సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ‘బాహుబలి 2’ ట్రైలర్ !


లీకేజ్ సమస్య ఎస్ఎస్ రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి-ది కంక్లూజన్’ ను కూడా వదల్లేదు. వివరాల్లోకి వెళితే ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఈరోజు విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ముందుగా ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ ట్రైలర్ ను థియేటర్లలో ప్రదర్శించి, సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియాలో రిలీజ్ చేయాలని చిత్ర టీమ్ ప్లాన్ చేసింది. ఆ ప్రకారమే సంబంధిత థియేటర్లు ట్రైలర్ ను ప్రదర్శించేందుకు సన్నద్ధమయ్యాయి.

కానీ కొద్దిసేపటి క్రితమే బాహుబలి తమిళ ట్రైలర్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. సుమారు 1 నిముషం 55 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఎలా బయటికొచ్చిందో తెలీడంలేదు. యూనిట్ చెప్పిన ప్రకారం సాయంత్రం 5 గంటలకు రావాల్సిన ట్రైలర్ ఉదయం ఎనిమిదిన్నరకే ఇలా లీక్ అవడం అశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకవేళ టీమ్ కావాలనే దీన్ని రిలీజ్ చేశారా లేకపోతే నిజంగానే ట్రైలర్ లీకేజ్ బారిన పడిందా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రాజమౌళి టీమ్ దీనిపై స్పందించి సత్వర చర్యలు తీసుకుంటే మంచిది.