50 రోజుల చిన్న సినిమా సంచలనం..!

Pellichoopulu
‘పెళ్ళిచూపులు’ అనే సినిమా గత నెల్లో తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం కోటిన్నర లోపే బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్లకు పైగా వసూళ్ళు సాధించడం అందరినీ ఆశ్చర్యపరచింది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఒక చిన్న సినిమా ఊహకు కూడా అందని స్థాయిలో వసూళ్ళు రాబట్టడం ‘పెళ్ళిచూపులు’ సినిమా సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.

ఇక విడుదలైన వారం తర్వాతే ఎక్కువ వసూళ్ళు రాబట్టడం మొదలుపెట్టిన ఈ సినిమా నేటితో యాభై రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు తమ సినిమాకు ఇంతటి విజయాన్ని తెచ్చిపెట్టిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవర కొండ, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా నటించారు. హీరో ఫ్రెండ్ కౌశిక్ అనే పాత్రలో నటించిన ప్రియదర్శి పెళ్ళిచూపులు తర్వాత తెలుగు సినిమాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. తెలుగు ప్రేక్షకులకు ఇంత మంచి సినిమాను అందించి, గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న పెళ్ళిచూపులు టీమ్‌కు శుభాకాంక్షలు.