‘బాహుబలి’ కోసం ఏడేళ్ళైనా కేటాయించేవాడిని – ప్రభాస్
Published on May 24, 2017 1:00 pm IST


ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి-2’ చిత్రం తెలుగు పరిశ్రమ ఖ్యాతిని దేశవ్యాప్తం చేయడం మాత్రమే కాక అందులోని నటీనటులకు కూడా గొప్ప కీర్తిని తీసుకొచ్చింది. ముఖ్యంగా హీరో ప్రభాస్ ను నేషనల్ స్టార్ ని చేసింది. కేవలం దర్శకుడ్ని నమ్మి సినిమా కోసం ఐదేళ్ల నటనా జీవితాన్ని ఖర్చు చేసిన ప్రభాస్ అంకితభావం పట్ల ముగ్దులైన ఎంతో మంది నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి ఉవ్విళూరుతుంటే ప్రభాస్ మాత్రం బాహుబలి కోసం ఐదేళ్లేమిటి అవసరమైతే ఏడేళ్లైనా కేటాయించేవాడినని చెప్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ‘బాహుబలి లాంటి గొప్ప సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టం. సినిమా ఇంత పెద్ద విజయం సాదిస్తుందని అస్సలు ఊహించలేదు. ఇలాంటి సినిమాల్లో అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. స్క్రీన్ మీద బాహుబలిని వాస్తవంగా చూపించడానికి చాలా కష్టపడ్డాను. టీమ్ మొత్తం ఎలాంటి తప్పులు చేయకుండా పనిచేయబట్టే సినిమా ఈ స్థాయిలో ఉంది. బాహుబలి మూవీ మేకర్స్ అందరిలోనూ ధైర్యాన్ని, ఆశల్ని రేకెత్తించింది’ అన్నారు. ఇకపోతే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1577 కోట్లుకు పైగానే కలెక్ట్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.

 
Like us on Facebook