ఇంటర్వ్యూ : ఓంకార్ – నాగార్జునగారు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు !
Published on Oct 9, 2017 3:53 pm IST

‘జీనియస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ‘రాజుగారి గది’ తో మంచి విజయాన్ని అందుకున్న ఓంకార్ ప్రస్తుతం నాగార్జున ప్రధాన పాత్రలో ‘రాజుగారి గది-2’ అనే సినిమా చేశారు. ఈ నెల 13న ఈ చిత్ర రిలీజ్ సందర్బంగా ఆయన మీడియాతో చిత్ర విషయాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) ‘రాజుగారి గది-2’ ప్రాజెక్ట్ ఎలా వర్కవుట్ అయింది ?

జ) ‘రాజుగారి గది’ సక్సెస్ తర్వాత రాజుగారి గది-2, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ రెండింటినీ తయారుచేసుకున్నాను. అందులో రాజుగారి గది-2 ని వెంకటేష్ గారికి చెప్పడం జరిగింది. కానీ ఆయనకు ‘గురు’ సినిమా ఉండటం వలన కుదరలేదు. ఆ తర్వాత పివిపిగారు పరిచయమయ్యారు. ఆయనే రాజుగారి గదికి ప్రాంచైజీ చేస్తే బాగుంటుందని అన్నారు. దాంతో వెంకీగారికి చెప్పిన కథ కాకుండా మలయాళం ‘ప్రేతం’ నుండి సోల్ పాయింట్ ను తీసుకుని కొత్త కథ రాసుకున్నాను. అదే ఈ ‘రాజుగారి గది-2’.

ప్ర) ఇందులో నాగార్జునగారిని, సమంతను తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది ?

జ) ఫైనల్ గా కథ మొత్తం రెడీ చేసుకున్నాక దాన్ని విన్న మ్యాట్నీ సంస్థ నిరంజన్ రెడ్డిగారు దీనికి నాగార్జునగారైతే బాగుంటుందని సలహా ఇచ్చారు. దాంతో కథను ఆయనకు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు. ఇక ఆత్మ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుండగా ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది కాబట్టి సమంత అయితే బాగుటుందని మళ్ళీ నిరంజన్ రెడ్డిగారే చెప్పారు. సమంతగారు కూడా కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు.

ప్ర) సమంతను తీసుకుంటున్నట్టు నాగరాజునాగరికి ముందే తెలుసా ?

జ) సమంతగారిని కలుస్తున్నట్టు నాగార్జునగారికి చెప్పలేదు. కానీ ప్రాజెక్టులో నాగార్జునగారు ఉన్నారని సమంతగారికి తెలుసు. ఆయన ఒప్పుకున్న 20 రోజులకు సమంతగారు ప్రాజెక్టులోకి వచ్చారు.

ప్ర) మలయాళం ‘ప్రేతం’ కు దీనికి ఎలాంటి మార్పులు చేశారు ?

జ) ఎలాంటి మార్పులు అనేది ముందుగా చెప్పకూడదు. కానీ ఆ సినిమా చూసిన వాళ్లకు తేడా స్పష్టంగా తెలుస్తుంది. కేవలం సెంటర్ పాయింట్ మాత్రమే ఒకలా ఉంటుంది. మిగతా మొత్తం డిఫరెంట్ గా, కొత్తగా ఉంటుంది.

ప్ర) నాగార్జునలాంటి పెద్ద హీరోని డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది ?

జ) నాగార్జునగారికి ముందుగా కథ నచ్చితేనే సినిమా చేస్తారు. అంతేగాని నాకు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలని అడగరు. ఈ హర్రర్ సినిమాలో ఫైట్స్, సాంగ్స్ లాంటివి కూడా ఉండవు. కథ వినే ఆయన ఒప్పుకున్నారు. ఒక్కసారి కథ ఓకే అయ్యాక ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలేదు. షూటింగ్లో కూడా నువ్వే నా బాస్, నువ్వేం చెప్తే అదే చేస్తాను అన్నారు. చివరి వరకు అదే మాట మీద ఉండి నేను ఎలా కావాలంటే అలా చేశారు.

