కమెడియన్ సాహసం చేయబోయేది ఈరోజే !
Published on Nov 23, 2016 8:40 am IST

jayammu-nischayam

మంచి కామెడీ టైమింగ్ తో, నటనతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా చేస్తున్న రెండవ ప్రయత్నమే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రం. ఇంతకు మునుపు ఇతను చేసిన ‘గీతాంజలి’ మంచి ఫలితాన్నివ్వడంతో శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాపై కూడా గట్టి నమ్మకంతో ఉన్నాడు. ‘గీతాంజలి’ చిత్రంలో తనది ఒక ప్రధాన పాత్ర మాత్రమేనాని ఇందులో పూర్తి స్థాయి హీరోగా కనిపిస్తానని చెబుతూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో సరికొత్త విధానాలను పాటిస్తున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే ఎవరూ చేయని సాహసం చేస్తున్నారని చెప్పొచ్చు. అదేమిటంటే సాధారణంగా సినిమా విడుదల రోజు ముందు మీడియాకు, ఇతర సినీ పెద్దలకు, సన్నిహితులకు మాత్రమే స్పెషల్ ప్రీమియర్ షో వేస్తారు. కానీ శ్రీనివాస్ రెడ్డి బృందం మాత్రం ఈ రోజూ రాత్రి 8. 30 లకు అందరితో పాటు పబ్లిక్ కూడా కలిపి షో వేస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉందన్న నమ్మకం, అది జనాలకు కనెక్టై మంచి పాజిటివ్ టాక్ బయటకు వెళితే సినిమా విజయానికి తిరుగుండదనే ఆలోచనతో ఈ సాహసం చేస్తున్నారు. కనుక మనం కూడా శ్రీనివాస్ రెడ్డి సాహసం విజయవంతమవాలని కోరుకుందాం. ఇకపోతే శివ రాజ్ కనుమూరి దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డికి జోడిగా పూర్ణ నటిస్తోంది.

 
Like us on Facebook