Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఎంతవాడు గాని – ఎమోషనల్ పోలీస్ డ్రామా..!

yentha-vaadu-gaani

విడుదల తేదీ : 22 మే 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : గౌతమ్ మీనన్

నిర్మాత : ఎస్. ఐశ్వర్య

సంగీతం : హరీస్ జైరాజ్

నటీనటులు : అజిత్, త్రిష, అనుష్క, అరుణ్ విజయ్..


తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఎన్నై అరిందాళ్’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో ‘ఎంతవాడు గాని..’ పేరుతో అనువాదం చేశారు. ఓ పోలీసాఫీసర్ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ డ్రామాలను అద్భుతంగా తెరకెక్కించగలడనే పేరున్న గౌతమ్ మీనన్ మ్యాజిక్ ఈ సినిమాలో మళ్ళీ పనిచేసిందా..లేదా.. అన్నది చూద్దాం..

కథ :

పదమూడేళ్ళకే కొందరు దుండగుల చేతిలో తండ్రిని కోల్పోయిన సత్యదేవ (అజిత్), గ్యాంగ్‌ స్టర్స్‌ అందరిపై తన చిన్నతనంలోనే పగ పెంచుకుంటాడు. పోలీసై గ్యాంగ్‌ స్టర్స్ అందరినీ చంపడమో, తానే ఓ గ్యాంగ్‌ స్టర్‌గా మారిపోవడమో ఈ రెండింటిలో ఏదో ఒకటి తన గమ్యం కావాలనుకుంటాడు. గీతకు ఇటువైపుంటే అతడు మంచివాడు, అటువైపు వెళితే చెడ్డవాడు. హీరో ఇటువైపే నిలబడతాడు. నిజాయితీ గల పోలీస్‌గా ఎదిగి గ్యాంగ్‌స్టర్స్ పనిపడుతుంటాడు. ఇదిలా ఉండగానే అతడికి భరతనాట్య కళాకారిణి హేమానిక (త్రిష) పరిచయమవుతుంది. అంతకుముందే ఒకరిచేత మోసపోయిన ఆమె, ఓ బిడ్డకు జన్మనిస్తుంది. సత్య, హేమతో పాటు ఆమె కూతురు నిషా (అనైకా)ను కూడా తన జీవితంగా భావించి హేమను పెళ్ళికి ఒప్పిస్తాడు. అయితే పెళ్ళి జరగడానికంటే ముందే హేమను కొందరు హత్య చేస్తారు.

తాను పోలీస్ అవ్వడం చేత తన కూతురికి కూడా రక్షణ లేదనుకునే సత్య, నిషాను తీసుకొని కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడతాడు. మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత అతడు తన గత ప్రయాణాన్ని మొదలుపెట్టాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సత్య, చంద్రముఖి (అనుష్క)ని ఓ ఆపద నుండి కాపాడాల్సి వస్తుంది. అతి కొద్దికాలంలోనే చంద్రముఖి అతడికి దగ్గరవుతుంది. గతంలో సత్యతో కలిసి తిరిగిన విక్టర్ (అరుణ్ విజయ్) అనే వ్యక్తే చంద్రముఖి ఆపదలో చిక్కుకోడానికి కారణమని తెలుసుకుంటాడు. చంద్రముఖికి వచ్చిన ఆపద ఏంటి? సత్య ఆమెను ఎలా కాపాడాడు? విక్టర్, సత్యలకు మధ్యనున్న సంబంధమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్‌పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్స్ గురించి చెప్పుకుంటే.. ముందుగా స్క్రీన్‌ప్లే గురించి చెప్పుకోవాలి. కథగా చూస్తే అతి సాధారణంగా కనిపించే విషయాన్నే సినిమాగా అద్భుతంగా చూపించడంలో స్క్రీన్‌ప్లే సఫలమైంది. అజిత్, అతడి కూతురి మధ్యన వచ్చే సన్నివేశాలు కట్టిపడేస్తాయి. వారిద్దరి ప్రయాణమే లేకపోతే సెకండాఫ్‌లో భావోద్వేగాలు అంతబాగా పండేవి కాదు. ఇక త్రిష, సత్యల మధ్యన వచ్చే సన్నివేశాలు కూడా అద్భుతమైన భావోద్వేగాన్ని పండిస్తాయి. ఒక నిజాయితీ గల పోలీసాఫీసర్‌ విషయంలో రెండు సమాంతర జీవితాలు ఒకేసారి నడుస్తూ ఉంటాయి. ఆ రెండింటినీ కలిపి ఓ పోలీస్ డ్రామాగా తెరకెక్కించడాన్ని ఈ సినిమాలోనూ చూడొచ్చు. అన్ని కమర్షియల్ హంగులు కలుపుకుంటూ ఓ అర్థవంతమైన సినిమా తెరకెక్కించడం కమర్షియల్ సినిమాల్లో ఎప్పుడూ ఆకట్టుకునే అంశం. ఈ విషయంలో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది.

సత్యదేవగా అజిత్ తన అద్భుతమైన నటనను మరోసారి బయటపెట్టాడు. చాలా షేడ్స్ ఉన్న పాత్రలో ఇట్టే ఒదిగిపోయి సినిమాను నడిపించాడు. ఓ పాపకు తల్లిగా నటించిన త్రిష, ఆ పాత్రలో అద్భుతమైన మెచ్యూరిటీని చూపించింది. అనుష్క చుట్టూనే తిరిగే కథలో అనుష్క బాగానే నటించింది. అందం విషయంలో హీరోయిన్లు ఇద్దరూ సినిమాలో కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ నిండుతనాన్ని తెచ్చారు. విలన్ అరుణ్ విజయ్ హీరో పాత్రకు సరిసమానమైన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. బేబీ అనైక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా క్యూట్‌గా కనిపిస్తూనే బలమైనా భావాలను కళ్ళ ద్వారా పలికించింది.

సినిమా పరంగా చెప్పుకుంటే.. ఫస్టాఫ్‌లో చాలా విషయాలను కప్పిపెట్టి ఆసక్తిని రేకెత్తించగా, సెకండాఫ్‌లో వాటిని ఓ ఎమోషనల్‌ జర్నీలో రివీల్ చేసుకుంటూ వెళ్ళడం ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా సెకండాఫ్‌ను మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే.. రివెంజ్ డ్రామా అనే ఫార్ములా కథ గురించి చెప్పాలి. నిజానికి ఓ బలమైన స్క్రీన్‌ప్లేతో ఈ విషయాన్ని కప్పేసినా, అక్కడక్కడా సినిమా రివెంజ్ కోసమేనా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్‌ కొన్ని డీటైల్స్‌తో, కొంత ఫన్‌తో, కొంత ఎమోషన్‌తో బాగానే నడిచినా, ప్రీ ఇంటర్వెల్‌కు ముందు కొంత డల్ అయిపోయింది. ఇక సెకండాఫ్ అంతా బాగున్నా ప్రీ క్లైమాక్స్‌కి ముందునుంచే సినిమా పూర్తిగా అనుకున్నట్టుగానే జరిగిపోతుంది. అయితే థ్రిల్లింగ్ క్లైమాక్స్‌తో ఈ నెగటివ్‌ను కప్పి పడేశారు.

ఆపదలో చిక్కుకున్న అనుష్కను హీరో కాపాడడం సినిమాకు బాగా కలిసివచ్చినా, అసలైన ఆపదకు సంబంధించిన విషయాల్లో డీటైల్ లేదు. 2 గంటల 40 నిమిషాలకు పైనే ఉన్న ఈ సినిమాను కొంత మేర ట్రిమ్ చేసి ఉంటే మరింత బాగుండేది. పాటలు సందర్భానుసారంగానే వచ్చినా వినేటప్పుడు తమిళ ఫ్లేవర్ ఇబ్బంది పెడుతుంది.

సాంకేతిక విభాగం :

ముందుగా.. దర్శకుడు గౌతమ్ మీనన్ గురించి చెప్పుకోవాలి. కథలో కొత్తదనమేమీ లేకపోయినా, స్క్రీన్‌ప్లేలో మాత్రం అడుగడుగునా తన మార్క్‌ను చూపించాడు. దర్శకుడిగా ఆ స్క్రీన్‌ప్లేను తెరపై ఆవిష్కరించిన విధానం కూడా కట్టిపడేస్తుంది. ఇక ఎమోషన్‌‌ను క్యాప్చర్ చేయడంలో గౌతమ్ మీనన్ ప్రతిభ ఎలాంటిదనేది మరోసారి ఋజువు చేసి చూపాడు.

ఆస్ట్రేలియన్ సినిమాటోగ్రాఫర్ డాన్ మెకర్తర్ పనితనం సినిమాను ఇంకో ఎత్తులో నిలబెట్టింది. థ్రిల్లర్ నెరేషన్, ఎమోషనల్ జర్నీ ఇలా రెండు విభిన్న అంశాలు ఒకేసారి వస్తున్నా కూడా మూడ్ చెడిపోకుండా చేయడంలో సినిమాటోగ్రఫీ పనితనం అద్భుతం. హారీస్ జయరాజ్ అందించిన పాటలన్నీ సందర్భానుసారంగానే వచ్చి ఫర్వాలేదనిపిస్తాయి. ‘నీకేం కావాలో చెప్పు’ పాట బయటకు వచ్చాక కూడా హాయిగా వినిపిస్తుంది. బ్యాక్‌గౌండ్ మ్యూజిక్ విషయంలో హరీస్ జయరాజ్ తన సత్తా చూపించాడు. ఆంటోనీ ఎడిటింగ్ బాగుంది. నిడివి విషయంలో ఎడిటర్‌ను తప్పు పట్టడానికి లేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

తీర్పు :

ఏ భాషలో రూపొందిన సినిమా అయినా, నచ్చితే ‘మన సినిమా’ అని భావించేవారిలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే.. చాలావరకు ఈ సినిమాలో అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వ ప్రతిభ, నెరేషన్ ఈ సినిమాకు ప్రధాన బలం కాగా అజిత్, త్రిష, అనుష్క, బేబీ అనైకల నటన ఈ సినిమాకు మేజర్ హైలైట్స్. పోలీస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లోని థ్రిల్లర్ అంశాలతో పాటు ఓ పోలీసాఫీసర్ వ్యక్తిగత జీవితంలోని ఎమోషన్ ఈ సినిమాకు బాగా కలిసివచ్చే అంశాలు. ఇక అక్కడక్కడా రివెంజ్ డ్రామాగా కనపడే పాతతరం స్టోరీ, రెండున్నర గంటలకు పైనే ఉన్న నిడివి, అక్కడక్కడా కనిపించే తమిళ ఫ్లేవర్ ఈ సినిమాకు ప్రతికూల అంశాలు. ఓవరాల్‌గా చూసుకుంటే.. ఓ థ్రిల్లింగ్ పోలీస్ స్టోరీకి ఎమోషనల్ జర్నీని కలిపి తెరకెక్కిస్తే వచ్చిన ఎమోషనల్ పోలీస్ డ్రామానే ఈ సినిమా. గౌతమ్ మీనన్ అభిమానులకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ను అందించే ఈ సినిమా సాధారణ ప్రేక్షకులకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW


సంబంధిత సమాచారం :