ఆ దర్శకుడికి బన్నీతో సినిమా చేసే ఛాన్స్ దొరికినట్టేనా ?

తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ తో సినిమా చేయాలని చాలా మంద యువ దర్శకులు ఉవ్విళ్ళూరుతున్నారు. అలాంటి వారిలో విఐ ఆనంద్ కూడా ఒకరు. ఎన్నాళ్ల నుండో బన్నీతో సినిమా చేయాలని అనుకుంటున్న ఆయన ఇప్పటికే కథను కూడా సిద్ధం చేసుకున్నారని వినికిడి. అయితే బన్నీ వరుస కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటం వలన ఈ గ్యాప్లో అల్లు శిరీష్ తో ‘ఒక్క క్షణం’ చేశారు ఆనంద్.

అల్లు అర్జున్ కూడా ‘ఒక్క క్షణం’ సినిమాతో ఆనంద్ పనితనాన్ని దగ్గర నుండి గమనించాలని అనుకున్నారట. ఇక నిన్న విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడిగా ఆనంద్ మంచి మార్కులే కొట్టేశాడు. విమర్శకులు, ప్రేక్షకులు కథ, కథనాలపై ఆయనకున్న పట్టును తెగ మెచ్చుకున్నారు. దీన్నిబట్టి చూస్తే బన్నీ కూడా ఆనంద్ పనితీరు పట్ల ఇంప్రెస్ అయ్యుంటారని అనుకోవచ్చు. మరి ఆయన ఆనంద్ కు తనతో సినిమా చేసే అవకాశం ఎప్పుడిస్తారో చూడాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ వక్కంతం వంశీ డైరెక్షన్లో ‘నా పేరు సూర్య’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.