‘కబాలి’ సన్నివేశాలు లీక్?

kabali
సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులు గత కొన్ని నెలలుగా ఎంతో ఆసక్తి ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో వాలిపోనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్నిచోట్లా ఈ సినిమా మొదటివారాంతానికి సంబంధించిన టికెట్స్ అమ్ముడైపోగా, అభిమానులంతా ఎప్పుడెప్పుడు రజనీని చూస్తామా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు లీక్ అవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది.

రజనీ ఇంట్రోతో పాటు కొన్ని ఇతర సన్నివేశాలు లీకై, వాట్సాప్ లాంటి మాధ్యమాల్లో బాగా షేర్ అవుతున్నాయి. ఇక ఈ సన్నివేశాలు ఎక్కడి నుంచి లీక్ అయ్యాయో ఇంకా తెలియలేదు. రజనీ అభిమానులు, సినీ పరిశ్రమ మాత్రం ఈ వీడియోలను బహిష్కరించి అభిమానులంతా సినిమాను థియేటర్లలోనే చూడాలని కోరుతున్నారు. ఏదేమైనా ఒక క్రేజీ సినిమా ఇలా విడుదల కాకముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవ్వడం బాధాకరమనే చెప్పాలి. దర్శక, నిర్మాతలతో పాటు ఎంతోమంది కష్టానికి ఫలితమైన సినిమాను పైరసీలో చూడకుండా, థియేటర్లలోనే ప్రేక్షకులందరూ ఆస్వాధించాలని కోరుకుందాం.