ఆర్జీవీ కొత్త వెబ్ సిరీస్ ‘కడప’ !

14th, December 2017 - 10:04:08 AM

ఎప్పటికప్పుడు వివాదకరమైన విషయాలను చర్చకు తీసుకొస్తూ సంచలనాలు రేపే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ‘కడప రెడ్ల నిజాలు’ పేరుతో ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశారు. ఈ వెబ్ సిరీస్లో రాయలసీమ నిజాల్ని పూర్తిగా బయటపెడతానంటున్నారు వర్మ. గతంలో తాను తీసిన ‘రక్త చరిత్ర’ లో రాయలసీనా గురించి చూపింది 5 శాతం మాత్రమేనని, అప్పటి పరిస్థితుల వలన అలా చేయడం జరిగిందని చెప్పుకొచ్చిన వర్మఇప్పుడు మాత్రం వెనక్కు తగ్గేది లేదని అంటున్నారు.

హింస, రక్తదాహం, ఆధిపత్యం, ఇగో, ఆశ, వెన్నుపోట్లు లాంటి రకరకాల మనిషి నైజాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన ప్రాంతం నుండి ఈ ‘కడప’ టైటిల్ పుట్టిందని, మాజీ ఫ్యాక్షనిస్టులు, వాళ్ళ బంధువులు, బాధితులు, ఇతరుల నుండి తాను రాబట్టిన మెటీరియల్ ద్వారా ఈ వెబ్ సిరీస్ చేస్తున్నానన్న వర్మ ట్రైలర్ ను రేపు ఉదయం 10 గంటలకి రిలీజ్ చేస్తానని ప్రకటించారు. ఎవరేమి అనుకున్నా గన్స్ అండ్ థైస్’ సిరీస్ తర్వాత ఈ సిరీస్ ను తప్పకుండా చేసి తీరుతానని కూడా శపథం చేశారు.