విడుదల తేదీ : అక్టోబర్ 2, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : ఫాహద్ ఫాజిల్, సారా ఫాలేకర్, సౌరబ్ సచ్ దేవ్, మహేష్ మంజ్రేకర్, సుబ్బరాజు తదితరులు
దర్శకత్వం : శశాంక్ యేలేటి
నిర్మాత : ఎస్ ఎస్ కార్తికేయ, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
సంగీతం : కాళభైరవ
ఛాయాగ్రహణం : బ్రాడ్ ఫ్రాన్సిస్
కూర్పు : ప్రవీణ్ ఆంటోనీ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :-
సూరి (ఫాహద్ ఫాజిల్) ఓ అంబులెన్స్ డ్రైవర్. డబ్బు పిచ్చి ఎక్కువ. మనుషుల పై ఎమోషన్ కంటే డబ్బు పైన ఉన్న ప్రేమే ఎక్కువ. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. అలా అని చెడ్డ వ్యక్తి కాదు. కానీ డబ్బు కోసం ఏమైనా చేసే స్వార్దపరుడు. ఇలాంటి సూరి డబ్బు కోసం చేసిన ఓ చీటింగ్ కారణంగా.. అతని లైఫ్ మొత్తం రిస్క్ లో పడుతుంది. మరోవైపు దివ్య( సారా ఫాలేకర్) అతీంద్రియ శక్తులు కలిగి ఉన్న పాప. అసలు ఆ పాపకి ఆ శక్తులు ఎలా వచ్చాయి. ఇంతకి ఆ పాప ఎవరు ? ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సూరికి దివ్య పరిచయం అవుతుంది. తన అమ్మ, నాన్నని మ్యాజిక్ చేసి మాయం చేశాను అని, వాళ్ళను తిరిగి తీసుకురావాలని సూరిని రిక్వెస్ట్ చేస్తోంది. అప్పటికే ఓ పెద్ద సమస్యలో ఇరుక్కున్న సూరి.. దివ్య ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తాడు. ఇలా కొన్ని ప్లాన్స్ కూడా ఫెయిల్ అయ్యాక, దివ్య గురించి సూరికి నిజం తెలుస్తోంది. అసలు సూరి ఎవరు ?, అతనికి దివ్య చెప్పేది నిజమేనా ?, అసలు సూరి దగ్గరకే దివ్య ఎందుకు వచ్చింది ?, ఆ ఇద్దరి ట్రావెల్ లో ఏం జరిగిందనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఏం తెలియని వయసులో చనిపోయిన ఓ పాప ఆత్మ తన తల్లిదండ్రుల కోసం వెతుకుతూ.. తన పేరెంట్స్ ను కనిపెట్టి, వారి ప్రాణాలను కాపాడే పరిస్థితులు కల్పిస్తే ఎలా ఉంటుంది ? అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఎమోషనల్ హారర్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ అండ్ మెయిన్ కథాంశం బాగున్నాయి. అలాగే ఈ సినిమాలో కోర్ పాయింట్ కూడా బాగుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన సూరి పాత్ర .. ఆ పాత్రకి సంబంధించిన చీటింగ్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి దివ్య పాత్ర.. ఇలా మొత్తానికి ఈ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది.
ఈ సినిమాలో హీరోగా నటించిన ఫాహద్ ఫాజిల్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. తన యాక్షన్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా మెప్పించాడు. పాప పాత్రలో సారా ఫాలేకర్ తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన మహేష్ మంజ్రేకర్ కూడా బాగా నటించారు. సౌరబ్ సచ్ దేవ్ నటన బాగుంది. ఇక సుబ్బరాజుతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
దర్శకుడు శశాంక్ యేలేటి ఓ కొత్త నేపథ్యంలోనే కథని రాసుకున్న విధానం ఆకట్టుకుంది. మెయిన్ గా హారర్ సన్నివేశాలను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే, పతాక సన్నివేశాల్లోని విజువల్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
దెయ్యాలు, ఆత్మల కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. కానీ, ఈ సినిమాలో ఏం తెలియని ఓ పాప ఆత్మ చుట్టూ డ్రామా సాగుతుంది. దీనికి తోడు, ఈ సినిమాలోని హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అయితే, కథనంలో కొన్ని చోట్ల కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే.. సినిమా మొదట్లో కాన్ ఫ్లిక్ట్ ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే, దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ… సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయింది.
దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగుతాయి. మొత్తమ్మీద ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అయ్యింది. అదేవిధంగా కథనం విషయంలో దర్శకుడు ఇంకా బాగా కసరత్తులు చేసి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. అన్నిటికి మించి క్లైమాక్స్ ఇంకా బెటర్ గా ఉండి ఉండాల్సింది.
సినిమాలో చెప్పాలనుకున్న హారర్ ఎలిమెంట్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ కూడా బాగుంది. కథనం ఇంకా ఆసక్తికరమైన ప్లోతో ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. మొత్తానికి శశాంక్ యేలేటి దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. ఇక సంగీత దర్శకుడు కాల భైరవ సమకూర్చిన సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఈ చిత్ర నిర్మాతలు ఎస్ ఎస్ కార్తికేయ, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అంటూ వచ్చిన ఈ హారర అండ్ ఎమోషనల్ డ్రామాలో.. హారర్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు పాత్రల తీరు, అలాగే వాటి ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఫాహద్ ఫాజిల్ నటన కూడా సినిమా స్థాయిని పెంచింది. ఐతే, కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో ఇంట్రెస్ట్ మిస్ అయింది. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం కొన్ని చోట్లే ఆకట్టుకుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


