ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: మంచు మనోజ్- ఆ సినిమాలు ఇప్పుడు వస్తే హిట్ అయ్యేవి..!

Published on May 20, 2020 10:30 am IST

 

 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటవారసుడిగా వెండితెరకు పరిచయమై, వైవిధ్య చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో మంచు మనోజ్. మన లాక్ డౌన్ ఇంటర్వ్యూ సిరీస్ లో భాగంగా, ఈ క్రేజీ హీరోని అనేక విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అవేమిటో మీరు చదివేయండి..

 

ఈ లాక్డౌన్ సమయంలో ఏమి చేస్తున్నారు?

లాక్ డౌన్ కారణంగా రైతులు, వలస కూలీల జీవితం దుర్భరంగా మారింది. అందుకే వారికి సహాయం అందించాలని నిశ్చయించుకున్నాను. మా చుట్ట ప్రక్కల ఉన్న అలాంటి వారికి ఆహారం సరఫరా చేస్తున్నాం. అలాగే వారిని స్వస్థలాలకు పంపడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

ఏమైనా స్పెషల్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఉన్నాయా?
ప్రపంచం ఇన్ని ఇబ్బందులలో ఉన్నప్పుడు ఎవరికి మాత్రం పుట్టిన రోజు వేడుకగా చేసుకోవాలనిపిస్తుంది. నా అభిమానులకు కూడా వేడుకలకు పెట్టే ఖర్చు పేదవారికి సహాయం చేయడానికి ఉపయోగించండి అని చెప్పాను.

లాక్ డౌన్ గురించి మీ అభిప్రాయం?
ఒక విధంగా మనిషికి ఇది కనువిప్పు కలిగించింది. డబ్బు, హోదా మనిషిని కాపాడలేవని లాక్ డౌన్ మనకు నేర్పింది. ఇకనైనా ప్రజలు తమ జీవితాలను భిన్నంగా మలుచుకునే అవకాశం ఉంది.

మీ విడాకుల విషయం బహిరంగంగా చెప్పేశారు?
అందులో దాచడనికి ఏమి లేదు. నేను హానెస్ట్ పర్సన్ ని, మనసులో ఏది ఉందో అదే బయటికి మాట్లాడతాను. ఇక విడాకులు అంటారా ఎవరి జీవితంలోనైనా ఏవో కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని మనకు మనమే ఎదిరించి నిలవాలి.

మీ లైఫ్ లో ఫెయిల్యూర్ స్టేజ్ ని ఎలా అధిగమించారు?

సినిమాలకు గ్యాప్ ఇచ్చి, కొన్ని లాంగ్ టూర్స్ కి వెళ్ళాను. ట్రెక్కింగ్ వంటి వ్యాపకాలలో మునిగిపోయాను. నాకు ఇష్టమైన దేవుడు లార్డ్ శివ, ఆయన ధ్యానంతో కొంచెం ఆధ్యాత్మికం వైపు కూడా వెళ్లడం జరిగింది. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా నాకు మద్దతుగా నిలబడ్డారు. ఒకసారి నేను ఆ బాధనుండి బయట పడ్డ వెంటనే మళ్ళీ సెట్స్ లోకి వెళ్లాలని అనిపించింది.

మీ లేటెస్ట్ ప్రాజెక్ట్ అహం బ్రహ్మాస్మి గురించి చెప్పండి?

ఓ అద్భుతమైన సబ్జెక్టు తో భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిస్తున్నాము. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది. పీటర్ హెయిన్స్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఒక్క యాక్షన్ సన్నివేశం కోసం 6 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాము. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రం ఎంత క్వాలిటీతో తెరకెక్కనుందో.

మీవి కొన్ని మంచి సినిమాలు కూడా రాంగ్ టైం లో వచ్చి పరాజయం పొందాయి అనుకుంటా?

నాకు కూడా అదే భావన ఉంది. ప్రయాణం, నేను మీకు తెలుసా, మిస్టర్ నూకయ్య చిత్రాలు మంచి సబ్జెక్టు తో తెరకెక్కినవి. ఐతే అవి అప్పటి ట్రెండ్ కి చెందినవి కావు, అవే కనుక ఇప్పుడు విడుదలై ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో.

ఇక నుండి కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటారు?
ఇకపై ఒక సినిమా తరువాత మరో సినిమా చేద్దాం అని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం అహం బ్రహ్మస్మి మూవీపైనే. ఆ చిత్ర విడుదల తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తా.

ఓ టి టి పై మీ అభిప్రాయం?
ఓ టి టి ఓ మంచి మార్పుగా భావించవచ్చు. ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాతలకు విడుదల కష్టాలు తగ్గుతాయి. పెద్ద చిత్రాలతో పోటీ పడలేక థియేటర్స్ దొరక్క బాధపడేవారికి ఓ టి టి మంచి వేదికగా చెప్పొచ్చు.

పాలిటిక్స్ లోకి ఎప్పుడు వెళతారు?
నాకు అసలు ఆ ఆలోచనే లేదు. ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం సినిమా పైనే ఉంది.

సంబంధిత సమాచారం :

More