‘సీతారామం’ పై మాజీ ఉపరాష్ట్రపతి ప్రశంసల జల్లు ..!

Published on Aug 17, 2022 11:00 pm IST

లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో యుద్ధంతో రాసిన ప్రేమకథగా లవ్, యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సీతారామం మూవీ ఆడియన్స్ అందరి మనసులు గెలుచుకుని ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మనదేశంలోని ఇతర ప్రాంతాలు, మరీ ముఖ్యంగా యుఎస్ఏ లో సైతం ఈ మూవీ అదరగొడుతోంది. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించగా విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు.

మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రష్మిక మందన్న ఒక కీలక రోల్ చేసారు. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు అనేకమంది సినిమా ప్రముఖులు, సెలెబ్రిటీలు సైతం సీతారామం పై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సీతారామం పై తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రశంసలు కురిపించారు. “చాలాకాలం తరువాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని “సీతారామం” అందించింది.

రణగొణధ్వనులు లేకుండా, కళ్ళకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు శ్రీ హను రాఘవపూడి, నిర్మాత శ్రీ అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందం అందరికీ ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా చిత్రంలో నటీనటుల అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది” అంటూ తన పోస్ట్ లో తెలిపారు వెంకయ్యనాయుడు.

సంబంధిత సమాచారం :