దూసుకుపోతోన్న ‘ధృవ’ ఆడియో!

13th, November 2016 - 04:40:11 PM

dhruva-1-million
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమాపై ఏస్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెలరోజుల క్రితమే విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తే, ఈమధ్యే విడుదలైన ఆడియో కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. నవంబర్ 8న ఈవెంట్ ఏదీ లేకుండా నేరుగా మార్కెట్‌లోకి విడుదలైన ఈ సినిమా ఆడియో జ్యూక్‌బాక్స్‌కు ఇప్పటికే 1 మిలియన్ (10 లక్షల) వ్యూస్ వచ్చాయి.

కేవలం ఐదు రోజుల్లోనే ‘ధృవ’ ఈ ఫీట్‌ను అందుకోవడం విశేషమనే చెప్పుకోవాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పోలీస్ థ్రిల్లర్ వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కు రీమేక్ అయిన ఈ సినిమాలో చరణ్ ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.