సమీక్ష : టచ్ చేసి చూడు – రొటీన్ టచ్

సమీక్ష : టచ్ చేసి చూడు – రొటీన్ టచ్

Published on Feb 3, 2018 7:04 PM IST
Touch Chesi Chudu movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 2, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రవి తేజ, రాశీ ఖ‌న్నా, సీర‌త్ క‌పూర్

దర్శకత్వం : విక్రమ్ సిరికొండ

నిర్మాత : నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), వల్లభనేని వంశీ

సంగీతం : ప్రీతమ్ (జామ్ 8)

సినిమాటోగ్రఫర్ : చోటా కె. నాయుడు

ఎడిటర్ : గౌతం రాజు

స్టోరీ, స్క్రీన్ ప్లే : వక్కంతం వంశీ, విక్రమ్ సిరికొండ, దీపక్ రాజ్

మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

అన్నిటికన్నా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కార్తికేయ (రవితేజ) పెళ్లి చూపుల్లో పుష్ప (రాశీఖన్నా)ను ప్రేమిస్తాడు. కానీ కొన్ని చిన్న చిన్న సమస్యల వలన ఆమె అతన్ని దూరం పెడుతుంది. అలా వారి ప్రేమ కథ సాగుతుండగా కార్తికేయ చెల్లెలు ఒక హత్యను చూసి సాక్ష్యం చెబుతానని ముందుకొస్తుంది.

ఆమెకు రక్షణగా నిలిచే ప్రయత్నంలో తన చెల్లెలు చూసిన హంతకుడు గతంలో తాను పోలీసాఫీసర్ గా ఉన్నప్పుడు డీల్ చేసిన ఒక కేసులో నిందితుడని తెలుసుకుని అతన్ని అంతం చేసేందుకు తిరిగి పోలీస్ గా మారుతాడు. అసలు కార్తికేయ పోలీస్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడు, ఆ క్రిమినల్ గతంలో అతన్నుండి ఎలా తప్పించుకున్నాడు, తిరిగి ఉద్యోగంలో చేరిన కార్తికేయ అతన్ని ఎలా అంతం చేశాడు అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ ఫస్టాఫ్. ఫన్నీ ఫన్నీగా ఉండే రవితేజ క్యారెక్టర్ కొంత ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగే అతనికి, రాశీఖన్నాకు మధ్యన లవ్ ట్రాక్ ఫన్ తో నిండి ఎంటర్టైన్ చేసింది. ఈ లవ్ ట్రాక్లో మనకు కామెడీ మాటల్తో, ఎనర్జిటిక్ బాడీ లాంగ్వేజ్ తో పాత చిలిపి రవితేజ కనిపిస్తారు. రాశీఖన్నా కూడా క్యూట్ గా కనిపిస్తూ, మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చి ఆకట్టుకుంది.

ప్రేక్షకుల్ని రవితేజ గతంలోకి తీసుకెళ్లే ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగుంది. దీని వలన సెకండాఫ్ మీద ఆసక్తి నెలకొంది. నియమాల్ని, చివరికి కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా డ్యూటీ చేసే రవితేజ పాత్ర బాగుంది. పోలీస్ అనేవాడు భాధ్యతల్ని, కుటుంబాన్ని బ్యాలన్స్ చేస్తూ ముందుకెళ్లాలని దర్శకుడు చెప్పిన పాయింట్ బాగుంది. వీటన్నిటి మధ్యలో వచ్చే వెన్నెల కిశోర్, మురళీ శర్మల కామెడీ కొంత నవ్వించగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ప్రేక్షకులకి కనెక్టవుతాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో కొత్త కథ, అలరించే కథనం లేకపోవడమే ప్రధాన బలహీనత. మొదటి అర్ధభాగాన్ని లవ్ ట్రాక్, కామెడీతో ఏదోలా నడిపిన దర్సకుడు సెకండాఫ్లో తేలిపోయాడు. కొత్తదనం చూపకపోగా కనీసం ఎంటర్టైన్మెంట్ ను అందించలేకపోయారు. ఇంటర్వెల్ తర్వాత కాసేపు సినిమాని రవితేజ ముందుకులాగే ప్రయత్నం చేసినా రొటీన్, బోరింగ్ కథనం ప్రేక్షకులకి నీరసాన్ని తెప్పిస్తుంది.

ఫస్టాఫ్ ప్రారంభమైన 45 నిముషాలకు కూడా అసలు కథేమిటో క్లారిటీ రాకపోవడంతో గమ్యంలేని ప్రయాణం చేసిన ఫీలింగ్ కలిగింది. అలాగే కథకు ప్రధానమైన ప్రతినాయకుడి పాత్రలో అస్సలు క్లారిటీ ఉండదు. ఆఖరులో కూడా కథను ఎలాంటి ఎఫర్ట్స్ లేకుండా హీరో సింపుల్ గా ముగించేయడం అసంతృప్తిని కలిగించింది. హీరో గతం కూడా పోలీస్ కోణంలో పర్వాలేదనిపించినా మిగతా అంశాల్లో రొటీన్, బోరింగా నడిచి ప్రేక్షకుల్లో కూడా నీరసాన్ని పెంచేంసింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు విక్రమ్ సిరికొండ రొటీన్ కథను తీసుకున్నప్పుడు దానికి మంచి ఫన్ ను, యాక్షన్ ను, ఆసక్తికరమైన కథాన్ని జోడించి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా తయారుచేయాలి. కానీ కొంత ఫస్టాఫ్ మినహా మిగతా సినిమా మొత్తం అన్ని సినిమాల్లో చూసిన బోరింగ్ సన్నివేశాలతో నిండి పెద్దగా వర్కవుట్ కాలేదు.

మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రీతమ్ యొక్క జామ్ 8 వారి సంగీతం పర్వాలేదనిపించింది. చోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ పర్వాలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ పర్వాలేదు. వల్లభనేని వంశీ, నల్లమలుపు బుజ్జిల నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

రవితేజ చేసిన ‘టచ్ చేసి చూడు’ చిత్రం ఏమంత ప్రభావాన్ని చూపలేకపోయింది. కొంతలో కొంత పర్వాలేదనిపించిన ఫస్టాఫ్, రొమాంటి ట్రాక్, అక్కడక్కడా నవ్వించిన కామెడీ, కొంత యాక్షన్ కాసేపు ఎంటర్టైన్ చేసినా రొటీన్ కథ, బోరింగ్ కథనం, సన్నివేశాలు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించాయి. మొత్తం మీద ఈ చిత్రం బి, సి సెంటర్ల ప్రేక్షకులకు కొంతమేర నచ్చవచ్చేమోకానీ కొత్తదనాన్ని ఆశించేవారిని, మల్టీప్లెక్స్ ఆడియన్సును మెప్పించదు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు