ఇంటర్వ్యూ : సూపర్ హీరో తేజ సజ్జ – ‘ది ట్రెయిటర్స్’కు హోస్ట్ చేయడం ఎంజాయ్ చేశా..!

ఇంటర్వ్యూ : సూపర్ హీరో తేజ సజ్జ – ‘ది ట్రెయిటర్స్’కు హోస్ట్ చేయడం ఎంజాయ్ చేశా..!

Published on Oct 7, 2026 10:00 PM IST

ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ప్రైమ్ వీడియో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘ది ట్రెయిటర్స్’ రియాలిటీ షోను తెలుగులో తీర్చిదిద్దింది. యంగ్ హీరో తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో విభిన్న రంగాలకు చెందిన 20 మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. విశ్వాసం, అనుమానాల నేపథ్యంలో సాగే ఈ 10 ఎపిసోడ్ల సిరీస్‌ను SOL ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ నెల 15 నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రైమ్ వీడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం కానుండగా, ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తేజ సజ్జ షో విశేషాలను పంచుకున్నారు.

వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తున్నారు కదా.. ది ట్రెయిటర్స్ కి హోస్ట్ గా మారడం ఎలా అనిపించింది?

‘ది ట్రెయిటర్స్’ ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో, 25కి పైగా భాషల్లో సంచలనం సృష్టించిన అతిపెద్ద హిట్ ఫ్రాంచైజ్. హిందీలో కరణ్ జోహార్ గారు ఈ షో చేసినప్పుడు అనుకోకుండా ఒక ఎపిసోడ్ చూసి, రెండు రోజుల్లోనే మొత్తం సీజన్ పూర్తి చేశాను. అంతగా ఈ కాన్సెప్ట్ నన్ను ఆకట్టుకుంది. ‘మిరాయ్’ సినిమా పూర్తయ్యాక ప్రైమ్ వీడియో వారు నన్ను సంప్రదించినప్పుడు, ఈ స్ట్రాంగ్ ఫార్మాట్‌పై ఉన్న నమ్మకంతో నా కెరీర్‌లోనే అత్యంత వేగంగా ఓకే చెప్పిన ప్రాజెక్ట్‌గా ఇది నిలిచింది. ప్రైమ్ వీడియో లాంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తెలుగులో ఇంత భారీ స్థాయిలో, విభిన్నమైన ఫార్మాట్‌తో రియాలిటీ షో రావడం ఇదే తొలిసారి. ఒక మర్డర్ మిస్టరీ లేదా థ్రిల్లర్ సినిమా చూస్తున్న అనుభూతిని అందించే ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించడం చాలా సరదాగా, తృప్తిగా అనిపించింది.

ఎన్ని రోజులు షూట్ చేశారు? హోస్ట్ క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది?

మొత్తం పది ఎపిసోడ్ల కోసం 11 రోజులు షూటింగ్ చేశాం. హిందీ వెర్షన్ చూసినప్పుడు అందులోని పోటీదారులు నాకు తెలియదు కాబట్టి ఎమోషనల్ కనెక్షన్ లేదు. కానీ ఇక్కడ ప్రగతి గారు, హర్షవర్ధన్ గారు, చిన్మయి గారు వంటి మనకు తెలిసిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులోని హోస్ట్ పాత్ర కూడా ఒక సినిమాలో క్యారెక్టర్ లాంటిదే. క్లాస్ లీడర్ మాదిరిగా ఉండే ఆ విలక్షణమైన పాత్రలోనే నేను కనిపించడం చాలా ఇంట్రెస్టింగ్ అనుభూతిని ఇచ్చింది.

గేమ్ షో ఎలా ఉండబోతుంది?

ఈ షో నుంచి ముందుగా మొదటి మూడు ఎపిసోడ్లు విడుదలవుతాయి. అవి చూస్తే ఈ గేమ్ షో స్వరూపంపై అందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌లా సాగుతుంది. తెలుగులో ఇప్పటివరకు వచ్చిన ఏ రియాలిటీ షోతోనూ దీనికి పోలిక ఉండదు. ఫుట్‌బాల్ లేదా చెస్ లాగా నిర్దిష్టమైన నియమాలతో సాగే ఒక పక్కా రియల్ గేమ్‌లాంటి పూర్తి కొత్త ఫార్మాట్ ఇది.

ఇది కొత్త గేమ్ షో అంటున్నారు కదా? ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతుందా?

ముందుగా విడుదలయ్యే మొదటి మూడు ఎపిసోడ్లు చూస్తే ఈ గేమ్ షో ఎలా ఉండబోతోందో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని అనుమానించాలి, అసలైన ట్రెయిటర్స్ ఎవరు, అమాయకులు ఎవరు అనే సస్పెన్స్ కోణంలో సాగే ఈ గేమ్ ప్రేక్షకులకు ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.

ఇందులో కంటెస్టెంట్స్‌ను ఎలా సెలెక్ట్ చేశారు?

ఈ గేమ్‌కు సరైన పోటీదారులు చాలా ముఖ్యం. ఇతరులను మానిపులేట్ చేయగలగడం, తమ మాటలతో నమ్మించడం మరియు నియమాలకు అనుగుణంగా గేమ్‌ను ముందుకు తీసుకెళ్లడం చాలా అవసరం. అందుకే సెలబ్రిటీ హోదా కంటే కూడా గేమ్ ఆడగల సామర్థ్యానికే ప్రాధాన్యతనిచ్చి, విభిన్న రంగాలకు చెందిన వారిని ఎంపిక చేయడం జరిగింది.

హోస్ట్ చేయడం ఎలా అనిపించింది?

ఈ షో నాకు ఎంతగానో నచ్చడంతో చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడే తత్వం నాది కాబట్టి చాలా ఈజీగా చేసేయొచ్చని భావించాను. అయితే మొదటిరోజే నాలుగైదు పేజీల స్క్రిప్ట్ ఇచ్చి, పార్టిసిపెంట్స్‌కు రూల్స్ అన్నీ వివరించమన్నారు. సాధారణ స్టూడియో రియాలిటీ షోలలో కట్ చెప్పే వెసులుబాటు ఉంటుంది కానీ, ఇందులో కంటెస్టెంట్లు నా ఎదురుగానే ఉండటంతో ఎక్కడా తేడా రాకుండా ఆ పేజీలన్నీ సింగిల్ టేక్‌లోనే చెప్పాల్సి వచ్చింది.

జాంబీ రెడ్డి 2 గురించి?

ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాం. ప్రేక్షకులకు ఒక క్రేజీ అండ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు