‘బాహుబలి 2’ టీజర్ వార్త పుకారేనట!

baahubali-2
దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ప్రభంజనమైన ‘బాహుబలి’ గతేడాది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక ప్రాంతీయ సినిమా ఊహకు కూడా అందని రీతిలో బాహుబలి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఆ సినిమాకు రెండో భాగంగా బాహుబలి 2 ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖర్లో రానున్న విషయం తెలిసిందే. గత రెండు రోజుల క్రితమే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తుండగా, తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన రాయిజ్ సినిమాతో బాహుబలి 2 టీజర్ జతచేసి విడుదల చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం నిజం కాదని, ప్రస్తుతానికి టీజర్ కానీ, ట్రైలర్ విడుదలకు కానీ ఏమీ ప్లాన్ చేయలేదని, త్వరలోనే టీజర్ విడుదల విషయమై ఒక అధికారిక ప్రకటన ఇస్తామని టీమ్ స్పష్టం చేసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.