‘కొత్త బంగారు లోకం’ కాంబో: ఆహాలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ‘నా వైఫ్ మిస్సింగ్’.. అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్

‘కొత్త బంగారు లోకం’ కాంబో: ఆహాలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ‘నా వైఫ్ మిస్సింగ్’.. అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్

Published on Oct 7, 2026 5:49 PM IST

తెలుగు తెరపై ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంట చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి నటించారు. వీరిద్దరి కలయికలో రూపొందిన తాజా క్రైమ్ మిస్టరీ చిత్రం ‘నా వైఫ్ మిస్సింగ్’ నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఒరిజినల్‌గా వస్తున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

తాజాగా విడుదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సంప్రదాయబద్ధంగా వీరిద్దరి వివాహం జరగడం, ఆ తర్వాత ఒకరితో ఒకరు ఆనందంగా గడిపే సన్నివేశాలతో కథ మొదలవుతుంది. అయితే అనుకోకుండా భార్య కనిపించకుండా పోవడం, భర్త నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి “నా వైఫ్ మిస్సింగ్” అని ఫిర్యాదు చేయడంతో కథలో తీవ్రమైన సస్పెన్స్ మొదలవుతుంది. అమలాపురం పోలీస్ స్టేషన్ నేపథ్యం, గోదావరి పరిసర ప్రాంతాల్లో సాగే ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి.

లైట్‌హౌస్ సినీ క్రియేషన్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి స్వాతి ప్రకాష్, శివ కాంతంనేని నిర్మాతలుగా వ్యవహరించగా, సాయికార్తీక్ సంగీతం అందించారు. ఎస్. సతీష్ కుమార్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. ‘నా వైఫ్ మిస్సింగ్’ చిత్రాన్ని అక్టోబర్ 22 నుంచి తెలుగుతో పాటు తమిళంలోనూ ఆహా వేదికగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు 24 గంటల ముందే ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు