సమీక్ష : సర్కార్ – విజయ్ అభిమానులకు మాత్రమే !

సమీక్ష : సర్కార్ – విజయ్ అభిమానులకు మాత్రమే !

Published on Nov 7, 2018 4:01 AM IST
Sarkar movie review

విడుదల తేదీ : నవంబర్ 06, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : విజయ్, కీర్తి సురేష్, రాధా రావి, వరలక్ష్మి శరత్ కుమార్ తదిత‌రులు

దర్శకత్వం : మురుగదాస్

నిర్మాత : కళానిధి మారన్

సంగీతం : ఏ ఆర్ రహమాన్

స్క్రీన్ ప్లే : మురుగదాస్

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రం ‘సర్కార్’. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించింది. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :
సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచంలోనే నెం.1 కంపెనీకి సి.ఇ.ఓ. తన జీవితంలో తన తండ్రీ మరణం తాలూకు సంఘటన కారణంగా సుందర్ రామస్వామి ఓటుకి ఎంతో విలువ ఇస్తాడు. ఈ నేపధ్యంలో తన స్వంత రాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ష్ జరుగుతాయి. దీంతో సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన ఊరికి వస్తాడు. కానీ అప్పటికే సుందర్ ఓటును ఎవరో దొంగ ఓటుగా వెయ్యటం జరుగుతుంది. దీనిపై సుందర్ కోర్టుకు వెళ్లి.. తన ఓటు సంగతి తేలే వరకు ఎలక్షన్ రిజల్ట్స్ ఆపేలా చేస్తాడు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత కోర్టు జరిగిన ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలను నిర్వహించాలని ఆర్డర్ వేస్తుంది. ఆ తరువత జరిగే పరిణామాలు ఏమిటి ? సుందర్ రామస్వామి, ఓటు హక్కు పై ప్రజల్లో ఎలాంటి చైతన్యం తీసుకు వచ్చాడు ? ఈ క్రమంలో అవతల రాజకీయ పార్టీ లీడర్ కోమలవల్లి (వరలక్ష్మి శరత్ కుమార్) సుందర్ ను అడ్డుకోవడానికి ఏమి చేసింది ? ఎన్ని ఎత్తులు వేసింది ? వాటిని సుందర్ రామస్వామి ఎలా ఎదురుకున్నాడు ? చివరకు సుందర్ రామస్వామి అనుకున్నది సాధించాడా ? లేదా ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

తమిళ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. విజయ్ ప్రపంచంలోనే నెం.1 కంపెనీకి సి.ఇ.ఓ గా చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. తన టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే.. ఇటు యాక్షన్ సన్నివేశాల్లోనూ తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొన్ని ఏమోషనల్ సీన్స్ తో పాటు, పొలిటికల్ డ్రామా సీన్స్ లో కూడా ఆయన చాలా బాగా నటించాడు.

ఇక ఓ ఎమ్.ఎల్.ఏ కూతురి పాత్రలో నటించిన హీరోయిన్ కీర్తి సురేష్ కి పెద్దగా స్క్రీన్ టైం లేకపోయినా.. ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది. సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ యువ రాజకీయ నాయకురాలిగా తన నటనతో కట్టిపడేస్తోంది.

ఇక ఎప్పటిలాగే రాధా రవి తన నటనతో మరియు తన మార్క్ హావభావాలతో ఆకట్టుకోగా… కమెడియన్ యోగి బాబు తాను ఉన్న రెండు మూడు సీన్స్ లో నవ్వించే ప్రయత్నం చేశాడు.
ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

దర్శకుడు మురగదాస్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు. తన మార్క్ డైరెక్షన్ తో కూడా ఆయన ఆకట్టుకున్నారు. మెయిన్ గా రాజకీయ నాయకుల అవినీతి కారణంగా సమాజంలోని అన్నీ రంగాల్లోనూ ప్రజలకు ఎంతగా అన్యాయం జరుగుతుందో అనే అంశాలను ఆయన చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు మురగదాస్ రాజకీయాలకు సంబంధించి, ఓటుకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ.. ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు కథాకథనాలను మాత్రం ఆయన ఆసక్తికరంగా రాసుకోలేదు, కానీ కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు కొన్ని పొలిటికల్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ డైరెక్షన్ తో కూడా ఆయన ఆకట్టుకున్నారు. కాకపోతే సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా సాగడం, చాలా చోట్ల లాజిక్ కూడా లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.

సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువుగా కనిపించకపోయినా.. తెలుగు ఆర్టిస్ట్ లు లేకపోవడంతో తమిళ్ సినిమా చూస్తూనే ఫిలింగే కలుగుతుంది.

వరలక్ష్మి అండ్ విజయ్ మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా లేవు. ప్రీ క్లైమాక్స్ లో తన కూతురు వరలక్ష్మి గురించి, తులసి రివీల్ చేసే నిజం కూడా అస్సలు కన్విన్స్ అవ్వదు. స్వంత కూతురు జీవితాన్నే నాశనం చేసే నిజాన్ని.. బయట పెట్టడానికి గల కారణాలను అస్సలు చూపించకపోవడం అసలు బాగాలేదు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ గా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది.

చివరగా ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు కొన్ని ఉన్నప్పటికీ… దర్శకుడు మాత్రం తను అనుకున్న పొలిటికల్ డ్రామాని ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువు ఆసక్తి చూపించారు తప్ప .. సినిమానిపూర్తీ ఆసక్తి కరంగా మలచలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు మురగదాస్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు. తన మార్క్ డైరెక్షన్ తో అక్కడక్కడ ఆకట్టుకున్నారు. కానీ కథనం మాత్రం ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేకపోయారు. ఏ ఆర్ రహమాన్ అందించిన సంగీతం ఆయన స్థాయికి తగ్గట్లు లేకపోయినా.. కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది.

గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సినిమాలోని లాజిక్ లేని సన్నివేశాలకు క్లారిటీ ఇచ్చే సీన్స్ ని కూడా ఉంచి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

విజయ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రంలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు కొన్ని ఉన్నప్పటికీ… సినిమా మాత్రం పూర్తీ ఆసక్తికరంగా సాగలేదు. దర్శకుడు మురుగదాస్ రాజకీయాలకు సంబంధించి మరియు ఓటుకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ.. ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లుగా కథాకథనాలను మాత్రం ఆయన ఆసక్తికరంగా రాసుకోలేదు, కానీ కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు కొన్ని పొలిటికల్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ డైరెక్షన్ తో ఆకట్టుకున్నారు. కాకపోతే సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా సాగడం, చాలా చోట్ల లాజిక్ కూడా లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఓవరాల్ గా విజయ్ అభిమానులకు ఈ చిత్రం నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

 

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు