ఇంటర్వ్యూ : ప్రభాకర్ – అల్లు అరవింద్ గారు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి సినిమా చేయమన్నారు !
Published on Oct 31, 2017 12:18 pm IST

బుల్లితెరపై నటుడుగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన తొలి సినిమా ‘నెక్స్ట్ నువ్వే’. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) మీ మొదటి సినిమా గురించి చెప్పండి ?
జ) ఇది అల్లు అరవింద్, బన్నీ వాస్, వంశీ ప్రమోద్, జ్ఞానవేల్ రాజా వంటి నలుగురు పెద్దవాళ్ళు కలిసి చేస్తున్న సినిమా. ఇదొక తమిళ సినిమాకి రీమేక్. చిత్రం చాలా బాగా వచ్చింది.

ప్ర) ఈ సినిమా ఎలా వర్కవుట్ అయింది ?
జ) మొదట ఈ కథను శ్రేయాస్ మీడియా నిర్మాణంలో అల్లు శిరీష్ హీరోగా చేద్దామనుకుని ఆయనకు కథ చెప్పా. ఆయనకు కథ నచ్చింది కానీ ఇలాంటి జానర్ సినిమాలు నేను చేయను. కానీ ప్రొడ్యూస్ చేస్తాను అన్నారు. అలాగే అన్నాను. ఆ తర్వాత కథను అరవింద్ గారికి చెబితే సెకండ్ హాఫ్ కొద్దిగా మార్చమని సలహా ఇచ్చారు.

ప్ర) మరి మార్పులేమైనా చేశారా ?
జ) ఆయనే ఒక రైటర్ ని ఇచ్చారు. కానీ నాకు అతనికి ఆలోచనలు కలవక నేనే సొంతగా రాస్తాను అన్నాను. అరవింద్ గారు కూడా పూర్తి స్వేచ్ఛను ఇచ్చి రాయమన్నారు. మళ్ళీ బన్నీ వాస్ గారికి కూడా కథ చెప్పాను. ఆయనకు కూడా నచ్చింది. కానీ ముందు ఒక తమిళ సినిమా చూపించి దాన్ని చేద్దాం అన్నారు.

ప్ర) మరి మీరేమన్నారు ?
జ) మొదటి సినిమానే రీమేక్ ఎందుకని అనుకున్నాను. కానీ సినిమా చూశాక చాలా బాగా అనిపించి మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి కథను తయారు చేశాను.

ప్ర) ఆ తర్వాత సినిమా అంతా సజావుగానే సాగిందా ?
జ) లేదు.. మళ్ళీ రైట్స్ దగ్గర ప్రాబ్లమ్ వచ్చి ఆగిపోయింది. అరవింద్ కొన్నాళ్ళు వెయిట్ చేయమన్నారు. సరే అని ఒకటిన్నర సంవత్సరం ఎదురుచూశాను.

ప్ర) మరి ఆ ఒకటిన్నర సంవత్సరం ఏం చేశారు ?
జ) ఎప్పటికైనా సినిమా స్టార్ట్ అవుతుందనే నమ్మకంతో ఎదురుచూశాను. అలాగే మొదలైంది. ఆ మధ్యలో చాలా మంది చాలా చెప్పారు. కానీ జరిగిందేమిటో నాకు తెలుసు కాబట్టి నమ్మకంతోనే ఉన్నాను.

ప్ర) సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) సినిమాలో కొంత హార్రర్ ఉంటుంది. కానీ ఎక్కువగా థ్రిల్లర్, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. కేవలం 37 రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేశాను. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చుతుంది.

ప్ర) నటీ నటులు గురించి చెప్పండి ?
జ) మొదటగా ఆదినే హీరో అనుకున్నాను. ఆయన కూడా మొదటిసారి చెప్పగానే ఒప్పుకున్నారు. ఇది ఆయనకు లైఫ్ టైమ్ క్యారెక్టర్ అవుతుంది. ఇక బ్రహ్మాజీ, రఘుబాబు, రష్మీలు కూడా మంచి పాత్రలు చేశారు.

ప్ర) ఇకపై టీవీ షోలు మానేసినట్టేనా ?
జ) అదేం లేదు. తప్పకుండా చేస్తాను. ఎవరైనా నేను చేస్తేనే ఆ పాత్ర బాగుంటుంది అని నా దగ్గరకొస్తే నిరుత్సాహపరచను, తప్పక చేస్తాను.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ?
జ) మారుతి ప్రొడక్షన్లో ఒక సినిమా చేస్తున్నాను. అది 75 శాతం షూటింగ్ పూర్తైంది. అది కాకుండా ఇంకో సినిమా కూడా రెడీగా ఉంది. అది జ్ఞానవేల్ రాజా ప్రొడక్షన్లో ఉంటుంది.

 
Like us on Facebook