ఓటీటీ సమీక్ష : లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ – ఈటీవి విన్‌లో తెలుగు సిరీస్

ఓటీటీ సమీక్ష : లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ – ఈటీవి విన్‌లో తెలుగు సిరీస్

Published on Oct 9, 2026 7:34 PM IST

ఓటీటీ వేదిక : ఈటీవి విన్‌
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : అక్టోబర్ 09, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : హర్ష చెముడు, హైపర్ ఆది, జీవన్ కుమార, ఐశ్వర్య హొళక్కల్, రూపా శ్రవ్య, శ్రీవిద్య జ్ఞానకుమార్ తదితరులు
దర్శకత్వం : బాబు డేగల
నిర్మాతలు : చవాన్, శ్రీధర్ చేని, దీపక్ ముస్త్యాల
సంగీతం : అజయ్ అరసాడ
ఛాయాగ్రహణం : శక్తి అరవింద్
కూర్పు : లిఖిత్ లీ

సంబంధిత లింక్స్ : ట్రైలర్

టాలీవుడ్ కమెడియన్ హర్ష చెముడు హీరోగా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. మొత్తం 6 ఎపిసోడ్లుగా తెరకెక్కిన ఈ కామెడీ సిరీస్ ప్రస్తుతం ఈటీవీ విన్ మరియు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించిందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

కథ:

తేజ (హర్ష చెముడు) అమాయకుడైన ఒక పల్లెటూరి యువకుడు. పెళ్లి చేసుకోవాలని తండ్రి నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో, ఉద్యోగం మరియు సరైన జీవిత భాగస్వామి కోసం హైదరాబాద్ నగరానికి వస్తాడు. ఈ క్రమంలో ఒక కార్పొరేట్ ఆఫీస్‌లో చేరిన తేజకు, స్వతంత్ర భావాలు ఉండి యూఎస్ వెళ్లాలని కలలు కనే మధు (ఐశ్వర్య హొళక్కల్) టీమ్ లీడ్‌గా పరిచయమవుతుంది. కొన్ని ఊహించని పరిణామాల వల్ల వీరిద్దరూ ఒకే ఇంట్లో ‘లివ్-ఇన్’ రిలేషన్‌షిప్‌లో ఉండాల్సి వస్తుంది. అసలు వేర్వేరు మనస్తత్వాలు ఉన్న వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? చివరికి వీరు ఒక్కటయ్యారా లేదా? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

హీరోగా హర్ష చెముడు ఈ సిరీస్‌ను తన భుజాలపై నడిపించాడు. అతిగా డైలాగులు చెప్పకుండా తన టైమింగ్, హావభావాలతోనే మంచి కామెడీ పండించాడు. చివరి ఎపిసోడ్లలో వచ్చే ఎమోషనల్ సీన్లలోనూ మెప్పించాడు.

శ్రీవిద్య జ్ఞానకుమార్ స్క్రీన్ మీదికి వచ్చిన ప్రతిసారీ సీన్లు చాలా సందడిగా మారాయి. ఆమె కామెడీ టైమింగ్, జీవన్ రెడ్డి మరియు హైపర్ ఆదిలతో వచ్చే సీన్లు సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

హైపర్ ఆది తన మార్క్ పంచ్ డైలాగులతో బాగా నవ్వించాడు. జీవన్ రెడ్డి కార్పొరేట్ బాస్‌గా ఐటీ ఉద్యోగులకు బాగా కనెక్ట్ అయ్యేలా నటించాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య హొళక్కల్ సహజ నటనతో అలరించింది.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ మెయిన్ పాయింట్ చాలా పాతదే. మొదటి కొన్ని ఎపిసోడ్లు కామెడీతో వేగంగా సాగినప్పటికీ, కథ ముందుకు సాగే కొద్దీ కంటెంట్ తగ్గడంతో కాస్త బోర్ కొడుతుంది.

చివరి ఎపిసోడ్లలో కొన్ని సన్నివేశాలను రన్‌టైమ్ కోసం కావాలని సాగదీసినట్లు అనిపిస్తుంది. ముగింపు చాలా ప్రెడిక్టబుల్‌గా ఉండడం మైనస్. ఇది ప్రేక్షకులను మెప్పించదు.

కార్పొరేట్ ఆఫీస్ బ్యాక్‌డ్రాప్‌ను ఇంకాస్త బెటర్‌గా వాడుకుని ఉంటే ఆఫీస్ గాసిప్స్, సహోద్యోగుల మధ్య వచ్చే సహజమైన హాస్యం మరింత బాగా పండేది.

సాంకేతిక విభాగం:

జబర్దస్త్ ఫేమ్ బాబు డేగల కామెడీ సీన్లను బాగా హ్యాండిల్ చేశారు. అయితే స్క్రీన్‌ప్లేపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్ మూడ్‌కు తగినట్లుగా ఉంది. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ క్లీన్‌గా, రిచ్‌గా కనిపిస్తుంది. చివరి ఎపిసోడ్లలో లిఖిత్ లీ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

మొత్తంగా చూస్తే, ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఈ వీకెండ్‌లో సరదాగా టైమ్ పాస్ చేయగల ఒక క్లీన్ కామెడీ సిరీస్. కథ పాతదే అయినప్పటికీ, హర్ష చెముడు, ఐశ్వర్యల నటనతో పాటు శ్రీవిద్య, హైపర్ ఆదిల కామెడీ ట్రాక్‌లు ఈ సిరీస్‌ను నిలబెట్టాయి. ఆఖరి ఎపిసోడ్లలో కాస్త స్లోగా సాగినా, ఎటువంటి అశ్లీలత లేని టైమ్‌పాస్ కామెడీని కోరుకునేవారు ఈ సిరీస్‌ను ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

తాజా వార్తలు