ఎన్టీఆర్-27 రెండవ షెడ్యూల్ మొదలయ్యేది ఎప్పుడంటే !


ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో చేస్తున్న నూతన చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ 20 ఫిబ్రవరి నుండి మొదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా కోసం లుక్ ను కాస్త మార్చుకునే పనిలో బిజీగా ఉండటం వలన ఈ మొదటి షెడ్యూల్ షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. దాంతో దర్శకుడు బాబి ఆలస్యం లేకుండా మిగిలిన నటీనటులపై మొదటి షెడ్యూల్ కానిచ్చేశారు. తాజాగా సినిమా సన్నిహిత వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం రేపటి నుండి రెండవ షెడ్యూల్ మొదలవుతుందని, ఎన్టీఆర్ 9వ తేదీ నుండి షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది.

ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం కళ్యాణ్ రామ్ సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్, హాలీవుడ్ లో పేరు మోసిన కృత్రిమ అవయవాల సృష్టికర్త, మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్ వంటి ప్రముఖ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నా చిత్ర టీమ్ నుండి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో ప్రస్తుతానికి రాశి ఖన్నాను ఒక హీరోయిన్ పాత్రకి ఎంపిక చేశారు.