ఈ స్టార్ కమెడియన్ టైమ్ మొదలైంది..!

10th, October 2016 - 04:34:21 PM

srinivas-reddy
ఇండస్ట్రీలో కమెడియన్‌గా తనకుంటూ ప్రత్యేకమైన స్పేస్ ని సంపాదించుకున్న శ్రీనివాస రెడ్డి, గీతాంజలి తర్వాత మరోసారి హీరో స్థాయి పాత్రతో అలరించేందుకు జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాతో రెడీ అయ్యాడు. ఈ సినిమాలోని ‘ఓ రంగుల చిలక చూడే నియెక’ అంటూ ఒక సిన్సియర్ ప్రేమికుడిగా అడుగులు వేస్తున్నాడు. ఒక పాటతోనే సినిమాపై మంచి ఇంప్రెషన్ కలిగింది. ఈ మధ్య తక్కువుగా కనపడుతున్న దేశవాళి వినోదంతో వస్తున్న ఈ ప్రేమకథలో శ్రీనివాస రెడ్డి సర్వమంగళంగా మారిపోయాడు. పాటతోనే ఇండస్ట్రీ పెద్దలను ఆకట్టుకున్నాడు కొత్త దర్శకుడు శివాజీ. ఇండస్ట్రీ పెద్దలు ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నైజాంలో ఒక టాప్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ముందుకు వస్తున్నాడు.

సినిమా రంగంలో రెండు పడవలపై కాళ్లు వేసి రాణించినవారు అరుదు. ఆ అరుదైన టీమ్ లో జాయిన్ అవుతున్నాడు శ్రీనివాసరెడ్డి. కమెడియన్ గా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి, ఆమధ్య ‘గీతాంజలి’ సినిమాతో హీరోగా మారి తొలి హిట్ అందుకున్నాడు. అయినా ఆ హిట్ తలకెక్కించుకోకుండా మళ్లీ తనదైన శైలిలో కమెడియన్ గా వచ్చిన అవకాశాల్నీ వినియోగించుకున్నాడు. త్రివిక్రమ్ ‘అ..ఆ..’ లో బాగా ఆకట్టుకున్న శ్రీనివాసరెడ్డి కామెడీ, లేటెస్ట్ గా వచ్చిన ప్రేమమ్ సెకండ్ హాఫ్ సక్సెస్ లో మేజర్ షేర్ తీసుకుంది.

ఇక మళ్ళీ జయమ్ము నిశ్చయమ్మురా విషయానికి వస్తే.. ఆ మధ్య విడుదల చేసిన ఈ మూవీ పాటకు ఎంటైర్ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల నుంచీ అద్భుతమైన స్పందన వస్తోంది. అంతబాగా చిత్రీకరించిన ఈ పాటలో ఆసాంతం శ్రీనివాసరెడ్డి నటనే ఆకట్టుకుంది. అది ఎంతలా అంటే ఆ పాటను నేనే రిలీజ్ చేస్తానని స్టార్ డైరెక్టర్ సుకుమారే ముందుకు వచ్చేంతగా! అంతే కాదు.. ఈ సినిమాతో శ్రీనివాసరెడ్డిలో కమెడియన్ ను మించిన నటుడ్ని చూస్తారని ప్రశంసలు కూడా కురిపించాడు సుకుమార్. ఇదిలా ఉంటే హీరోగా విజయాలు వచ్చినా.. కమెడియన్ గా అవకాశాల్ని వదులుకోనని స్థిరంగా చెబుతున్నాడు శ్రీనిసవారెడ్డి. ఇలా రెండు పడవలపై కాళ్లు వేసినా.. ఎన్ని విజయాలు వచ్చినా తన కాళ్లు నేలపైనే ఉంటాయని కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు. జయమ్ము నిశ్చయమ్మురా సినిమా పాటకు వచ్చిన స్పందనతో ప్రశంసల్లో తడుస్తోన్న తరుణంలోనే ఇప్పుడు ప్రేమమ్ లో అతను పంచిన హాస్యానికీ అంతులేని ప్రశంసలు దక్కుతుండటం విశేషం.