ప్ర) విజువల్ ఎఫెక్ట్స్ కోసం ముంబై వరకు ఎందుకు వెళ్లారు ?

జ) ముంబైకి వెళ్లడమే బాగా ప్లస్ అయింది. అంటే ఇక్కడ మంచి కంపెనీస్ లేవని కాదు. ఒకవేళ ఇక్కడ వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చినా వాళ్ళు వేరే దగ్గరికి పంపిస్తారు. అదేదో నేరుగా అసలు వాళ్ళ దగ్గరికే వెళితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో అక్కడకు వెళ్లడం జరిగింది. అంతేగాక సూర్యగారి ’24’ మూవీకి వాళ్ళు చేసిన వాటర్ ఎఫెక్ట్ నాకు బాగా నచ్చాయి. ఇందులో కూడా అలాంటి ఎఫెక్ట్సే ఉంటాయి. అందుకే వాళ్ళను చూజ్ చేసుకున్నాను. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా కొన్ని సీక్వెన్స్ చేశారు.

ప్ర) ఔట్ ఫుట్ పట్ల నాగార్జునగారి ఫీలింగ్ ?
జ) సినిమా పట్ల నాగార్జునగారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎడిటింగ్ కూడా చూశారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆయనకు బాగా నచ్చాయి.

ప్ర) సినిమాలో నాగార్జునగారి పాత్ర ఎంతవరకు ఉంటుంది ?
జ) సినిమా మొత్తం ఆయనదే. ఇక డ్యూరేషన్ అంటే ఫస్టాఫ్ సగం నుండి ఎంటరై చివరికి వరకు ఉంటారు. సినిమా మొత్తానికి ఆయనే హైలెట్ పాయింట్.

ప్ర) ఆయన పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఈ సినిమాలో ఆయనో మెంటలిస్ట్. మెంటలిజం అనేది సైన్స్. సైన్స్ ఏ సెంటర్స్ వరకు అయితే ఓకే, అందుకే బి, సి సెంటర్ల కోసం ఆయన పాత్రను ఇంకాస్త ఎలివేట్ చేశాం. సినిమాలో ఆయనో మోడరన్ సెయింట్.

ప్ర) మీకు నాగార్జునకి అభిప్రాయ బేధాలు వచ్చాయని విన్నాం ?
జ) అలాంటివేం లేవు. ఒక సినిమా అంటే అంత ఈజీ కాదు. ఔట్ ఫుట్ రాకపోతే అభిప్రాయం బేధాలు ఉన్నట్టు. కానీ ఇక్కడ మంచి సినిమా వచ్చింది.

ప్ర) రాజుగారి గది, రాజుగారి గది-2 రెండింటిలో ఏది బాగా వచ్చింది ?
జ) రాజుగారి గది-2 బాగా వచ్చింది. మొదటి పార్ట్ అనేది నేను చెప్పాలనుకున్న సబ్జెక్టుని చెప్పడానికి తీసింది. అది చిన్నది. కానీ పెద్ద హిట్. ఈ రెండవ పార్ట్ పెద్దది. చాలా మంది మళ్ళీ హర్రర్ సినిమా చేయొద్దు అన్నారు. కానీ నేను చేశాను. ఎందుకంటే హర్రర్ సినిమాతో కూడా ఒక ఫ్యామిలీ సబ్జెక్టుని చెప్పడం కోసం. ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా అయిపోతుంది. సెకండాఫ్ అంతా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి.

ప్ర) మీ అన్ని సినిమాల్లోలానే ఇందులో కూడా ఏధైనా సోషల్ మెసేజ్ ఉంటుందా ?

జ) తప్పకుండా ఉంటుంది. మెసేజ్ ను ప్రేక్షకుల మీద రుద్దకుండా వాళ్లకు తెలీకుండానే చెప్పేస్తాం. ఆడవాళ్ల గురించి గొప్పగా చెప్పాం. సమంత చెప్పే మాటలు థియేటర్లోని ఆడవాళ్లందరికీ కనెక్ట్ అవుతాయి.

 
Like us on Facebook