సమీక్ష : త్రిష లేదా నయనతార – బూతు ఎక్కువ, కంటెంట్ తక్కువ.!

సమీక్ష : త్రిష లేదా నయనతార – బూతు ఎక్కువ, కంటెంట్ తక్కువ.!

Published on Nov 7, 2015 3:00 PM IST
Trisha Leda Nayanatara review

విడుదల తేదీ : 05 నవంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : ఆదిక్ రవిచంద్రన్

నిర్మాత : రుషి మీడియా

సంగీతం : జివి ప్రకాష్ కుమార్

నటీనటులు : జివి ప్రకాష్ కుమార్, ఆనంది, మనీషా యాదవ్..


మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగులో ‘డార్లింగ్’, ‘ఎందుకంటే ప్రేమంట’ లాంటి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చి తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న జివి ప్రకాష్ కుమార్ హీరోగా మారి చేసిన రెండవ సినిమా ‘త్రిష ఇల్లన నయనతార’. ఇదే సినిమాని ‘త్రిష లేదా నయనతార’ అంటూ తెలుగులోకి డబ్ చేసారు. ఆనంది, మనీషా యాదవ్ కలిసి నటించిన ఈ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. మ్యూజిక్ తో మెప్పించిన జివి ప్రకాష్ హీరోగా ఏ మేరకు మెప్పించాడు అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఒక వర్జిన్ అబ్బాయి తన లైఫ్ లోకి ఒక వర్జిన్ అమ్మాయే రావాలని కోరుకుంటాడు, అలాంటి అమ్మాయి కోసం చేసే వెతుకులాటే ఈ ‘త్రిష లేదా నయనతార’. ఇక సినిమా అసలు కథలోకి వెళితే.. జీవ(జివి ప్రకాష్ కుమార్) – రమ్య(ఆనంది) – అదితి(మనీషా యాదవ్) వీరు ముగ్గురూ ఒకే రోజు ఒకే హాస్పిటల్ లో జన్మిస్తారు. అలాగే ఒకే కాలనీలో ఉండడం వలన చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా పెరుగుతారు. ఇంటర్మీడియట్ చదివే టైంలో జీవ – రమ్యలు ప్రేమలో పడతారు.. కానీ చాలా తక్కువ టైంలోనే రమ్య జీవని ఛీ కొట్టి ఆ ఊరి నుంచి వెళ్ళిపోతుంది. ఆ బాధలో ఉన్న జీవకి అదితి లవ్ ప్రపోజ్ చేయడంతో త్రిష లేకపోతె ఏం నయనతార దక్కింది కదా అని జీవ అదితి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.

కట్ చేస్తే.. మూడేళ్ళపాటు ప్రేమించుకున్న జీవ – అదితిలు కూడా విడిపోతారు. ఇక అమ్మాయిలే వద్దనుకొని హైదరాబాద్ నుంచి బాబాయ్(విటివి గణేష్)తో ఉందాం అని రాజమండ్రి వెళ్ళిన జీవకి మళ్ళీ అక్కడ రమ్య కనిపిస్తుంది. దాంతో జీవకి మళ్ళీ రమ్యపై లవ్ మొదలవుతుంది. మొదట్లో ఛీ కొట్టిన రమ్య మెల్లగా మళ్ళీ జీవని లవ్ చేయడం మొదలు పెడుతుంది. అంతా బాగానే సాగుతోంది వీరిద్దరి ప్రేమ పెళ్ళికి దారి తీస్తోంది అనుకున్న టైంలో ఈ సారి జీవ రమ్యని వదిలి వెళ్ళిపోతాడు. అసలు చివర్లో జీవ రమ్యని ఎందుకు వదిలేసాడు? వదిలేసి ఏం చేసాడు? అసలు జీవ మొదటిసారి రమ్యతో, అదితితో ఎందుకు విడిపోయాడు.? చివరికి రమ్య లేదా అదితిలలో ఎవరితో అన్నా సెట్ అయ్యాడా? లేదా? అన్నదే మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ..

ప్లస్ పాయింట్స్ :

త్రిష లేదా నయనతార అనే సినిమా పూర్తిగా అడల్ట్ కామెడీ సీన్స్ మరియు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రాసుకున్న సినిమా. కావున అడల్ట్ కామెడీ సినిమాలని ఇష్టపడే వారికి, అలాంటి కామెడీని ఎంజాయ్ చేసే కొంతమంది మాస్ తరహా ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. అందులో భాగంగా డైరెక్టర్ రాసుకున్న కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే పేలాయి. ఈ సినిమాని మొదలు పెట్టడం చాలా బాగుంది. మధ్య మధ్యలో కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా బాగుంది అనే ఫీల్ తోనే ఇంటర్వెల్ వరకూ సినిమా సాగిపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే జివి ప్రకాష్ కి నటనలో పెద్ద అనుభవం లేకపోవడం వలన కొన్ని చోట్ల ఓకే అనిపించినా కొన్ని చోట్ల మాత్రం బాగా తేలిపోయాడు. ఈ సినిమా కోసం తను ఇంకా బాగా వర్కౌట్ చేయాల్సింది. బస్ స్టాప్ సినిమాలో కనిపించిన ఆనంది ఈ సినిమాలో ఉన్న నటీనటుల్లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తన పాత్రకి కావాల్సిన అన్ని హావభావాలను బాగా ఇచ్చింది. ఇక మరో హీరోయిన్ గా చేసిన మనీషా యాదవ్ ఈ సినిమాకి గ్లామర్ అట్రాక్షన్. ఉన్నది కాసేపే అయినా తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. సిమ్రాన్ చిన్న పాత్రలో ఓకే అనిపించింది. విటివి గణేష్ చేత చెప్పించిన కొన్ని పంచ్ డైలాగ్స్ బాగానే పేలాయి. అతిధి పాత్రల్లో కనిపించిన ఆర్య, ప్రియా ఆనంద్ లు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

ముందుగా ఈ సినిమా తెలుగు నేటివిటీకి ఎక్కడా సింక్ అయ్యేలా కనిపించదు. సినిమా ఫ్లేవర్ మొదటి నుంచి చివరి దాకా తమిళ వాసనతోనే నడుస్తుంది. ఇక ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ గా నిలిచినవి మూడు.. అవే కథ, కథనం మరియు సెకండాఫ్. డైరెక్టర్ ఆదిక్ అనుకున్న స్టొరీ లైన్ ఒకటి, కానీ పూర్తి కథగా రాసేటప్పటికి అది ఇంకో కథలా తయారైంది. అలాగే కథలో ఎక్కడా తను ఏ పాయింట్ ని స్ట్రాంగ్ గా చూపలేదు, చివరికి తను చెప్పాలనుకున్న పాయింట్ ని కూడా ఒకే ఒక్క డైలాగ్స్ లో చెప్పి ముగించేసాడు. దాని పరంగా కథలో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఉండదు. ఇక కథనంలో మీరు ఊహించినదే జరుగుతుంది. దానికి తోడు సినిమా మొదటి నుంచి చాలా స్లోగా సాగుతూ ఉంటుంది. అక్కడక్కడా కొన్ని అడల్ట్ కామెడీ సీన్స్ నవ్వించినా సినిమాతో ఒక ఫ్లోలో ఆడియన్స్ అస్సలు కనెక్ట్ అవ్వరు.

ఇకపోతే ఆదిక్ తన కథలో ఉన్న కాస్త పనికోచ్చే సీన్స్, కథని ఫస్ట్ హాఫ్ లోనే చెప్పేసాడు. దాంతో సెకండాఫ్ లో చెప్పడానికి ఏమీ లేదు. దాంతో సెకండాఫ్ నత్తనడకన సాగుతుంది. ఒక స్టేజ్ లో ఆడియన్స్ ఎప్పుడెప్పుడు సినిమాకి శుభం కార్డ్ వేస్తారా అని కూడా ఫీలవుతారు. సెకండాఫ్ పూర్తి డిజాస్టర్ అనిచెప్పుకోవాలి. ఇకపోతే సెకండాఫ్ అంతా ట్రూ లవ్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది, కానీ చివర్లో అప్పటి వరకూ జరిగింది అంతా తూచ్ అన్నట్టు ముగించేయడం చూసే వారికి చిరాకు తెప్పిస్తుంది. డైరెక్టర్ కొత్తవాడు కావడం వలన తడబట్టున్నాడు. ఆ తడబాటుకి ప్రతిఫలమే తను రాసుకున్న సీన్స్ కి కూడా పర్ఫెక్ట్ గా తీయలేకపోవడం. చూస్తున్న ప్రతి ఆడియన్ కి సీన్ బానే ఉంది కానీ డైరెక్టర్ ఎందుకు ఇలా తీసాడు అనే భావన కలుగుతుంది. అలాగే డైరెక్టర్ సినిమాలో ఏ ఒక్క లవ్ స్టొరీని, ఏ ఒక్క ఎమోషన్ ని సరిగా చూపలేదు, అన్నిటినీ కామెడీ చేసేసాడు, అందుకే సినిమా రిజల్ట్ కూడా కామెడీ అయిపోయింది. సినిమానే స్లోగా ఉన్న టైంలో పాటలు వచ్చి తెగ ఇబ్బంది పెడతాయి.

