ఇంటర్వ్యూ : సంగీత ద‌ర్శ‌కుడు సునిల్ క‌శ్య‌ప్‌ – నేను కూడా రొమాంటిక్ గా మారి కంపోజ్ చేశాను !

ఇంటర్వ్యూ : సంగీత ద‌ర్శ‌కుడు సునిల్ క‌శ్య‌ప్‌ – నేను కూడా రొమాంటిక్ గా మారి కంపోజ్ చేశాను !

Published on Oct 25, 2021 4:00 PM IST

అనిల్ పాదురి దర్శకత్వంలో యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ మీడియాతో ముచ్చటించారు. మరి ఈ సినిమా పై సునీల్ కశ్యప్ చెప్పిన విషయాలు మీ కోసం..

 

రొమాంటిక్ చిత్రానికి ఎలా పని చేసారు ? సినిమాలో పాటల గురించి చెప్పండి ?

ఈ సినిమాలో సరదాగా చేసిన పాటలు చాలా ఉన్నాయి. మా ఇస్మార్ట్ గ్యాంగ్ అంతా అలా కూర్చుని సరదాగా చేసిన పాటే పీనే కే బాద్. పూరిగారికి కూడా పాట‌లు చాలా నచ్చాయి. అనిల్ అయితే పర్టిక్యులర్‌గా ఆ పాటలే కావాలని అనేవాడు. కథ విన్నప్పటి నుంచి రొమాంటిక్ టైటిల్ అని పెట్టినప్పటి నుంచి నేను కూడా రొమాంటిక్ అయిపోయి ఈ పాటలను కంపోజ్ చేశాను.

 

హీరోయిన్ కేతిక శర్మ చేత పాట పాడించారు కదా ?

అవును, ఈ చిత్రంలో కేతిక శర్మ కూడా ఓ పాట పాడింది. ‘నా వల్ల కాదే’ అనే పాట, అది పెద్ద హిట్ అయింది. ఆమె నటిగానే కాకుండా సింగర్‌ గా కూడా చాలా బాగా పాడింది. ఆమె చేత పాడించాలని ముందే ఫిక్స్ అయ్యాం.

 

మరి ఆకాష్ వాయిస్ కూడా బాగుంది అంటున్నారుగా ?

ఈ మధ్య విడుదల చేసిన వాస్కోడిగామ పాటలో ఆకాష్ వాయిస్ అద్బుతంగా ఉంటుంది. పూరి గారి కన్నా ఆకాష్ వాయిస్ బాగా వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆకాష్ మాట్లాడిన తీరు చూశాక ఆయనలోని కసి కనబడింది. కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. అతనిలో మంచి ఈజ్ ఉంది.

 

మీరు సినిమా చూసి ఉంటారుగా ? ఆకాష్ నటన ఎలా ఉంది ?

నటన పరంగా ఆకాష్ ని మరో మెట్టు ఎక్కించే చిత్ర‌మిది. ఆర్ఆర్ చేసేటప్పుడు ఆ విష‌యం నాకు అర్థమైంది. హీరోలు ఎంత బాగా చేస్తే నేను అంత బాగా ఆర్ఆర్ ఇవ్వగలను. దర్శకుడిగా అనిల్ అద్భుతంగా తెర‌కెక్కించాడు. అందరం కూడా చాలా ఇష్టపడి ఈ సినిమాను చేశాం.

 

ఈ సినిమాలో మంచి ఎమోషన్ ఉందని టాక్ నడుస్తోంది ?

అవును నిజమే. ఈ చిత్రంలో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది. ద్వితీయార్థం ఫుల్ ఎమోషనల్‌గా ఉంటుంది. పూరి గారు మామూలుగా ఎప్పుడూ ఎమోషనల్ అవ్వరు.. అలాంటిది ఆయ‌న కంట్లోంచి కూడా నీళ్లు వ‌చ్చాయి. అది చూశాక నా పని మీద నాక్కూడా నమ్మకం వచ్చింది. ఎమోషనల్‌గా టచ్ అయిందని అనుకున్నాను. రేపు ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను.

 

పూరి, ఛార్మీలతో పనిచేయడం ఎలా అనిపించింది ?

మేం అంతా ఒక చోట కలిశామంటే ఎంతో సరదాగా ఉంటుంది. పూరి గారు, ఛార్మీ గారు మేం అంతా ఉంటే నేను గిటార్ పట్టుకుని వాయిస్తుంటాను. అందరం సరదాగా ఎంజాయ్ చేస్తాం. అంతే కానీ ఇప్పుడు క‌చ్చితంగా ఈ పని చేయాలి.. అని అనేవారు లేరు…అనిపిస్తే చేయాలి లేకుంటే లేదు అంతే. కరోనా దయ వల్ల కావాల్సినంత టైం కూడా దొరికింది. అందుకే కష్టం కన్నా ఇష్టం ఎక్కువగా పెరిగింది. సెకండాఫ్ ఆర్ఆర్ ముంబైలో జరిగింది. పూరి గారితో ఉంటే సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా పెరుగుతుంది.

 

మీరు పని చేసే సినిమాలకు ఎక్కువగా భాస్కరభట్ల గారే రాస్తారు కదా ?

అవును, నా జర్నీలో ఎక్కువగా భాస్కరభట్ల గారే ఉంటారు. ఇక ఈ చిత్రంలో పీనే కే బాద్ అనే పాటను అద్భుతంగా రాశారు. ఆయన ఒక్కొక్క పదాన్ని రాస్తుంటే మేం అలా ఆశ్చర్యపోయేవాళ్లం. నా వల్ల కాదే అనే పాటను కూడా అద్భుతంగా రాసేశారు. ఆయనతో నాకు ఇది నాలుగో చిత్రం. జ్యోతి లక్ష్మీ నుంచి రొమాంటిక్ వరకు నాకు బలంగా మారిపోయారు.

 

సినిమా సంగీతం కాకుండా.. మీ . భవిష్యత్తు ప్లాన్స్ ఏమిటి ?

సినిమాలే కాకుండా క్లాసికల్ సంగీతం వైపు వెళ్లాలని అనుకుంటున్నాను. భవిష్యత్తులో నా నుంచి క్లాసికల్ వేరియేషన్స్, క్లాసికల్ ఫ్యూజన్స్ రావ‌చ్చు. ప్రతీ సినిమాలో అలాంటివి చేయలేం. కానీ ప్రైవేట్ ఆల్బమ్‌లో అయితే మన ఇష్టమున్నట్టు చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు