తలక్రిందులైన తెలుగు సినిమా సెంటిమెంట్ !

Published on Feb 4, 2019 12:15 am IST

తెలుగు సినిమాకి, సంక్రాంతి పండుగకు అదొక ప్రత్యేకమైన అనిర్వచనమైన అనుబంధం ఉంది. ఆ నాటి ‘ఎన్టీఆర్, ఏఎన్నార్’ దగ్గరనుండి.. ఇప్పటి స్టార్ హీరోలు దాకా అందరికీ సంక్రాంతి అంటే సెంటిమెంటే. అందుకు తగ్గట్లుగానే ఈ పండుక సీజన్ లో వచ్చిన సినిమాలు, సహజంగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పండుగ జరుపుకుంటుంటాయి.

కానీ ఈ సంక్రాంతికి పోటీగా వచ్చిన నాలుగు సినిమాల్లో, మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను రాబట్టడంలో పోటీ పడలేక చతికల పడ్డాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘కథానాయకుడు’, మరెన్నో హంగులు.. ఆర్భాటాలతో ఆశ్చర్య పరుస్తాడనుకుంటే, దారుణంగా నిరుత్సాహ పరిచాడు. మిగిలిన సినిమాల కంటే ముందుగానే పోటీలో దిగిన ‘కథానాయకుడు’, చివరికి వచ్చేసరికి పోటీలో చివరన మిగిలిపోవడం ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగానే బాధించింది.

మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 40 శాతం రికవరీ చేసి నష్టాలను మిగిల్చింది. అయితే ‘మహానాయకుడు’ ఆ నష్టాలను లాభాలుగా మార్చి.. తమను ఒడ్డున పడేస్తాడని డిస్టిబ్యూటర్స్ మరియు బయ్యర్స్ ఇప్పటికి నమ్మకంగా ఉన్నారు. మరి వారి నమ్మకాన్ని ‘మహానాయకుడు’ ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.

అలాగే మరో భారీ సినిమా విషయానికి వస్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన మాస్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాలు మధ్య విడుదలై, మొదటి షో నుండే బాడ్ టాక్ ను తెచ్చుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి సంక్రాంతి అండ దొరకడంతో, డిసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది. దాదాపు 60 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టినప్పటికీ.. 30% వరకు బయ్యర్స్ కి, డిస్టిబ్యూటర్స్ కి నష్టాలను మిగిల్చింది. మొత్తానికి ఈ సంక్రాంతి పోటీలో ‘వినయ విధేయ రామ’ ముందు వరుసలో నిలుస్తాడు అనుకుంటే.. వినయ విధేయలతో వెనుకే నిలబడిపోయాడు ఈ రాముడు.

ఇక సడెన్ గా సంక్రాంతి పోటీలోకి వచ్చిన సూపర్ స్టార్ డబ్బింగ్ సినిమా ‘పేట’ సంగతి మాట్లాడుకుంటే.. తమిళంలో కలెక్షన్స్ మోత మోగించిన సూపర్ స్టార్, తెలుగులో మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టలేక.. సంక్రాంతి పోటీలో పోటీపడలేక చివరికి డీలా పడిపోయాడు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష లాంటి భారీ తారాగణం నటించినా.. రెవిన్యూ పరంగా మాత్రం 50 శాతం నష్టాలను మిగిల్చింది. ఓవరాల్ గా రజనీకాంత్ కి తెలుగులో మరో ప్లాప్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

సంక్రాంతి పోటీలో లేకపోయినా.. జనవరి ఎండింగ్ లో బాక్సాఫీస్ వద్ద మిగిలిన సినిమాలకు పోటీ ఇవ్వడానికి వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ కూడా, ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయాడు. 20 కోట్లు బిజినెస్ చేసిన మజ్ను.. కేవలం పది కోట్లు మాత్రమే రాబట్టి.. మొత్తానికి 50 శాతం నష్టాలను మిగిల్చాడు.

చివరగా ఈ సంక్రాంతికి పోటీలో విన్నర్ గా నిలిచి.. అలాగే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను రాబట్టడంలో ముందు వరుసలో నిలుస్తూ దూసుకుపోతున్న చిత్రం ‘ఎఫ్2’. సినిమాలో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉండటం, దానికి తోడు వెంకీ తన కామెడీ విశ్వ రూపం చూపించడంతో ఇప్పటికీ మూడో వారంలో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి షేర్ ను రాబడుతూనే ఉంది. ఏది ఏమైనా తమ సినిమా సంక్రాంతికి జనవరిలో వస్తే, హిట్ అవ్వడం గ్యారంటీ అని నమ్మే హీరోలకూ, నిర్మాతలకూ ఈ సంక్రాంతి బాగానే ఝలక్ ఇచ్చింది. అలాగే తెలుగు సినిమా సెంటిమెంట్ ని కూడా, ఈ సంక్రాంతి తలక్రిందులు చేసింది.

సంబంధిత సమాచారం :