సీనియర్ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్‌కు మాతృవియోగం.!

Published on Sep 8, 2021 10:45 am IST


టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్‌ ఎన్నో చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు పలు సినిమాలతో పాటుగా సీరియల్స్, డబ్బింగ్స్ లో బిజీగా ఉన్నారు. మరి వారి ఇంట విషాదం చోటు చేసుకున్నట్టుగా ఇప్పుడు తెలిసింది. వారి మాతృమూర్తి, సినీ నేపధ్యగాయని ఎస్‌పీ శైలజ అత్తమ్మ అయిన ఎస్‌ఎస్‌ కాంతం (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు.

చెన్నై మహాలింగపురంలోని సుధాకర్‌ నివాసంలో తండ్రి సూరావజ్జల కృష్ణారావు, తల్లి ఎస్‌ఎస్‌ కాంతం ఉండేవారు. రెండేళ్ల క్రితం కృష్ణారావు మరణించారు. తల్లి కాంతం సుమారు మూడు నెలల క్రితం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించగా వృద్ధాప్య, అనారోగ్య కారణాలతో మంగళవారం ఉదయం ఆమె మృతి చెందారు.

కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు కాగా సుధాకర్‌ పెద్దవారు. రెండో కుమారుడు మురళీ దత్తుపోయి వైజాగ్‌లో, మూడో కుమారుడు సాగర్‌ అట్లాంటాలో స్థిరపడ్డారు. బుధవారం మధ్యాహ్నం చెన్నైలో ఆమె అంత్యక్రియలు చెయ్యాలని కుటుంబీకులు నిశ్చయించారు. మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :