్ హాఫ్ పరంగా కేక అయితే సెకండాఫ్ పరంగా ఓకే. కానీ నేరేషన్ స్పీడ్ గా ఉండడం సినిమాకి హెల్ప్ అయ్యింది. ఇక డైరెక్టర్ గా ప్రతి సారి ఓ సరికొత్త పాత్రతో అలరించే హరీష్ శకర్ ఈ సారి కూడా పాత్రలని సూపర్బ్ గా రాసుకున్నాడు. డైరెక్టర్ గా కూడా వాటిని బాగా డీల్ చేసాడు, నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా ది బెస్ట్ రాబట్టుకున్నాడు. ఇలా ఇన్నిటిలో సూపర్బ్ వర్క్ చేసిన హరీష్ శంకర్ పాత కథ – కథనాలను ఎంచుకోవడం కారణంగా ఓవరాల్ సినిమా అయ్యాకా ఫైనల్ గా ఎలా ఉంది అనే విషయంలో మాత్రమే 100% స్కోర్ చేయలేక ఒక 80%తోనే సరిపెట్టుకున్నాడు. దిల్ రాజు నిర్మాణ విలువలు అమేజింగ్ అని చెప్పాలి. కథని నమ్మి ఓ గ్రాండ్ విజువల్ ట్రీట్ గా ఈ సినిమాని తీర్చిదిద్దారు. సో అతని నిర్మాణ విలువలకి సింప్లీ హ్యాట్సాఫ్..

తీర్పు :

తెలుగు ప్రేక్షకులు కోరుకునే రొమాన్స్, కామెడీ, యాక్షన్ లతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని సమపాళ్ళలో మిక్స్ చేసి మన ముందుకు తీసుకువచ్చిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా ఈ సీజన్ లో వచ్చిన పర్ఫెక్ట్ కమర్షియల్ బాక్స్ ఆఫీస్ సేల్. సాయిధరమ్ తేజ్ కెరీర్లో మూడవ సినిమాగా, సుప్రీం హీరో అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కూడా తనకి స్ట్రాంగ్ కలెక్షన్స్ తెచ్చిపెడుతుంది. హరీష్ శంకర్ పాత కథని కొత్తరకమైన హీరో పాత్రతో ఆధ్యంతం ఎంటర్టైనింగ్ గా చెప్పడమే ఆడియన్స్ ని మెప్పించే విషయం. ఓవరాల్ గా ఫుల్ లెంగ్త్ కామెడీ, సాయిధరమ్ తేజ్ – రెజీనల సూపర్బ్ రొమాంటిక్ ట్రాక్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు ఉండడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయితే, పాత కథ, ఊహాజనిత కథనం, స్ట్రాంగ్ విలనిజం లేకపోవడం, సెకండాఫ్ లో సీరియస్ నెస్ ని తగ్గించేసి కామెడీకి పెద్ద పీత వెయ్యడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా సాయి ధరమ్ తేజ్ – రెజీన – హరీష్ శంకర్ – దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన బాక్స్ ఆఫీసు విజేతే ఈ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.

123తెలుగు రేటింగ్ : 3.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :

More