సాంకేతిక విభాగం :

రిచర్డ్ ఎం. నాథన్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమా కంటెంట్ కి తగ్గట్టే ఎంచుకున్న లొకేషన్స్ ని చాలా బాగా ప్రెజంట్ చేసాడు. ఇది తమిళ సినిమా కాబట్టి విజువల్స్ లో తమిళనాడు నాటు కూడా కాస్త కనిపిస్తుంది. ఇక జివి ప్రకాష్ కుమార్ తన సినిమాకి తానె ఇచ్చుకున్న మ్యూజిక్ ఆల్బం డీసెంట్ గా అనిపిస్తుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఎక్కువ భాగం ఆడుకలం(పందెం కోళ్ళు) సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ నే ఇందులోనూ ఉపయోగించేసాడు. రుబెన్ ఎడిటింగ్ బాలేదు. ఫస్ట్ హాఫ్ పరవాలేదనిపించినా సెకండాఫ్ ని సాగాదీసేసాడు. శశాంక్ వెన్నెలకంటి రాసిన కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ తెలుగులో కూడా బాగానే పేలాయి. కొన్ని చోట్ల డైలాగ్స్ లో భూతు మరీ ఎక్కువైంది.

ఇక డైరెక్టర్ ఆదిక్ విషయానికి వస్తే.. కథ కోసం అనుకున్న ప్లాట్ ఒకటి తను డెవలప్ చేసుకున్న కథ ఒకటి.. కావున సినిమాలో మనకూ ఏ పాయింట్ కూడా కనెక్ట్ అవ్వదు. అలాగే కథనం అస్సలు బాలేదు. ఏం జరుగుతుందో ఆడియన్స్ కి తెలుస్తుంది అనుకున్నప్పుడు ఇక ఆ కథనంలో కిక్ ఏముంటుంది చెప్పండి. ఇక నేరేషన్ గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. చాలా స్లో గా ఉంది. ఇక డైరెక్టర్ గా అయితే డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడుకానీ రాసుకున్న సీన్స్ ని పర్ఫెక్ట్ గా తీయడంలో, నటీనటుల నుంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో ఫెయిల్ అవ్వడమే కాకుండా సినిమాకి మెయిన్ అయిన లవ్ అనే ఫీల్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యాడు. తెలుగులో డబ్ చేసిన రుషి మీడియా వారి డబ్బింగ్ ఫార్మాలిటీస్ డీసెంట్ గా ఉన్నాయి.

తీర్పు :

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటూ రిలీజ్ చేసిన ‘త్రిష లేదా నయనతార’ అనే సినిమా పర్ఫెక్ట్ అడల్ట్ కామెడీ మూవీ. ఈ సినిమాలో అక్కడక్కడా డబుల్ మీనింగ్ డైలాగ్స్, సీన్స్ తో నవ్వించే అడల్ట్ కామెడీ బిట్స్ తప్ప మరేమీ లేదు. సినిమాలో లవ్ స్టోరీస్ ని రెండు మూడు రన్ చేసినా ఎక్కడా లవ్ స్టొరీ అనే సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ కలుగ చేయకపోగా లవ్ అంటే సెక్స్ అనే ధోరణిలోనే సినిమాని ముగించడం చాలా వరకూ నచ్చని పాయింట్. అడల్ట్ కామెడీని(ఈ చిత్ర టీం చెప్పిన దాని ప్రకారం అయితే మాటర్ ని చూపించే సినిమాలను) ఎంజాయ్ చేసే కొంతమందికే ఈ సినిమా కాస్త నచ్చుతుంది. ఓవరాల్ గా త్రిష లేదా నయనతార పార్ట్స్ పార్ట్స్ గా నవ్వించినా ఒక పూర్తి సినిమాగా మెప్పించలేకపోయిన కథ.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు