అక్టోబర్ మీదే ఆశలు పెట్టుకున్న హీరోలు !
Published on Oct 2, 2017 2:22 pm IST


ఈ అక్రోబర్ మొదటి వారంలో సినిమాలేవీ లేకపోయినా రెండవ వారం నుండి వరుస సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో నాగార్జున ‘రాజుగారి గది-2’, మాస్ మహారాజ రవి తేజ ‘రాజా ది గ్రేట్’, గోపీచంద్ ‘ఆక్సిజన్’, యంగ్ హీరో రామ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి సినిమాలున్నాయి. ఈ హీరోలందరికీ తక్షణ హిట్ కావాల్సిన పరిస్థితి. నాగార్జున గత చిత్రం ‘నమో వెంకటేశాయ’ పెద్దగా అలరించకపోవడంతో అక్టోబర్ 13న రిలీజ్ కానున్న హర్రర్ థ్రిల్లర్ ‘రాజుగారి గది-2’ పై హోప్స్ పెట్టుకున్నారాయన.

అలాగే ‘బెంగాల్ టైగర్’ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చిన రవి తేజ కూడా ఈ నెల 12న రానున్న ‘రాజా ది గ్రేట్’ తో మరోసారి ఫామ్ లోకి రావాలని ఆశపడుతున్నాడు. ఇక వరుసగా మూడు సినిమాల నుండి నిరుత్సాపడుతూ వస్తున్న మ్యాచో మ్యాన్ గోపీచంద్ కూడా వాయిదాలుపడుతూ వస్తూ ఈ నెలాఖరు 27న రిలీజ్ కానున్న ‘ఆక్సిజన్’ అయినా తన కెరీర్ కు కొత్త శ్వాసను ఇస్తుందని ఆశిస్తున్నారు. మరోవైపు చివరగా చేసిన ‘హైపర్’ తో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన యంగ్ హీరో రామ్ 27న రానున్న ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ తో అయినా హిట్ ట్రాక్ ఎక్కాలని కసిగా ఉన్నాడు.

మరి ఇంతమంది హీరోలు ఆశలు పెట్టుకున్న ఈ అక్టోబర్ నెల ఎవరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

 
Like us on Facebook